Published : 17 Aug 2020 00:57 IST

మాధవయ్య మొహమాటం

మాధవయ్య చాలా మొహమాటస్తుడు. ఎవరు ఏదడిగినా కాదనకుండా ఇచ్చేస్తుంటాడు. మళ్లీ తిరిగి అడగటానికి అతనికి ఎక్కడలేని బెరుకు. అలాంటి మాధవయ్య వస్త్రాల వ్యాపారం మొదలెట్టాడు. అతని స్వభావం తెలిసి, అంతా అరువు తీసుకుపోయేవారేగానీ, డబ్బు చెల్లించేవారు లేరు.

కొట్టు పనుల్ని చూసుకోడానికి చంద్రయ్య, సవరయ్యల్ని నియమించుకున్నాడు మాధవయ్య. కొద్దిరోజులకే యజమాని మొహమాటం వాళ్లకర్థమైంది. ‘ఇలా అరువిచ్చి ఊరుకుంటే వ్యాపారం గతేంటి?’ అని మాధవయ్యని అడిగితే, ‘ఉన్నప్పుడు వాళ్లే తెచ్చిస్తారులే, ఆమాత్రం దానికి వాళ్ల మనసుల్ని బాధపెట్టడం దేనికి!’ అంటాడు.

ఒకరోజు మాధవయ్య పక్కూరెళ్లి తిరిగొచ్చేసరికి తన కొట్టు దగ్గర గొడవవుతోంది.

‘చూడు మాధవయ్యా! నీ పనివాళ్లెలా వాగుతున్నారో! నీ బాకీ తీర్చలేనివాళ్లలా కనిపిస్తున్నామా!’ అని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

‘అసలీ దుకాణం నీదా, వాళ్లదా? నీ బాకీ తీర్చడం మాకొక లెక్కా’ అని రుసరుసలాడాడు ఇంకో వ్యక్తి.

‘మా పనివాళ్లు మిమ్మల్ని ఏదైనా అనుంటే క్షమించండి! ఏమర్రా.. ఏంటిదంతా!’ అన్నాడు మాధవయ్య.

‘ముందు మేం చెప్పేది వినండి. ఇదిగో ఈయన పేరు మల్లయ్య. ఈ మధ్యనే అయిదొందలకి వస్త్రాలు పట్టుకెళ్లాడు. పది రోజులు కూడా తిరక్కుండానే ఆ డబ్బు తెచ్చిచ్చేశాడు. అదే సమయంలో ఇక్కడికొచ్చిన ఈ పెద్దమనుషులతో ‘మళ్లీ అడిగించుకునే పనిలేకుండా బాకీ తీర్చేశాడు. అదీ మర్యాదంటే అని అన్నామంతే, వాళ్లని దెప్పుతున్నామనుకున్నారో ఏమో, గొడవకు దిగారు’ చెప్పాడు సవరయ్య.

అదే సమయంలో తిమ్మయ్య అనే ఆసామి వచ్చి ‘మాధవయ్యగారూ! క్షమించాలి. నెల కిందట అరువు మీద మీదగ్గర వస్త్రాలు తీసుకెళ్లాను. బాకీ త్వరగా తీర్చేద్దామనే అనుకున్నాను. కానీ, వేరే అత్యవసర పని వల్ల కుదరలేదు. నన్ను క్షమించాలి! ఇదిగో మీ బాకీ’ అని సొమ్ము చేతిలో పెట్టాడు.

‘చూశారర్రా, మనుషులన్నాక ఏవో అవసరాలుం టాయి. వీలున్నప్పుడు వాళ్లే అప్పు తీరుస్తారు. ఆ మాత్రం దానికి గొడవలు పెట్టుకుంటే ఎలా? ఇలా అయితే నాకు నచ్చదు. వెంటనే పని మానెయ్యండి’ చంద్రయ్య, సవరయ్యలకి కోపంగా చెప్పేశాడు మాధవయ్య.

‘సరేనయ్యా, ఇప్పుడే తప్పుకుంటాం’ అంటూ ఇద్దరూ వెళ్లిపోయారు.

‘అయ్యా మాధవయ్యగారూ! మీదెంత మంచి మనసు. దాన్ని అలుసుగా తీసుకుని మీ బాకీ తీర్చకుండా నాన్చుతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఇదిగో, మీ బాకీ తీసుకోండి’ అని వాళ్లిద్దరూ అప్పు చెల్లించారు.

మర్నాడు చంద్రయ్య, సవరయ్యలు మళ్లీ కొట్టు దగ్గరికొచ్చి ‘ఆ పెద్దమనుషులు బాకీ చెల్లించి ఉంటే మా ప్రయోగం ఫలించినట్లే!’ అన్నారు.

‘ప్రయోగమా!’ ఆశ్చర్యంగా అడిగాడు మాధవయ్య.

‘మీ స్వభావాన్ని అలుసుగా తీసుకుని అంతా అరువులు పెట్టేవారేగానీ, తీర్చేవారు లేరు. అందుకే మల్లయ్య, తిమ్మయ్యలతో నాటకమాడించాం. వ్యాపారం విషయంలో మరీ ఇంత మొహమాటం ఉంటే కష్టం’ అన్నారు.

మాధవయ్య వాళ్ల తెలివిని మెచ్చుకుని మళ్లీ పనిలో చేర్చుకున్నాడు. అప్పటి నుంచి మొహమాటం వదిలిపెట్టి బాకీలు వసూలు చేసుకోవడం మొదలుపెట్టాడు. పనివాళ్ల సాయంతో దుకాణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాడు.

- కె.కె.రఘునందన, విజయనగరం.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts