Moral story: విజయుడి గురుదక్షిణ..!

చంద్రగిరి రాజ్యంలో పార్వతీపురం అనే గ్రామం ఉండేది. అక్కడ రామశర్మ నడిపే గురుకులానికి మంచి పేరుంది. యువరాజులే కాకుండా సామాన్యులు కూడా విద్యను అభ్యసించడానికి అక్కడికి వస్తుంటారు

Published : 18 Jun 2024 00:12 IST

చంద్రగిరి రాజ్యంలో పార్వతీపురం అనే గ్రామం ఉండేది. అక్కడ రామశర్మ నడిపే గురుకులానికి మంచి పేరుంది. యువరాజులే కాకుండా సామాన్యులు కూడా విద్యను అభ్యసించడానికి అక్కడికి వస్తుంటారు. ఎంతో మందిని రామశర్మ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారు. రామశర్మ, సీతమ్మల కుమారుడు గణపతి. తనకి చదువు ఏమాత్రం  అబ్బలేదు. ‘కుమారుడికి సరిగ్గా విద్యాబుద్ధులు నేర్పలేకపోయానే’ అని రామశర్మ చాలా బాధ పడుతుండేవాడు. అది విజయుడు అనే విద్యార్థి గమనించాడు. పేదవాడైన తనను గురుకులంలో చేర్పించి.. అన్ని విద్యలూ నేర్పిస్తున్న గురువుకి చక్కని బహుమతి ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఒకసారి రామశర్మ అతని భార్య.. గణపతి గురించి మాట్లాడుతూ బాధపడుతుండగా విజయుడు వచ్చి.. ‘గురువుగారు గణపతి బాధ్యత నాకు అప్పగించండి. అతనికి విద్య పట్ల ఆసక్తి కలిగించే.. ప్రయత్నం చేస్తాను’ అన్నాడు. ఆ మాటలు విని.. ‘అలాగే కానీ మరి నీ చదువు సంగతేంటి?’ అడిగాడు రామశర్మ. ‘ఫర్వాలేదు గురువుగారు.. నేను రాత్రి సమయాల్లో నా విద్యను కొనసాగిస్తాను’ అని ఒప్పించాడు విజయుడు. 

కొన్ని రోజుల తర్వాత.. గణపతికి ఇతర ప్రాంతాలకు వెళ్లి వింతలూ విశేషాలూ చూడాలని.. అలాగే ఆటలు బాగా ఆడాలన్న కోరికలు ఉన్నాయని గ్రహించాడు విజయుడు. దాంతో పక్క ఊరులో కొన్ని ప్రాంతాలు చూసి వద్దామని.. తనని తీసుకొని, బయలుదేరాడు. ఆ సమయంలో గణపతి ముఖంలో ఎప్పుడూ చూడని వెలుగు చూసి.. తల్లిదండ్రులు చాలా సంతోషించారు. పక్క గ్రామానికి వెళ్లాక.. అతనికి కొండలూ గుట్టలూ చూపించాడు విజయుడు. ఇక సాయంత్రం అవడంతో ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. గురుకులానికి చేరుకున్నాక రాత్రి పడుకునే ముందు.. తల్లిదండ్రులకు అక్కడ చూసిన విషయాలన్నీ చెప్పాడు గణపతి. దాంతో రామశర్మ, సీతమ్మల మనసు కాస్త కుదుటపడింది. 

మరుసటి రోజు గణపతిని పిలిచి.. ఆటలు ఆడదామని చెప్పాడు విజయుడు. దానికి సరేనంటూ బదులిచ్చాడతను. వారం రోజుల్లోనే.. వాళ్లిద్దరి మధ్యా మంచి స్నేహం కుదిరింది. ‘చూడు గణపతి నీకు అలసట వచ్చే వరకు ఆటలు ఆడదాం. కాకపోతే నువ్వు నా మాట వినాలి’ అన్నాడు విజయుడు. ‘ఓ అలాగే తప్పకుండా వింటాను’ అన్నాడు గణపతి. దాదాపు రెండు గంటల పాటు ఎంచక్కా ఆడుకున్నాక.. ‘ఇప్పుడు చెప్పు మిత్రమా..! ఏం చేయాలి’ అన్నాడు గణపతి. అప్పుడు విజయుడు పుస్తకం తీసి.. ‘నేను చెప్పింది విని అది రాయాలి’ అన్నాడు. చదువుకు సంబంధించిన విషయం చెప్పేసరికి గణపతి ముఖం మాడ్చాడు. కానీ మాట ప్రకారం ‘అలాగే.. కానీ ఒక అరగంట వరకే చదువుతాను’ అన్నాడు. ‘సరే.. అరగంటలో ముగిస్తాను’ అన్నాడు విజయుడు. కొంత సమయమే.. కాబట్టి శ్రద్ధగా చదివాడు. తర్వాత భోజనం చేసి నిద్రపోయాడు గణపతి. 

మరుసటి రోజు మరో కొత్త రకం ఆట ఆడించాడు విజయుడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు గణపతిని కూర్చోబెట్టుకుని.. ‘ఎంతో మంది విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దిన ఘనత మీ నాన్నది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆయనకు మంచి పేరుంది. నువ్వు కూడా చదువు పట్ల ఆసక్తి చూపాలి. లేకపోతే.. అది ఆయనకు అవమానకరంగా ఉంటుంది. అది నీకు ఇష్టమేనా?’ అన్నాడు విజయుడు. ‘లేదు మిత్రమా..! నా వల్ల నాన్న అవమానపడటం నాకు ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు మాట రానివ్వను. ఇప్పుడు నాకు చదువు విలువ తెలుసొచ్చింది. బాగా చదువుకొని తప్పకుండా నాన్నకి మంచి పేరు తెస్తాను’ అని మాటిచ్చాడు గణపతి. అప్పటి నుంచి.. చదువు పట్ల ఆసక్తి చూపసాగాడు. ఒక ఏడాది సమయంలో అన్ని విద్యల మీద పట్టు సాధించాడు. కుమారుడిలో వచ్చిన మార్పు చూసి.. రామశర్మ, సీతమ్మలు చాలా సంతోషించారు. దానికి కారణమైన విజయుడికి వారి ఆశీర్వాదాలు అందించారు. ‘విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు.. విజయుడు మంచి గురుదక్షిణ ఇచ్చాడు’ అంటూ గురుకులంలోని వాళ్లంతా.. అతన్ని ఎంతగానో పొగిడారు. ఆ తర్వాత కొంత కాలంలోనే తన విద్య పూర్తి చేసుకొని.. మహారాజు ఆస్థానంలో ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాడు విజయుడు. 
యు.విజయశేఖర రెడ్డి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని