దారి చూపిన రామచిలుక!

గోమతి రాజ్యాన్ని పరిపాలించే చంద్రసేన మహారాజుకు గొప్ప పరిపాలనాదక్షుడిగా పేరుంది. తన రాజ్యంలో ప్రజలను ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకునేవాడు. అందుకే రాజుగారంటే ప్రజలకు విపరీతమైన అభిమానం. చంద్రసేనుడికి సుచేతుడు అనే మంత్రి అన్ని నిర్ణయాల్లో సహేతుకమైన సలహాలు ఇస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచడంలో తనవంతు పాత్ర పోషిస్తూ ఉండేవాడు.

Published : 17 Feb 2023 00:06 IST

గోమతి రాజ్యాన్ని పరిపాలించే చంద్రసేన మహారాజుకు గొప్ప పరిపాలనాదక్షుడిగా పేరుంది. తన రాజ్యంలో ప్రజలను ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకునేవాడు. అందుకే రాజుగారంటే ప్రజలకు విపరీతమైన అభిమానం. చంద్రసేనుడికి సుచేతుడు అనే మంత్రి అన్ని నిర్ణయాల్లో సహేతుకమైన సలహాలు ఇస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచడంలో తనవంతు పాత్ర పోషిస్తూ ఉండేవాడు. ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్న ఆ రాజ్యానికి అనుకోని కష్టం వచ్చింది.
ఓ దొంగల ముఠా రాజ్యంలోకి ప్రవేశించి, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. రోజుకో దొంగతనం చేస్తూ అడ్డువచ్చిన వారిని చంపేస్తూ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రజలంతా రాజుగారి దగ్గరకు చేరుకుని తాము దొంగల వల్ల పడుతున్న కష్టాలను చెప్పుకొచ్చారు. ప్రజల ఆవేదన విన్న రాజు త్వరలో ఈ సమస్యకు ముగింపు పలుకుతానని హామీ ఇచ్చారు.

జనాలు వెళ్లిన తర్వాత... రాజు చంద్రసేనుడు, మంత్రితో.. ‘సుచేతా... ఈ దొంగల సమస్యకు ఏదైనా పరిష్కారం సూచించండి’ అన్నాడు. కాసేపు ఆలోచించిన తర్వాత, సుచేతుడు బదులిస్తూ... ‘మహారాజా... బయట భటుల సంఖ్యను రెట్టింపు చేసి రాత్రి వేళల్లో సంచారం చేయిద్దాం. అందువల్ల దొంగలను కట్టడి చేయవచ్చు’ అన్నాడు.

అందుకు చంద్రసేనుడు సమ్మతించి అంతఃపుర భటులను పంపి, రాత్రి పూట రాజ్యంలో కాపలా కాసే భటుల సంఖ్యను రెట్టింపు చేశాడు. మూడురోజుల పాటు ఎటువంటి దొంగతనం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాజు చాలా సంతోషించాడు. కానీ అనుకున్నదొకటి అయినది మరోటి! ఈసారి ఏకంగా ఖజానాలో దొంగతనం జరిగింది. అమూల్యమైన సంపద దొంగల పాలైంది.

రాజు మంత్రితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు.

‘మహారాజా...! దొంగలు చాలా తెలివైన వాళ్లలా ఉన్నారు. ఖజానా దోచుకోవడానికి పన్నిన పన్నాగంలా ఉంది’ అన్నాడు సుచేతుడు. దొంగల తెలివికి ఆశ్చర్యపోయాడు చంద్రసేనుడు. పరిష్కారం ఆలోచిస్తున్న వారి మధ్యలోకి ఓ రామచిలుక ఎగురుకుంటూ వచ్చింది.

రామచిలుకను వెంబడిస్తూ ఓ గద్ద వచ్చింది. ‘రాజా.. దయచేసి నన్ను ఈ రాకాసి గద్ద నుంచి రక్షించండి’ అంటూ వేడుకుంది చిలుక. రాజు గద్దను వెళ్లగొట్టడంతో రామచిలుక ఊపిరి పీల్చుకుంది. ‘మహారాజా...! అడవిలో నివసిస్తున్న నన్ను ఈ గద్ద చంపడానికి ప్రయత్నిస్తుంటే పారిపోయి ఇలా వచ్చాను. మీరు నా ప్రాణాలు కాపాడారు. మీకు కృతజ్ఞతలు’ అంది రామచిలుక.

‘నువ్విక్కడే ఉండొచ్చు’ అని రాజు అనడంతో రామచిలుక సంతోషించింది. అనంతరం కోటలో ఉన్న చెట్టుపై కూర్చున్న రామచిలుక రాజు, మంత్రి సంభాషణ అంతా వింది. వెంటనే రివ్వున ఎగురుకుంటూ వచ్చి.. ‘రాజా.. మీ మాటలు విన్న తర్వాత దొంగల భయంతో ఈ రాజ్యం అల్లాడుతోంది అనే విషయం అర్థమైంది. నా ప్రాణాలు కాపాడిన మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. దొంగలను నేను అడవిలో చూశాను. మీరు వస్తే వారి స్థావరాన్ని చూపించగలను. కాకపోతే వారు మెరుపువేగంతో కదులుతారు. వారిని పట్టుకోవడం అంటే కత్తిమీద సాములాంటిది’ అంది రామచిలుక.  

మంత్రి సుచేతుడు.. ‘చిలుకా... నువ్వు మాకు దారి చూపించు. సాయుధులైన భటులతో నిన్ను అనుసరిస్తాం’ అన్నాడు. మరుసటి రోజు రామచిలుక దారి చూపుతుండగా భటులు స్థావరాన్ని కనుగొని దొంగలను పట్టుకున్నారు. వారు దోచుకున్న సొమ్మంతా స్వాధీనం చేసుకున్నారు. దొంగల పీడ విరగడ అయినందుకు ప్రజలంతా సంతోషించారు. ఓరోజు రాజు గారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆస్థానానికి వచ్చారు.

‘మహారాజా... దొంగల బెడద నుంచి మమ్మల్ని కాపాడారు. ఇప్పుడు కంటి నిండా హాయిగా నిద్రపోతున్నాం. మీకు కృతజ్ఞతలు’ అన్నారు. అందుకు చంద్రసేనుడు నవ్వుతూ... ‘ప్రజలారా... నాకు కాదు కృతజ్ఞతలు చెప్పాల్సింది. ఈ చిలుకకు! ఇదే గనక మనకు దొంగల స్థావరం చూపించకపోతే మనకు వాళ్లు దొరికేవారు కాదు’ అంటూ రామచిలుక తెలివి, సమయస్ఫూర్తిని ప్రశంసించాడు. ప్రజలంతా రామచిలుకకు కృతజ్ఞతలు తెలియజేశారు.

వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని