ఈ రోడ్డుపై ప్రయాణం.. సాగిపోతుందలా..!

హలో ఫ్రెండ్స్‌.. దేశవ్యాప్తంగా విడుదలయ్యే సినిమాలను ‘పాన్‌ ఇండియా’ అనీ, అదే ప్రపంచవ్యాప్తంగా అయితే ‘పాన్‌ వరల్డ్‌’ అని పిలుస్తుంటారు కదా!

Updated : 27 May 2023 04:48 IST

హలో ఫ్రెండ్స్‌.. దేశవ్యాప్తంగా విడుదలయ్యే సినిమాలను ‘పాన్‌ ఇండియా’ అనీ, అదే ప్రపంచవ్యాప్తంగా అయితే ‘పాన్‌ వరల్డ్‌’ అని పిలుస్తుంటారు కదా! అంతేకాదు.. ‘పాన్‌ ఇండియా’ స్టార్‌ అంటూ నటీనటులనూ వారి అభిమానులు పిలుచుకుంటూ సంబరపడిపోతున్నారు. ఇదంతా ఎందుకూ అంటే.. ఇప్పుడు మనం ‘పాన్‌ అమెరికా’ రహదారి గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి..ఆ విశేషాలివీ..

వివిధ ప్రాంతాలను రహదారులు కలుపుతాయని మనకు తెలుసు. రోడ్లలోనూ రాష్ట్ర, జాతీయ రహదారులని రకరకాలు ఉంటాయి. మన దేశంలో 44వ నెంబరు జాతీయ రహదారి అతి పొడవైనది. కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకూ ఉన్న ఈ రోడ్డు 3,745 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ‘అమ్మ బాబోయ్‌..’ అని అనుకుంటున్నారేమో.. కానీ, అంతకంటే పొడవైన రోడ్డు కూడా ఉంది. అదే.. ‘పాన్‌ అమెరికా హైవే’.

పద్నాలుగు దేశాల మీదుగా..

ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలను కలిపే ‘పాన్‌ అమెరికా’ హైవే ప్రపంచంలోనే అతి పొడవైన రహదారిగా రికార్డుల్లోకెక్కింది. అలస్కాలో మొదలై అర్జెంటీనా వరకూ ఈ రోడ్డు ఉంటుంది. రెండు ద్వీపాలను అనుసంధానించే ఈ మార్గ నిర్మాణాన్ని 1923లోనే ప్రారంభించారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ పాన్‌ అమెరికా రోడ్డు పద్నాలుగు దేశాల మీదుగా వెళ్తుందట. అందుకే, సుమారు 48 వేల కిలోమీటర్ల ఈ నిర్మాణాన్ని ఆయా దేశాలు సంయుక్తంగా చేపట్టాయి. ఇంతకీ ఆ దేశాలేంటో చెప్పనేలేదు కదూ.. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, మెక్సికో, గ్వాటెమాల, ఎల్‌ సల్వడార్‌, హాండరస్‌, నికరాగ్వా, కోస్టారికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్‌, పెరూ, చిలీ, అర్జెంటీనా.

డారియన్‌ గ్యాప్‌..

ఈ రహదారిలో 110 కిలోమీటర్ల నిర్మాణం మాత్రం ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. పనామా-కొలంబియాల మధ్య ఉండే ఈ ప్రాంతాన్ని ‘డారియన్‌ గ్యాప్‌’ అని పిలుస్తుంటారు. వివిధ కారణాల వల్ల ఈ కాస్తంత రోడ్డును వేయడం సాధ్యం కావడం లేదు. ఇక్కడ ఎక్కువగా కిడ్నాప్‌లు, స్మగ్లింగ్‌ తదితర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయట. ఈ మార్గంలో ప్రయాణించేవారు.. ఈ గ్యాప్‌ను దాటేందుకు పడవలు, విమానాలను ఆశ్రయిస్తుంటారు.    

నెలల తరబడి..

ప్రతి రోజూ సగటున 500 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తే, ఈ రహదారి మీద ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు రెండు నెలలకు పైగా సమయం పడుతుంది. కార్లెస్‌ సాంటామారియా అనే ఓ సైక్లిస్టు మాత్రం 177 రోజుల్లో పాన్‌ అమెరికా హైవేను చుట్టివచ్చాడు. ఇది ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ నమోదైంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని