మిఠాయి దొరికింది!

పట్నం వీధుల్లో ఒంటరిగా తిరుగుతున్న కోతికి.. ఓ దుకాణం నుంచి ‘జారు మిఠాయి’ అనే పాట వినిపించింది. ఆ పాట వింటూ.. కొంతమంది సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఆ పాటలో ఉన్న జారు మిఠాయిని ఎలాగైనా తినాలనే కోరిక పుట్టిందా కోతికి.

Published : 09 Mar 2023 00:15 IST

ట్నం వీధుల్లో ఒంటరిగా తిరుగుతున్న కోతికి.. ఓ దుకాణం నుంచి ‘జారు మిఠాయి’ అనే పాట వినిపించింది. ఆ పాట వింటూ.. కొంతమంది సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఆ పాటలో ఉన్న జారు మిఠాయిని ఎలాగైనా తినాలనే కోరిక పుట్టిందా కోతికి. ఓ మిఠాయి దుకాణం దగ్గరకు వెళ్లి.. ‘జారు మిఠాయి ఉందా?’ అని అడిగింది. లేదని సమాధానమిచ్చాడా దుకాణ యజమాని. అలా చాలా మిఠాయి కొట్లు తిరిగింది. అన్ని చోట్లా.. లేదనే సమాధానమే రావడంతో నిరాశ చెందింది. అలా రోజులు గడుస్తున్నా.. జారు మిఠాయి తినాలనే కోరిక మాత్రం కోతికి తగ్గలేదు. ఒకరోజు గుడి దగ్గర కొబ్బరిముక్క తింటూ.. ఆలోచిస్తున్న కోతి దగ్గరకు ఓ కాకి వచ్చింది. ‘ఏంటి మిత్రమా.. దిగాలుగా కూర్చున్నావు?’ అని ప్రశ్నించింది. ‘చాలా రోజులుగా జారు మిఠాయి తినాలనే కోరికను చంపుకోలేకపోతున్నాను. ఆ మిఠాయి ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదు. నీకేమైనా తెలుసా?’ అని ప్రశ్నించింది కోతి. ‘నాకెందుకు తెలియదు. నీ చేతిలో ఉన్న కొబ్బరి ముక్క ఇస్తే చెబుతా..’ అంది కాకి. క్షణం ఆలస్యం చేయకుండా కొబ్బరి ముక్కను ఇచ్చేసిందది. ‘అడవికి వెళ్తే నీకు అన్నిరకాల మిఠాయిలు దొరుకుతాయి’ అని చెప్పి కొబ్బరి ముక్కను నోటకరుచుకుని ఎగిరిపోయింది కాకి. వెంటనే పెట్టే బేడా సర్దుకొని అడవికి బయలుదేరింది కోతి.

ఎప్పుడూ ఒంటరిగా అడవిలోకి వెళ్లకపోవడంతో కాస్త భయం వేసింది కోతికి. దగ్గరలో కనిపించిన ఓ చెట్టు ఎక్కి.. కంగారుగా అటూ ఇటూ చూడసాగింది. కింద ఓ నక్క తననే చూస్తూ కనిపించింది. ‘వామ్మో.. ఇదేంటి నన్ను ఇలా తినేసేలా చూస్తుంది?’ అని మనసులోనే భయపడింది కోతి. అడవికి కొత్తగా వచ్చిన కోతిని ఎలాగైనా తినాలని నక్క పన్నాగం పన్నింది. కోతిని పట్టుకోవడం తన వల్ల కాదు కాబట్టి.. ఏ సింహానికో, పులికో దాన్ని అప్పగించి అందులో కొంత వాటా అయినా తిందామని అనుకుంది. ‘ఓ కోతీ... ఈ అడవిలో నీకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను అడుగు. నేను మాత్రమే ఇక్కడ నీకు నమ్మకమైన మిత్రుడిని. నన్ను నమ్మి కిందికి రా.. నీకు అడవి అంతా చూపిస్తాను’ అంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. ‘నాకు జారు మిఠాయి కావాలి.. తినిపిస్తావా?’ అంది కోతి. ‘ఓస్‌.. జారు మిఠాయా... నీకు ఎంత కావాలంటే అంత తినిపిస్తాను. ఈ అడవిలో చాలా ఉంది. నువ్వు ముందు కిందికి రా.. మిఠాయి దగ్గరకు తీసుకువెళ్తాను’ అంది నక్క. దాని మాటలు నమ్మిన కోతి, కిందికి దిగింది. తన పాచిక పారినందుకు సంతోషించిందా జిత్తులమారి.

కోతిని నేరుగా సింహం గుహ దగ్గరకు తీసుకెళ్లింది. ‘నువ్విక్కడే ఉండు.. ఎక్కడికీ వెళ్లకు’ అంటూ కోతిని బయటే ఉంచి గుహ లోపలికి వెళ్లిందా నక్క. ఇదంతా గమనిస్తున్న ఓ ఎలుగుబంటి, కోతి దగ్గరకు వచ్చి.. ‘కోతీ.. నువ్విక్కడ ఉండటం క్షేమం కాదు. నాతోపాటు వచ్చి నీ ప్రాణం కాపాడుకో.. లేకపోతే ఆ సింహం చేతిలో నీ పని అయిపోతుంది’ అంటూ హెచ్చరించింది. దాంతో కోతికి పై ప్రాణాలు పైనే పోయాయి. భయపడుతున్న కోతిని దగ్గరలో ఉన్న ఓ చెట్టు పైకి తీసుకెళ్లిందది. ఓ వైపు కోతిని వెతుక్కుంటూ చెట్టు దగ్గరకు చేరాయి సింహం, నక్క. ‘ఏయ్‌ ఎలుగూ.. మర్యాదగా ఆ కోతిని మాకు అప్పగించు.. లేకపోతే చెట్టు ఎక్కడం నాకు పెద్ద కష్టం కాదు.. ఎక్కానంటే ఇద్దరినీ తినేస్తా’ అంటూ గర్జించింది. ఎలుగుబంటి నుంచి సమాధానం రాకపోవడంతో సింహం చెట్టు ఎక్కడానికి ప్రయత్నించింది. నక్క మాత్రం కిందనే ఉండి ముసిముసిగా నవ్వుకుంది. కోతి మాంసంతో విందు ఖాయమనుకుంటూ సంబరపడింది. ఇంతలో అంతకుముందు రోజు అదే చెట్టు పైన తేనె దాచుకున్న విషయం ఎలుగుబంటికి గుర్తుకు వచ్చింది. అది తీసుకొని, కొంత తేనెను సింహం అరికాళ్లపైన పడేలా పోసింది. ఇంకేముంది.. సింహం పట్టు జారి కింద పడింది. ఎన్నిసార్లు చెట్టు ఎక్కే ప్రయత్నం చేసినా.. పడుతూనే ఉంది. ఇక లాభం లేదనుకొని సింహం, నక్క నిరాశగా వెనుదిరిగాయి.

కోతి వచ్చింది జారు మిఠాయి కోసమని తెలుసుకున్న ఎలుగుబంటి.. తను దాచుకున్న తేనెను దానికి ఇచ్చేసింది. ‘భలే తియ్యగా ఉంది.. ఇదేనా జారు మిఠాయి’ అంటూ ఆబగా తినసాగింది. ‘జారు మిఠాయి అంటే ఏంటో తెలియదు కానీ, మా అడవిలో దొరికే జారు మిఠాయి ఇదే..’ అంది ఎలుగుబంటి. ‘నేను కోరుకున్న రుచి దొరికింది.. ఈ జారు మిఠాయి భలే తియ్యగా ఉంది.. అంతకంటే మధురమైన స్నేహం నాకు దొరికింది’ అంటూ ఎలుగుబంటిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది కోతి. ఇక ఏ ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాక.. ఎలుగుబంటి కోతిని జాగ్రత్తగా అడవి దాటించింది. కోతి తిరిగి పట్నం దారి పట్టింది. నడుం నొప్పితో బాధపడుతున్న సింహానికి సపర్యలు చేయసాగింది నక్క. ‘మృగరాజా.. జారు మిఠాయి కోసమని మన అడవికి వచ్చిన కోతి తప్పించుకుంది. ఆ మాయదారి ఎలుగుబంటి లేకపోతే.. అది మనకు ఆహారమయ్యేది. ఇంతకీ జారు మిఠాయి అంటే ఈ తేనేనా?’ అంటూ సందేహం వెలిబుచ్చింది. ఒక వైపు నొప్పితో అల్లాడుతున్న సింహానికి.. నక్క ప్రశ్నలు చిరాకు తెప్పించాయి. కోపంతో దానికి తన పంజా రుచి చూపించింది. ‘కుయ్యో.. మొర్రో..’ అంటూ పరుగు అందుకుంది నక్క.  

వడ్డేపల్లి వెంకటేశ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని