కొక్కొరోకో.. ‘గిన్నిస్‌’ వచ్చిందహో..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నగరాల్లో అంతగా కనిపించవు కానీ పల్లెటూళ్లకు వెళ్లినప్పుడు కోళ్లను చూసే ఉంటారు. మనం పప్పీలను పెంచుకున్నట్లే, అక్కడా వాటిని చూసుకుంటారు.

Published : 04 Mar 2023 00:04 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నగరాల్లో అంతగా కనిపించవు కానీ పల్లెటూళ్లకు వెళ్లినప్పుడు కోళ్లను చూసే ఉంటారు. మనం పప్పీలను పెంచుకున్నట్లే, అక్కడా వాటిని చూసుకుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే.. గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కి రికార్డు సాధించిన కోడి గురించి చెప్పడం కోసమన్నమాట. మరింకెందుకాలస్యం.. గబగబా ఇది చదివేయండి మరి..

మెరికాలోని మిచిగాన్‌లో మార్సీ అనే మహిళ లైబ్రేరియన్‌గా పనిచేస్తుంది. ఆమె తన ఇంట్లో పప్పీలతోపాటు కోళ్లనూ పెంచుకుంటోంది. వాటిలో ‘పీనట్‌’ అని ముద్దుగా పిలుచుకునే ఓ కోడి ఇటీవల ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించింది. ఎందుకూ అంటే.. ప్రపంచంలోనే అత్యధిక రోజులు జీవించిన కోడి ఇదేనట.  

పడేసిన గుడ్డులోంచి..  

సాధారణంగా కోళ్ల జీవితకాలం 5 నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. కానీ, ‘నంకిన్‌ మిక్స్‌’ అనే జాతికి చెందిన ఈ పీనట్‌ మాత్రం చాలా గట్టిది. మొన్న మార్చి ఒకటో తేదీ నాటికి దీని వయసు 20 సంవత్సరాల 304 రోజులు. అసలు ఈ కోడి చచ్చి బతికిందనే చెప్పుకోవాలి. 2002లో గుడ్లను పూర్తిగా పొదగకముందే పీనట్‌ వాళ్లమ్మ.. గూడును విడిచి వెళ్లిపోయిందట. అయితే ఒకరోజు మార్సీ ఆ గుడ్లను చూసి, పాడైపోయి ఉంటాయనుకొని.. చెత్తబుట్టలో పడేసింది. కాసేపటి తర్వాత ఆమెకు కోడి పిల్ల అరుస్తున్న శబ్దం వినిపించింది. గబగబా వెళ్లి.. చెత్తబుట్టలో చూస్తే, గుడ్డులోంచి ఓ పిల్ల అప్పుడే బయటికి రావడం కనిపించింది. అదే ఇప్పుడు గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కిన పీనట్‌. అయితే, తల్లి ఎక్కడికో వెళ్లిపోవడంతో చిలుకల పంజరంలోనే ఇది చాలాకాలం పెరిగింది.

ఆహారమూ ప్రత్యేకమే..  

ఈ కోడిని యజమాని చాలా ప్రేమగా చూసుకుంటుందట. మార్సీ ఒడిలో కూర్చొని టీవీ చూస్తుంది.. భుజనాలపైన ఎక్కి మరీ ఆడుకుంటుంది. పీనట్‌ ఆరోగ్య విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. ప్రతిరోజూ ప్రత్యేక దాణాతోపాటు తాజా పండ్లు, కూరగాయలు తినిపిస్తుంది. అంతేకాదు.. విటమిన్‌-డి మాత్రలను మెత్తగా దంచి పెడతుంది. ఈ పీనట్‌ తన జీవితకాలంలో చాలా గుడ్లను పెట్టిందట. ఇంకో విశేషం ఏంటంటే.. దీని పిల్లల కంటే ఇదే ఎక్కువ సంవత్సరాలు జీవించిందని యజమాని చెబుతోంది. ముసలిది అయిపోవడంతో ప్రస్తుతం అది ఓల్డేజ్‌ పౌల్ట్రీలో ఉంటోందట. నేస్తాలూ.. పీనట్‌ విశేషాలు భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని