Arvind Tiwari: అంతా కలిసి.. హోంవర్క్ చేసి..!

హలో ఫ్రెండ్స్‌.. ‘మనం పాఠశాల నుంచి తిరిగి వచ్చాక.. ఏం చేస్తాం?’ - బ్యాగును ఇంట్లో పెట్టేసి, ఆటలకు వెళ్లిపోతాం.. లేదంటే తీరిగ్గా టీవీ చూస్తాం.. హోంవర్క్‌ను మాత్రం ఏమాత్రం పట్టించుకోం.. అంతే కదా.. అయితే, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాక అసలు పుస్తకాలు ముట్టుకోవడం లేదని టీచర్లకు ఫిర్యాదు చేశారు.

Updated : 12 Mar 2024 15:34 IST

హలో ఫ్రెండ్స్‌.. ‘మనం పాఠశాల నుంచి తిరిగి వచ్చాక.. ఏం చేస్తాం?’ - బ్యాగును ఇంట్లో పెట్టేసి, ఆటలకు వెళ్లిపోతాం.. లేదంటే తీరిగ్గా టీవీ చూస్తాం.. హోంవర్క్‌ను మాత్రం ఏమాత్రం పట్టించుకోం.. అంతే కదా.. అయితే, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాక అసలు పుస్తకాలు ముట్టుకోవడం లేదని టీచర్లకు ఫిర్యాదు చేశారు. దాంతో వారేం చేశారో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి మరి..

జార్ఖండ్‌ రాష్ట్రం జంషెడ్‌పూర్‌లోని తాంగ్రెయిన్‌ గ్రామంలో పిల్లలంతా బడి ముగిసిన తర్వాత.. ఒకచోట కూర్చొని బుద్ధిగా హోంవర్క్‌ చేసుకుంటున్నారు. అలాగని, అదేం ట్యూషన్‌ కాదు.. అక్కడ ఉపాధ్యాయులెవరూ ఉండరు. ఆ పిల్లల్లోనే ఎవరో ఒకరు ఆ ప్రత్యేక తరగతుల బాధ్యతలు చూసుకుంటారట. ఈ సరికొత్త కార్యక్రమానికి ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్వింద్‌ తివారీ శ్రీకారం చుట్టారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు

రోజూ పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తమ పిల్లలు అసలు పుస్తకాలే ముట్టడం లేదనీ, హోంవర్క్‌ అనే మాటే ఉండటం లేదని ఈ ఊరి తల్లిదండ్రులంతా కలిసి ప్రధానోపాధ్యాయులు అర్వింద్‌కు ఫిర్యాదు చేశారట. దాంతో ఆ పిల్లల్లో ఎలాగైనా మార్పు తీసుకురావాలని అనుకున్నారా మాస్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాఠశాలలో ఉండే చిన్నారులే.. ఇంటికి వెళ్లాక కూడా కలిసి చదువుకుంటే ఎలా ఉంటుందోనని ఒక ఆలోచనకు వచ్చారాయన. అదే విషయాన్ని ఊరి వాళ్లకు చెప్పడంతో వారికీ నచ్చి సరేనన్నారు.

ఊరికో సాయంత్రపు బడి..

తాంగ్రెయిన్‌ ప్రభుత్వ పాఠశాల పరిధిలో మొత్తం ఎనిమిది గ్రామాలున్నాయి. ఏడింటిలో ఈ సాయంత్రపు ప్రత్యేక బడులను ఇప్పటికే ప్రారంభించారు. త్వరలోనే మిగిలిన గ్రామంలోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రత్యేక తరగతుల్లో ఆ ఊరి విద్యార్థులంతా రోజూ గంటపాటు ఒక దగ్గర కూర్చొని, హోంవర్క్‌ చేసుకుంటారట. వారిలోనే ఒకరికి పిల్లల నియంత్రణ బాధ్యతను అప్పగిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కంబైన్డ్‌ స్టడీస్‌ అన్నమాట. ‘మరి.. ఏవైనా సందేహాలు వస్తే ఎలా?’ అనే అనుమానం వచ్చిందా.. ఆ బాధ్యతను ఆ ఊరిలో ఉండే సీనియర్‌ విద్యార్థులు తీసుకుంటారట. అంటే జూనియర్లకు వచ్చే డౌట్స్‌ను సీనియర్లు చెబుతారన్నమాట.

ఆటలూ ఉంటాయి..

ఈ సాయంత్రపు బడుల్లో కేవలం చదువు మాత్రమే కాదు నేస్తాలూ.. ఫుట్‌బాల్‌ కూడా ఆడుకోవచ్చు. అందుకు అవసరమైన సామగ్రిని అర్వింద్‌ సారే సమకూర్చారట. హోంవర్క్‌ మాత్రమే అంటే.. పిల్లలెవరూ రారు కాబట్టి.. ఇలా ఆటలు కూడా ఆడుకొనే అవకాశం కల్పించారన్నమాట. అంటే, రోజూ సాయంత్రాలు మిత్రులంతా కలిసి గబగబా హోంవర్క్‌ చేసేసుకొని, ఎంచక్కా ఆడుకోవచ్చు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చు. చదువుకు చదువూ, కాలక్షేపానికి కాలక్షేపం.. భలే ఉంది కదూ! ఈ ప్రత్యేక తరగతులతో విద్యార్థుల అల్లరి, పనీపాటా లేకుండా తిరగడం బాగా తగ్గిపోయిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. నేస్తాలూ.. మనం మాత్రం ఇంట్లోనో, ట్యూషన్‌లోనో ఎంచక్కా హోంవర్క్‌ పూర్తి చేసేసుకుందాం!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని