నక్క జిత్తులు.. కోతి ఎత్తులు!

ఒక చిట్టడవికి రాజు.. పులి. దాని దగ్గర సహాయకురాలిగా ఉండే నక్క చనిపోయింది. ఈ విషయం తెలిసిన మరో నక్క పులి దగ్గరకు వచ్చి ‘పులి రాజా! నేను నీకు సహాయకుడిగా ఉంటాను’ అంది. ‘నాకు వేటాడే శక్తి సన్నగిల్లింది. కాళ్లలో సత్తువ లేదు. నువ్వు జంతువులకు మాయ మాటలు చెప్పి నా గుహలోకి తీసుకొస్తే ఎలాగోలా వాటిని చంపి తిన్నంత తిని... మిగిలింది నీకు వదిలేస్తాను. ఇందుకు సమ్మతమైతే నాతో ఉండొచ్చు’

Updated : 26 Mar 2021 01:41 IST

క చిట్టడవికి రాజు.. పులి. దాని దగ్గర సహాయకురాలిగా ఉండే నక్క చనిపోయింది. ఈ విషయం తెలిసిన మరో నక్క పులి దగ్గరకు వచ్చి ‘పులి రాజా! నేను నీకు సహాయకుడిగా ఉంటాను’ అంది. ‘నాకు వేటాడే శక్తి సన్నగిల్లింది. కాళ్లలో సత్తువ లేదు. నువ్వు జంతువులకు మాయ మాటలు చెప్పి నా గుహలోకి తీసుకొస్తే ఎలాగోలా వాటిని చంపి తిన్నంత తిని... మిగిలింది నీకు వదిలేస్తాను. ఇందుకు సమ్మతమైతే నాతో ఉండొచ్చు’ అంది పులి. ‘ఈ ముసలి పులి ఏ మాత్రం తింటుంది. మొత్తం నాకే వదిలేస్తుంది’ అని ఆనందంగా ఒప్పుకుంది నక్క.
జంతువుల కోసం నక్క అడవిలో తిరుగుతుంటే ఒక కుందేలు కనిపించింది. ‘నువ్వు చూస్తే కొత్తగా ఉన్నావు. పులి దగ్గర పనిచేస్తున్నావా?’ అంది కుందేలు. ‘అవును నేను ఈ అడవికి కొత్త నాకు పులి గురించి తెలియదు. నేనూ నీలాగే శాకాహారిని’ అని మాయమాటలు చెప్పి కుందేలుతో స్నేహం కలిపింది.
‘నీకో విషయం చెప్పాలి. ఇక్కడకు దగ్గర్లో ఒక తోట ఉంది. అక్కడ రకరకాల ఆకుకూరలు, దుంపలు మనకు తినడానికి దొరుకుతాయి వెళదాం పద’ అంది నక్క. ‘సరే ఆ చోటు చూపించు?’ అంది కుందేలు. అవి వెళుతుండగా వాటికి జింక ఎదురైంది.  
‘జింక బావా! భయపడకు.. ఈ నక్క శాకాహారి. మనకు మంచి ఆకుకూరలు, దుంపలు దొరికే చోటుకు తీసుకెళుతోంది. నువ్వు కూడా మాతోపాటు రా’ అంది కుందేలు. జింక కూడా నమ్మి వాటితో పాటు నడవసాగింది. వీరు వెళ్లేది కొద్ది దూరంలో ఉన్న చెట్టు మీద నుంచి కోతి చూసింది. నక్క ఏదో పన్నాగం పన్ని వాటిని తీసుకెళుతోందని గ్రహించింది. కిందకు వచ్చి ‘స్నేహితులంతా బాగున్నారా.. ఎక్కడకు వెళుతున్నారు?’ అంది కోతి. విషయమంతా వివరంగా చెప్పింది జింక.
‘కోతి బావా! నువ్వు కూడా నా స్నేహాన్ని అంగీకరించాలి’ అంది నక్క ఎంతో వినయంగా. ‘ఓ.. తప్పకుండా మా వాళ్లు నీ స్నేహం అంగీకరించాక నేనెలా కాదనగలను’ అని చిరునవ్వు నవ్వింది కోతి. ‘ఇంకా కొద్ది దూరంలో పులి గుహ వస్తుంది. నువ్వు తీసుకెళ్లే చోటు ఎక్కడుంది’ అంది జింక. ‘గుహ ఉన్న సంగతి నాకు అంతగా తెలియదు. కాసేపట్లో తోట వస్తుంది. నన్ను నమ్మండి’ అని నక్క నీళ్లు నమలడం కోతి గమనించింది.
‘నాకు బాగా ఆకలిగా ఉంది’ అంది కుందేలు. ‘అవును.. నాకు కూడా’ అంది జింక. ‘అటు పక్కగా కొన్ని అరటి చెట్లున్నాయి. నేను వెళ్లి మనందరి కోసం కొన్ని పండ్లు తెస్తాను. తిన్న తర్వాత బయలుదేరదాం. అంతవరకు ఇక్కడే ఉండండి’ అంది కోతి.  
‘ఓ అలాగే వెళ్లి త్వరగా పండ్లు తీసుకురా కోతి బావా’ అంది కుందేలు. కోతి వెళుతూ.. ఈ జిత్తుల మారి నక్క ఉచ్చులో మా వాళ్లు తేలిగ్గా పడ్డారు. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ముందుగా అరటి పండ్ల గెలలో కొన్నింటిని లాగింది.
గబగబా తిరిగి వచ్చి ముందుగా కుందేలుకు ఒక అరటి పండు, జింకకు మూడు ఇచ్చింది. తర్వాత ‘నక్క బావా! నువ్వు తోలుతో తినలేవు. అందుకని తోలు తీసి ఇస్తాను’ అని రెండు అరటిపండ్లను నక్క నోటికి అందించింది. నక్క అరుస్తూ కిందపడి దొర్లసాగింది. అక్కడికి సమీపంలోనే ఉన్న పులి.. నక్క అరుపులు విని గట్టిగా గాండ్రించింది. కోతి, కుందేలు, జింక కొంతదూరం పరుగుపెట్టాయి. కాసేపటికి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాక.. ‘నిజమే పులి గుహ దగ్గర్లోనే ఉంది’ అంది జింక.
‘పిచ్చి స్నేహితుల్లారా.. మీరు ఆ జిత్తులమారి నక్కను ఎలా నమ్మారు? మన ఆహారాన్ని మనకు దగ్గర్లో ఉన్న చోటే కష్టపడి సంపాదించుకోవాలి. ఎక్కడో తోట ఉందంటే నమ్మి వెళ్లడమేనా?’ అని కోతి చీవాట్లు పెట్టింది. ‘అవును కోతి బావా! నువ్వు రాకపోతే మేము ఆ పులికి ఆహారమయ్యేవాళ్లం’ అని కుందేలు అంది. ‘ఇంతకూ ఏం చేశావు? ఆ నక్క అలా విలవిల్లాడింది’ అంది జింక. ఎండిన పల్లేరు కాయల్ని అరటిపండులో పెట్టి ఇచ్చానని చెప్పింది కోతి. ‘కోతి బావా!.. నీ తెలివితో ఈ రోజు మా ప్రాణాలు కాపాడావు. నీకు కృతజ్ఞతలు’ అన్నాయి కుందేలు, జింక.

- యు.విజయశేఖర రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని