pigeon: అతిపెద్ద పావురాన్ని..!

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు.. నేనైతే చాలా బాగున్నా..! ఈ పాటికే.. నన్ను చూసి మీరు ఆశ్చర్యపోయుంటారు.. కదా! నాకు తెలుసు. సరదాగా మిమ్మల్ని కలిసి.. నా వివరాలన్నీ చెప్పి వెళ్దామనే ఇలా వచ్చాను.

Published : 20 Jun 2024 01:47 IST

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు.. నేనైతే చాలా బాగున్నా..! ఈ పాటికే.. నన్ను చూసి మీరు ఆశ్చర్యపోయుంటారు.. కదా! నాకు తెలుసు. సరదాగా మిమ్మల్ని కలిసి.. నా వివరాలన్నీ చెప్పి వెళ్దామనే ఇలా వచ్చాను. మరి ఇంకెందుకాలస్యం వెంటనే ఈ కథనం చదివేయండి.

నా పేరు నికోబార్‌ పీజియన్‌. అదే నేస్తాలూ.. నేను ఒక రకమైన పావురాన్నే. మీ దేశంతో పాటుగా ఇండోనేషియా, మలేషియా, గునియా వంటి దేశాల్లో కూడా కనిపిస్తాను. మీకో విషయం తెలుసా.. ఆసియా ఖండంలోనే.. అత్యంత అందమైన పక్షుల్లో నేనూ ఒకదాన్ని. నా శరీరం ముదురు బూడిద రంగులో ఉంటుంది. రెక్కలేమో.. ఆకుపచ్చ, నీలం, నారింజ రంగులతో మెరిసినట్లుగా ఉంటాయి. కాళ్లు లేత ఎరుపు.. ముక్క, కళ్లు నలుపు రంగులో ఉంటాయి. నా తోక చాలా చిన్నగా ఉంటుంది. మాలో ఆడ పక్షులు మగ వాటి కంటే.. కాస్త చిన్నగా ఉంటాయి.

ఎగరడం ఇష్టం..!

సాధారణంగా చాలా పక్షులు మీ మనుషులు ఉన్న చోటుకి రావడానికి భయపడతాయి. కానీ నేను మాత్రం అస్సలు భయపడను ఎంచక్కా అన్ని చోట్ల తిరిగేస్తా. కానీ అడవి ప్రాంతాల్లో ఉండటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తాను. నాకు ఎగరడం అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు ఒంటరిగా.. ఇంకొన్ని సార్లు గుంపుతో తిరుగుతాను. మా గుంపుని ‘బ్యాండ్‌’ అని పిలుస్తారు. నేను విత్తనాలు, పండ్లు, ఆకులు.. అప్పుడప్పుడు చిన్నచిన్న కీటకాలు తిని బొజ్జ నింపుకుంటాను. భూమి మీద నివసించే పావురాల జాతిలో.. నేనే అతిపెద్ద పావురాన్ని తెలుసా! ప్రస్తుతానికి మా జనాభా బాగానే ఉంది. నా బరువు 460 నుంచి 600 గ్రాముల వరకు ఉంటుంది. పొడవు దాదాపు 40 సెంటీ మీటర్లు. సాధారణంగా అయితే ఎనిమిదేళ్లు.. కాస్త రక్షణ కల్పిస్తే.. 15 ఏళ్ల వరకు జీవిస్తాను. ఇవి నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి కదూ.. ఉంటా నేస్తాలూ.. బై!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని