Published : 17 Jan 2023 01:06 IST

నేను డాల్ఫిన్‌ను కాదోచ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా! నన్ను చూసి డాల్ఫిన్‌ అనుకుంటున్నారు కదా! అస్సలు కాదు. విచిత్రంగా ఉంది కదూ! అందుకే నా గురించి మీకు చెప్పిపోదామనే... ఇదిగో ఇలా వచ్చాను. తెలుసుకుంటారా మరి!

ముద్దుగా... బొద్దుగా.. చూడ్డానికి డాల్ఫిన్‌లా ఉన్నాను కదూ! కానీ మీరనుకుంటున్నట్లు నేను డాల్ఫిన్‌ను కాదు. నా పేరు వాక్విటా. నేను మెక్సికో తీరంలో ఉంటాను. మాలో ఆడవి 150 సెంటీమీటర్ల వరకు అంటే 4.9 అడుగుల వరకు మాత్రమే పెరుగుతాయి. మగవేమో 140 సెంటీమీటర్ల వరకు అంటే 4.6 అడుగుల వరకు పెరుగుతాయి. బరువేమో దాదాపు 27 కిలోల నుంచి 68 కిలోల వరకు తూగుతాయి.

అతి చిన్న సముద్ర క్షీరదాన్ని...

నేను డాల్ఫిన్‌ను కాదు కానీ... నేనూ దానిలాగే సముద్ర క్షీరదాన్ని. అంటే మేం మా పిల్లలకు పాలిస్తాం. అన్నట్లు మీకు మరో విషయం తెలుసా...! నేను ప్రపంచంలోకెల్లా అతిచిన్న సముద్ర క్షీరదాన్ని. కానీ నన్ను చూసి చాలామంది పిల్ల డాల్ఫిన్‌ అని పొరబడుతుంటారు.

పట్టుమని పదే!

నాకు ఇన్ని ప్రత్యేకతలున్నాయి కదా! ప్చ్‌... ఏం లాభం! ‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్లు...’ నేను అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం వరకు మా జనాభా 19. 2022లో తీసిన లెక్కల ప్రకారం మా సంఖ్య కేవలం 10. అవును ప్రపంచవ్యాప్తంగా మా వాక్విటాలు కేవలం పట్టుమని పది మాత్రమే ఉన్నాయి.

చర్యలు తీసుకుంటున్నారు..

మేం అత్యంత వేగంగా అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాం కాబట్టి... మా గురించి మెక్సికన్‌ ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు, శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడేందుకు, మా సంతతిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఏం తింటామంటే...

మేం సముద్ర జీవులం కాబట్టి... జలచరాల్ని ఆహారంగా తీసుకుంటాం. చేపలు, రొయ్యలు, పీతల్ని కరకరలాడించేస్తాం. మేం 20 సంవత్సరాల వరకు మాత్రమే జీవిస్తాం. మేం సముద్రంలో 150 మీటర్లకు మించిన లోతులో బతకలేం. మేం ఒంటరిగానూ, జంటగానూ విహరిస్తుంటాం. మమ్మల్ని చూసి చాలామంది డాల్ఫిన్లని పొరబడుతున్నారు. తర్వాత మా గురించి తెలిస్తే మాత్రం అవాక్కవుతారు. మమ్మల్ని వేటాడటం చట్టరీత్యా నేరం. అసలు మా ఆవాసాల్లో వేటే నిషిద్ధం.

కాలుష్యమూ కాటేస్తోంది!

మేం సంవత్సరానికి ఒక బిడ్డకే జన్మనిస్తాం. అవి పెరిగి పెద్దయ్యే క్రమంలోనే చాలా వరకు చనిపోతుంటాయి. షార్క్‌లు మాకు ప్రధాన శత్రువులు. మేం కనిపిస్తే చాలు మమ్మల్ని వెంటాడి, వేటాడి చంపేసి, తినేస్తుంటాయి. రోజురోజుకూ సముద్రంలో పెరిగిపోతున్న కాలుష్యమూ మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి.. బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు