‘కిక్‌’ ఇచ్చిన రికార్డు!

హలో ఫ్రెండ్స్‌.. ‘లాక్‌డౌన్‌ సమయంలో మనమంతా ఏం చేశాం?’ - బయటకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లోనే ఉండి సెల్‌ఫోన్‌లో ఆడుకోవడమో, ఏదైనా కొత్తగా నేర్చుకోవడమో చేసి ఉంటాం.

Published : 10 Jun 2023 00:06 IST

హలో ఫ్రెండ్స్‌.. ‘లాక్‌డౌన్‌ సమయంలో మనమంతా ఏం చేశాం?’ - బయటకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లోనే ఉండి సెల్‌ఫోన్‌లో ఆడుకోవడమో, ఏదైనా కొత్తగా నేర్చుకోవడమో చేసి ఉంటాం. అలాగే, ఓ నేస్తం కూడా దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఓ రికార్డూ సాధించాడు. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!!

రియాణా రాష్ట్రంలోని సోనిపట్‌కు చెందిన మార్టిన్‌ మాలిక్‌ ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. ఎనిమిదేళ్ల ఈ నేస్తం.. ఇటీవల మూడు నిమిషాల్లో 1700 పంచ్‌లు విసిరి రికార్డు సృష్టించాడు.

ప్రతి రోజూ సాధన..

లాక్‌డౌన్‌ సమయంలో అందరిలాగే మార్టిన్‌ కూడా ఇంటికే పరిమితమయ్యాడు. కుమారుడిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక, వాళ్ల నాన్న బాక్సింగ్‌ కిట్‌ కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఆయన కూడా గతంలో జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో పాల్గొన్నారట. ఆ బాక్సింగ్‌ కిట్‌ ఇంటికి రాగానే.. మార్టిన్‌ కొన్ని రోజులు ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకున్నాడు. అలా ప్రతిరోజూ ప్రాక్టీస్‌ చేయసాగాడు. మొదట్లో చేతులు బాగా నొప్పివచ్చేవట. వేళ్లకూ పుండ్లు పడేవి. అయినా, సాధన మాత్రం ఆపేవాడు కాదట. అలా కొద్దిరోజుల్లోనే పంచ్‌ బ్యాగ్‌కు వేగంగా కిక్‌లు ఇచ్చేలా రాటుదేలాడు. ఒకరోజు అది గమనించిన వాళ్ల నాన్న, కొడుకును ఏదైనా పోటీలకు పంపించాలని అనుకున్నాడు.  

పెద్దవాళ్లనూ అధిగమించి..

ఇటీవల మూడు నిమిషాల్లోనే 1700 కిక్‌లు ఇచ్చి.. గతంలో రష్యాకు చెందిన 27 ఏళ్ల పావెల్‌ పేరిట ఉన్న రికార్డును మార్టిన్‌ అధిగమించాడు. ఆయన మూడు నిమిషాల్లో 918 పంచ్‌లు మాత్రమే ఇవ్వగలిగాడు. ఇటీవల లండన్‌ పార్లమెంట్‌లోనూ మార్టిన్‌ను ఘనంగా సత్కరించారు. అంతేకాదు.. ‘గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు దక్కించుకున్నాడు. దీంతోపాటు భారతదేశ వ్యాప్తంగా, ఆసియాలో రెండు చొప్పున అవార్డులూ అందుకున్నాడు.

ఒలింపిక్‌ వీరుడి ప్రశంసలు

మార్టిన్‌ అద్భుత ప్రతిభకు ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా ఫిదా అయ్యాడట. తనను డిన్నర్‌కు ఆహ్వానించడంతోపాటు ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొనే అవకాశమూ ఇచ్చాడు. భవిష్యత్తులో తనకు ఏ సహాయం కావాలన్నా, కచ్చితంగా అందిస్తానని హామీ కూడా ఇచ్చాడట. ప్రజాప్రతినిధులూ ఈ నేస్తాన్ని అభినందనలతో ముంచెత్తారు. పిల్లలూ.. మార్టిన్‌కు మనమూ కంగ్రాట్స్‌ చెప్పేద్దాం.!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని