Published : 27 Jan 2023 00:17 IST

ఉండేది వేలెడంత.. లాభాలు బోలెడంత!

ఎంచక్కా జేబులో వేసుకుని వెళ్లొచ్చు... నీటిని మంచినీటిగా మార్చుకుని తాగేయొచ్చు... ఖర్చూ తక్కువే... ఫలితం మాత్రం అద్భుతం! ఉండేది వేలెడంతే.. కానీ లాభాలు మాత్రం బోలెడంత! ఇంతకీ ఏంటిది... ఎవరు తయారు చేశారో తెలుసా!

కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిరంజన్‌ కరగి అనే అన్నయ్య ప్రపంచంలోకెల్లా అత్యంత చవకైన వాటర్‌ ఫ్యూరిఫయర్‌ను తయారు చేశాడు. దీని ఖరీదు కేవలం 20 రూపాయలు మాత్రమే. నిజానికి ఈ ధరకు ఓ లీటర్‌ నీళ్లసీసా కూడా రాదు. కానీ ఇంత తక్కువ మొత్తానికి ఏకంగా నీటిని శుద్ధి చేసే ఓ బుజ్జి పరికరమే వచ్చేస్తుంది.

జేబులో జేజేలు!

ఈ పరికరానికి నీర్‌నల్‌ అని పేరు పెట్టారు. దీన్ని ఎక్కడికంటే అక్కడికి జేబులో వేసుకుని తీసుకెళ్లొచ్చు. దాదాపు కీచైన్‌ అంతే ఉంటుంది. అందుకే దీన్ని ‘ప్యూరిటీ ఇన్‌ యువర్‌ పాకెట్‌’ అని పిలుస్తున్నారు. ఈ పరికరం సాయంతో 300 లీటర్ల వరకు నీటిని శుద్ధి చేయొచ్చు. దీన్ని మనం సాధారణంగా వాడే నీళ్లసీసాకు తేలికగా అమర్చుకోవచ్చు.

కార్బన్‌ సాయంతో...

నిరంజన్‌ కరగి ఈ పరికరం తయారీలో కార్బన్‌, దూది, జల్లెడ, ఓ రహస్య పదార్థాన్ని వాడుతున్నాడు. ఇప్పటి వరకు కొన్ని లక్షల నీర్‌నల్‌ పరికరాలను తయారు చేశాడు. అమెరికా, ఖతార్‌, సింగపూర్‌, మలేసియాలాంటి 15 దేశాలకూ ఎగుమతి చేస్తున్నాడు. ఈ పరికరాల ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేసేందుకు, కర్ణాటక ప్రభుత్వం నిరంజన్‌కు దాదాపు 20 లక్షల రూపాయల నిధులను కూడా సమకూర్చింది. నీర్‌నల్‌ను సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు బలగాలు, సైనికులు, నౌకాదళానికి కూడా అందేలా చేస్తున్నారు.

పేద ప్ర‘జల’ కోసమే....!

పేద ప్రజలు స్వచ్ఛమైన నీటికోసం పెద్దమొత్తంలో ఖర్చు చేయలేరు. వారికిది తలకు మించిన భారం. పేదల కోసమే ఈ పరికరాన్ని నిరంజన్‌ తయారు చేశాడు. ఇది మురికిగా ఉన్న నీటిని క్షణాల్లోనే స్వచ్ఛంగా మారుస్తుంది. 99.9 శాతం బ్యాక్టీరియా రహితం చేస్తుందని చెబుతున్నాడీ అన్నయ్య. సాధారణ నీళ్లసీసాకు ఈ పరికరాన్ని బిగించి, దానిలోంచి నీరు వచ్చేలా చేస్తే చాలు అది స్వచ్ఛంగా మారిపోతుంది.

ఆలోచన ఎలా వచ్చిందంటే...

నిరంజన్‌ ఓసారి స్కూల్లో ఓ పేద విద్యార్థి అపరిశుభ్రమైన నీటిని తాగడం చూశాడు. ఇలా చాలా మంది విద్యార్థులు చేతిపంపు దగ్గర, ప్లాస్టిక్‌ సీసాల్లో నీటిని నింపుకొని తాగారు. శుద్ధి చేసిన నీటిని కొనుక్కొని తాగే స్తోమత లేదని బాధపడ్డాడు. అప్పుడు వచ్చిన ఆలోచనల్లోంచే ఈ నీర్‌నల్‌ ప్రాణం పోసుకుంది.

లక్ష్య సాధనలో...

ప్రతి పాఠశాల విద్యార్థికీ నీర్‌నల్‌ను చేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం నిరంజన్‌ ఉప్పు నీటిని తక్కువ ఖర్చుతో మంచినీటిగా మార్చే పరికరం తయారీ కోసం పరిశోధనలు చేస్తున్నాడు. అన్నయ్య చేసే ఈ ప్రయోగమూ విజయం సాధించాలని మనం మనసారా కోరుకుందామా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని