Published : 25 Jan 2023 00:01 IST

మంచి రాజు... మంచి పౌరుడు!

జ్జయిని అనే రాజ్యాన్ని ఉగ్రసేనుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ధర్మబద్ధమైన ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఒకసారి సరిహద్దు ప్రాంతంలో పక్క రాజ్యం వారు దాడి జరిపారు. వారిని ఎదిరించడానికి రాజు కొంత సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్లాడు. అక్కడ శత్రువర్గపు సైనికులు రాజుగారిని ఎదుర్కొన్నారు. ఇరువర్గాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది.

ఆ యుద్ధంలో రాజుగారు శత్రువుల మీద గెలిచారు. కానీ ఆయన చేతికి గాయమైంది. ఆయన ఎక్కిన గుర్రం బెదిరిపోయి యుద్ధభూమి నుంచి రాజుగారితో సహా పరుగు తీసింది. అలా రాజు పక్కనే ఉన్న ఒక గ్రామాన్ని చేరుకున్నాడు. కత్తి, డాలు, కవచం ధరించి, గుర్రం మీద వచ్చిన రాజును చూసి ఆ ఊరి జనం ఎవరో అనుకుని భయపడిపోయారు. అప్పటి వరకు వాళ్లు మహారాజును ప్రత్యక్షంగా చూసి ఉండకపోవడమే దానికి కారణం.

విజయుడు అనే వ్యక్తి మాత్రం ధైర్యంగా రాజును సమీపించి.. ‘నువ్వు ఏ రాజ్యానికి చెందిన వాడివి?’ అని ప్రశ్నించాడు. ‘నేను ఉజ్జయిని రాజ్య సైనికుణ్ని’ అని జవాబు చెప్పాడు రాజు. ఆ మాటలకు విజయుడు సంతోషించాడు.

‘అయితే, మీరు శత్రువులతో జరుగుతున్న యుద్ధంలో గాయపడి వస్తున్నారన్నమాట. మా ఇంటికి పోదాం.. రండి’ అని రాజును ఇంటికి తీసుకునిపోయాడు. వైద్యం చేయించి, భోజనం పెట్టి అతిథి మర్యాదలన్నింటినీ జరిపించాడు.

కాస్త విశ్రాంతి తీసుకున్నాక, రాజ్యానికి వెళ్లేముందు ఆతిథ్యాన్నిచ్చిన విజయుడికి కృతజ్ఞత తెలుపుకొని.. ‘అయ్యా! మా ఇల్లు రాజుగారి కోట ఆవరణలో ఉంటుంది. మీరు కుడి చేతి వైపున ఉండే ఉత్తర ద్వారం దగ్గర కాపలామనిషితో.. ‘మహాశ్వారోహుడి ఇల్లు ఎక్కడ?’ అని అడిగితే అతడే మిమ్మల్ని మా ఇంటికి తీసుకుని వస్తాడు. మీరు మీ ఇష్టం వచ్చినన్ని రోజులు మా ఇంట అతిథిగా ఉండవచ్చు’ అని చెప్పాడు.

రాజు నగరానికి వెళ్లిన వెంటనే ఉత్తర ద్వారపాలకుణ్ని పిలిపించి అతడితో... ‘ఎవరన్నా నీ వద్దకు వచ్చి, మహాశ్వారోహుడి ఇల్లు ఎక్కడ? అని అడిగితే అతడిని సగౌరవంగా నా దగ్గరకు తీసుకునిరా’ అని చెప్పాడు. విజయుడు వస్తాడని రాజు ఎంతోకాలం ఎదురు చూశాడు. కానీ, అతడు రాలేదు.

కొన్ని సంవత్సరాలు గడిచాక సరిహద్దున ఉండే విజయుడి గ్రామంలో తీవ్రమైన అనావృష్టి ఏర్పడింది. ప్రజలందరూ ఆకలితో మలమల మాడిపోసాగారు. పరిస్థితిని బట్టి విజయుడు ఉజ్జయిని నగరానికి వెళ్లాలనుకున్నాడు. అక్కడ మహాశ్వారోహుణ్ని కలుసుకుని, అతని సహాయంతో రాజుని దర్శించి, తమ గ్రామానికి ఏదైనా సహాయం చేయమని అర్థించాలని నిశ్చయించుకున్నాడు.

వెంటనే విజయుడు రాజ్యానికి చేరుకుని, కోట కుడి వైపున ఉండే ఉత్తర ద్వారపాలకుణ్ని.. ‘బాబూ! నేను మహాశ్వారోహుడి ఇంటికి వెళ్లాలి. అతని ఇల్లు కాస్త చూపిస్తావా?’ అని అడిగాడు. వెంటనే ద్వారపాలకుడు అతణ్ని సరాసరి రాజుగారి ఎదుట నిలబెట్టాడు. విజయుణ్ని చూడగానే రాజుకు పరమానందమైంది.

మహాశ్వారోహుడే రాజు అని తెలుసుకుని విజయుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. రాజు విజయుడి రాకకు కారణం తెలుసుకుని వెంటనే అతడి గ్రామానికి కావాల్సిన సహాయం చేయమని ఉత్తర్వులు జారీ చేశాడు. అంతే కాకుండా మర్నాడు విజయుణ్ని సభకు తీసుకునిపోయి, తన ముఖ్య సలహాదారుడిగా ప్రకటించాడు.

ఒక కొత్త వ్యక్తిని తీసుకుని వచ్చి, రాజు.. తన ముఖ్య సలహాదారుడిగా నియమించటం మంత్రికి నచ్చలేదు. అతను వెంటనే లేచి, ‘మహారాజా! ఒక నూతన వ్యక్తిని తీసుకుని వచ్చి బాధ్యత గల ఉద్యోగాన్ని ఇవ్వడం రాజ్య భవిష్యత్తుకు అనర్థం. ఓసారి పునరాలోచించమని నా మనవి’ అన్నాడు.

మంత్రి మాటలకు రాజు తల ఆడిస్తూ.. ‘మీ భయం నాకు అర్థమైంది. విజయుడి విషయంలో మీరు ఏమాత్రం అనుమానించనక్కర్లేదు. ఇతను నాకు ఒకప్పుడు ప్రాణదానం చేశాడు. ఈ రాజ్యం మీద అతనికి ఉన్న ప్రేమాభిమానాలే నన్ను రక్షించడానికి గల కారణం. ఇప్పుడు కూడా స్వప్రయోజనం కోసం ఇతడు రాలేదు. గ్రామ ప్రజల కోసం వచ్చాడు. అనర్హుడికి బాధ్యత గల ఉద్యోగం ఇవ్వడం ఎంత పొరపాటో, అర్హత గల వ్యక్తికి తగిన ఉద్యోగం ఇవ్వకపోవడం కూడా అంతే తప్పు. ఇంతటి గొప్ప పౌరుడు, ప్రజాశ్రేయస్సును కోరేవాడు నాకు ముఖ్య సలహాదారుడిగా ఉండడంలో అనుచితం ఎంతమాత్రం లేదు’ అన్నాడు. మంత్రి అనుమానం, భయం తొలగిపోయాయి. సభలో అందరూ ఆనందించారు. 

కేవీ.సుమలత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు