story: తాతయ్య చెప్పిన పాఠం..!

పిల్లలందరూ సాయంత్రం ఆడుకోవడానికి రవి వాళ్ల ఇంటి ముందున్న ఖాళీ స్థలానికి చేరారు. రవి వాళ్ల తాతయ్య అక్కడే కూర్చుని పిల్లల ఆటను చూస్తున్నారు

Updated : 30 May 2024 03:52 IST

వేసవి సెలవులు కావడంతో.. పిల్లలందరూ సాయంత్రం ఆడుకోవడానికి రవి వాళ్ల ఇంటి ముందున్న ఖాళీ స్థలానికి చేరారు. రవి వాళ్ల తాతయ్య అక్కడే కూర్చుని పిల్లల ఆటను చూస్తున్నారు. కొంతమంది పిల్లలు షటిల్, ఇంకొంత మంది క్రికెట్‌.. ఇలా వారికి నచ్చిన ఆటలు ఆడుకుంటున్నారు. కాసేపటికి.. ‘తాతయ్యా! గోపీ చూడండి.. ఔట్‌ అయినా కాలేదంటున్నాడు’ అని గట్టిగా అరిచాడు రవి. ‘లేదు తాతయ్యా! నేను చాలాసేపటి నుంచి ఔట్‌ అవ్వట్లేదని.. రవి అబద్ధాలు చెబుతున్నాడు’ అన్నాడు గోపి. ‘నేను మీ ఆటను గమనిస్తున్నాను. నువ్వు చెప్పేది నిజం కాదు రవి’ అన్నాడు తాతయ్య. అప్పుడు చిరాగ్గా బ్యాట్‌ కింద పడేసి.. ‘ఈ ఆట నాకు విసుగ్గా ఉంది. ఇక ఇది ఆడను.. వేరే ఆట ఆడతాను’ అంటూ పక్కకు వెళ్లిపోయాడు రవి. 
కాసేపటికి వంశీ పరిగెత్తుకుంటూ వచ్చి.. ‘తాతయ్యా! ఇలా చూడండి.. నేను నేల మీద నిల్చుంటే, అది నేల కాదు.. బండ అని రవి నన్ను బలవంతంగా తోసేస్తున్నాడు’ అని చెప్పాడు వంశీ. ‘అది కాదు తాతయ్యా! గోపి కాలి కింద చిన్నరాయి ఉంది. అప్పుడు అది బండ అవుతుంది కదా?’ వెనకాలే వచ్చిన రవి అన్నాడు. ‘రవి ఎప్పుడూ ఇంతే! ఓడిపోతున్నాననుకుంటే ఆటలో తొండి చేస్తాడు’ అన్నాడు వంశీ. ‘అలా చేయకూడదు.. ఆటల్లో గెలుపు ఓటములు సహజం. ఇద్దరూ గొడవ చేయకుండా సరిగ్గా ఆడుకోండి’ అన్నాడు తాతయ్య. ‘నువ్వెప్పుడూ నన్నే కోప్పడతావు తాతయ్యా!’ అంటూ విసుగ్గా అన్నాడు రవి. అప్పుడు ఆయన పిల్లలందరినీ దగ్గరకు పిలిచి.. ‘రేపు మీ అందరికీ సరదాగా క్విజ్‌ పెడతాను. బాగా చదువుకొని వస్తారా?’ అన్నాడు. ‘ఓ.. తప్పకుండా చదువుతాం’ అని బదులిచ్చారు పిల్లలు. ఇక మరుసటి రోజు పిల్లలందరినీ వరస క్రమంలో కూర్చోబెట్టి.. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయమని చెప్పాడు తాతయ్య. అడగటం పూర్తవ్వగానే.. ‘పిల్లలూ! మీరు జవాబులు రాసిన పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి’ అన్నాడు. పిల్లలంతా వెళ్లి, వారి పుస్తకాలు తాతయ్య దగ్గర పెట్టారు. ఆయన వాటిని పరిశీలించి.. ప్రథమ విజేత వంశీ, ద్వితీయ విజేత గోపి’ అని చెప్పాడు. దాంతో రవి మళ్లీ ముఖం మాడ్చుకున్నాడు. తనను దగ్గరకు పిలిచి.. ‘ఈ ప్రశ్నలు ఎప్పుడూ అడిగేవే. అన్నీ నీకు వచ్చిన జవాబులే. మరెందుకు ఇన్ని తప్పులు రాశావు?’ అని చిన్నగా అడిగాడు తాతయ్య. అయినా రవి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. ‘తాతయ్యా! రవి అంటే నాకు చాలా ఇష్టం. కానీ నేనంటే రవికి కోపం. నిజానికి నాకన్నా రవే బాగా చదువుతాడు. ముందు రాయాలనే తొందరపాటులో ఎక్కువ తప్పులు రాశాడు’ అన్నాడు వంశీ. ‘నేనెంత బాగా చదివినా నాకు మార్కులు తక్కువగానే వస్తాయి’ ఏడుపు ముఖంతో అన్నాడు రవి. 
వాళ్ల మాటలు విన్న తాతయ్య.. ‘పిల్లలూ.. మీరంతా వచ్చి ఇలా కూర్చోండి. మీకు ఓ ముఖ్యమైన విషయం చెబుతాను’ అని పిలిచారు. వాళ్లంతా వచ్చి కూర్చున్నారు. ‘పిల్లలూ!  ఎప్పుడూ మనల్ని ఎవరితోనూ పోల్చుకోకూడదు. ఎదుటి వాళ్లను చూసి, మనం అలా లేమని బాధ పడితే.. మనలో అసూయ ఏర్పడుతుంది. అలా కాకుండా వారెలా గెలుస్తున్నారో సలహాలు, సూచనలు తీసుకోండి. వాటిని కూడా గుడ్డిగా అనుకరించకుండా మీ సొంత ఆలోచనలతో మార్పు చేసుకోండి. ఓటమికి కుంగిపోకుండా, గెలిచినవారిపై అసూయపడకుండా ఎప్పుడూ ప్రయత్నం చేస్తుండాలి’ అని చెప్పాడు తాతయ్య. ఆయన మాటలకు అలాగేనంటూ తలూపి.. ‘ఇక నుంచి మనం ఎలాంటి గొడవా పెట్టుకోకుండా ఎంచక్కా ఆడుకుందాం. చదువుకోవడంలో కూడా ఒకరికి ఒకరం సాయం చేసుకుందాం సరేనా!?’ అని వంశీతో అన్నాడు రవి. దానికి అలాగేనంటూ ఆనందంగా జవాబిచ్చాడు వంశీ. 
కె.వి.సుమలత 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని