Peyton Thorsby: భయపడలేదు.. నిలిచి.. గెలిచింది!
హాయ్ నేస్తాలూ.. అమ్మ మనకు ఏదైనా పని చెబితే, ‘అబ్బా’ అనుకుంటాం. సరదాగా ఎటైనా బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా స్నేహితులు తోడుగా ఉంటే బాగుండుననుకుంటాం.
హాయ్ నేస్తాలూ.. అమ్మ మనకు ఏదైనా పని చెబితే, ‘అబ్బా’ అనుకుంటాం. సరదాగా ఎటైనా బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా స్నేహితులు తోడుగా ఉంటే బాగుండుననుకుంటాం. జట్టుగా ఆడే ఆటల్లాంటి వాటిల్లోనైతే మనకు పెద్దగా మెలకువలు తెలియకపోయినా, వేరే వాళ్లు ఉంటారు కదా అని మనకు మనమే ధైర్యం చెప్పుకొంటాం. కానీ, ఓ ఎనిమిదేళ్ల బాలిక మాత్రం ముందురోజు వరకూ వెంటే ఉన్న బృంద సభ్యులు.. సరిగ్గా పోటీల సమయానికి రాకపోయినా నిరుత్సాహపడలేదు. తనొక్కతే పాల్గొని, అద్భుత ప్రతిభతో విజేతగా నిలిచింది. మరి ఆ నేస్తం ఎవరో.. తన విశేషాలేంటో తెలుసుకుందామా..!
అమెరికా లాంటి దేశాల్లో చిన్నపిల్లలకు ‘ఛాంపియన్‌షిప్స్ చీర్ కాంపిటీషన్’ పేరిట ఏటా పోటీలు నిర్వహిస్తుంటారు. సమావేశాలూ, ప్రదర్శనల్లో అందరి ముందు మాట్లాడాలంటే చిన్నారుల్లో ఉండే భయాన్ని పోగొట్టి, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనేదే దీని ఉద్దేశం. ఎప్పటిలాగే ఈ ఏడాది ఫ్లోరిడా రాష్ట్రంలో పోటీలు నిర్వహించారు. కొందరు చిన్నారులు కలిసి జట్టుగా పొల్గొనే ఈ పోటీల్లో.. అనూహ్యంగా ‘పేటొన్ థోర్స్‌బై’ అనే ఎనిమిదేళ్ల బాలిక సోలోగా ట్రోఫీని దక్కించుకుంది.
నిరాశ చెందకుండా..
ఈ పోటీల్లో పేటొన్‌తో పాటు మరో నలుగురు బాలికలు సభ్యులుగా ఉన్న జట్టు పాల్గొనాల్సి ఉంది. కానీ, వారి టీంని వేదిక మీదకు పిలిచే సమయానికి తను మాత్రమే అక్కడుంది. వివిధ కారణాలతో జట్టు సభ్యులెవరూ పోటీలకు హాజరుకాలేదు. దాంతో ముందురోజు వరకూ ఎంతో కష్టపడి సాధన చేసిన సభ్యులు రాకపోవడంతో పేటొన్ చాలా కంగారు పడింది. ఇక తమ జట్టు పోటీల నుంచి తప్పుకోవాల్సిందేనని కోచ్ కూడా బాధపడింది. ఇంతలో ‘జట్టు తరఫున నేనొక్కదాన్నే పోటీల్లో పాల్గొంటా’ అని పేటొన్ అనడంతో అక్కడివారంతా అవాక్కయ్యారు. అనుకోని కారణాల వల్ల హాజరుకాలేకపోయిన సభ్యులను నిరాశ పర్చకుండా, కోచ్ శ్రమ వృథా కాకూడదనీ, తన తల్లిదండ్రులూ గర్వపడేలా పోటీల్లో ప్రతిభ చూపాలనుకుంది. చిన్నారిలోని పట్టుదల చూసి, కోచ్‌తోపాటు పోటీల నిర్వాహకులూ అందుకు సరేనన్నారు. అనుకున్నట్టుగానే సోలోగా వేదికపైకి చేరిన పేటొన్.. వందలాంది మంది ఎదుట మెరుపు ప్రదర్శన ఇచ్చింది. అందరి హృదయాలను గెలుచుకోవడంతోపాటు విజేతగా ట్రోఫీనీ దక్కించుకుంది. పిల్లలూ.. అనుకోని సంఘటనకు భయపడకుండా, ధైర్యంగా ఎదురెళ్లిన ఈ నేస్తం నిజంగా గ్రేట్ కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.