Gossipping: చాడీలు తెచ్చిన చేటు

రంగాపురం అనే గ్రామం నుంచి దారి తప్పిన ఒంటె ఒకటి.. పక్కనే ఉన్న అడవిలోకి ప్రవేశించింది. అక్కడి పచ్చని చెట్లు, గుట్టలు, కాల్వలు, రకరకాల జంతువులు, పక్షులను చూసి ముచ్చటపడింది.

Published : 01 Apr 2023 01:23 IST

రంగాపురం అనే గ్రామం నుంచి దారి తప్పిన ఒంటె ఒకటి.. పక్కనే ఉన్న అడవిలోకి ప్రవేశించింది. అక్కడి పచ్చని చెట్లు, గుట్టలు, కాల్వలు, రకరకాల జంతువులు, పక్షులను చూసి ముచ్చటపడింది. అడవిలోని జంతువులు కూడా అప్పటివరకూ ఒంటెను ఎప్పుడూ చూడలేదు. ఎత్తైన కాళ్లతో, పొడవైన మెడ, నడుం మీద భారీ మూపురంతో ఉన్న ఒంటె వాటికి వింతగా తోచింది. ఆ అడవిలోనే ఒక జిత్తులమారి నక్క ఉండేది. అది ఆ అడవికి మంత్రి. కానీ, మృగరాజుకు తెలియకుండా తన జిత్తులు ప్రదర్శించి చిరుజీవులను మోసం చేసి జీవించసాగేది. అసలు మృగరాజునే తన జిత్తులతో ఏమార్చి మంత్రి అయిందది. తాను అప్పటివరకూ రుచిచూడని జంతువుల్ని చంపి తినాలనే దురుద్దేశంతో వాటి గురించి మృగరాజుకు చెడుగా చెప్పేది. అవి నిజమేననుకొని నమ్మి, ఆ జీవులను సింహం చంపేసేది. అది తినగా మిగిలిన మాంసాన్ని, ఎంచక్కా నక్క ఆవురావురుమంటూ విందు చేసేది.

అదే రోజు నక్క షికారుకు బయలుదేరగా.. దారిలో ఎదురుగా వస్తున్న ఒంటె కనిపించింది. ఆ ఒంటెను చూడగానే మొదట భయపడిన నక్కకు.. అడవిలోకి వచ్చిన ఆ కొత్త జంతువు మాంసం రుచి చూడాలనే ఆశ కలిగింది. మరుక్షణమే ధైర్యం తెచ్చుకొని ఒంటె ఎదురుగా వెళ్లి.. ‘ఏయ్‌.. ఎవరు నువ్వు?’ అని ప్రశ్నించింది నక్క. ‘మిత్రమా.. నా పేరు ఒంటె. నన్ను ఎడారి ఓడ అని కూడా పిలుస్తుంటారు. ఈ అడవికి పక్కనే ఉన్న గ్రామంలో ఉంటాను. దారి తప్పి ఇలా వచ్చాను’ అని వినయంగా బదులిచ్చింది ఒంటె. ‘అలాగా.. మా రాజ్యంలోకి ప్రవేశించాలంటే ముందు మృగరాజు సింహం అనుమతి అవసరం. నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్లి నీ విషయం రాజుగారికి చెప్పి వస్తాను’ అంది నక్క. పరుగు పరుగున మృగరాజు వద్దకు వెళ్లి... ‘రాజా.. పెను ప్రమాదం ముంచుకొచ్చింది. ఒంటె అనే ఒక భయంకరమైన ఎడారి జీవి ఒకటి మన అడవిలోకి ప్రవేశించింది. మీకోసం వేట కూడా ప్రారంభించింది’ అంటూ రొప్పుతూ చెప్పింది.

‘భయమెందుకు.. దాని సంగతి నేను చూస్తా’ అంటూ గర్జించింది సింహం. ‘వద్దు ప్రభూ.. వద్దు.. మనం దాన్ని అంతకుముందెప్పుడూ చూడలేదు. అది మీకన్నా ఎంతో ఎత్తుగా, బలమైన కాళ్లతో ఉంది. మీ మీద దాడి చేయడానికి వచ్చింది. ఈ రాజ్యానికి రాజుగా ఉండాలనేది దాని కోరికట!’ అని చాడీలు చెప్పి.. సింహాన్ని ఒంటె మీదకు ఉసిగొల్పిందది. ‘రాజా... ఉత్తరం వైపు ఉన్న మర్రిచెట్టు దగ్గర అది మీకోసం ఎదురు చూస్తోంది. నాకెందుకో భయంగా ఉంది. మీరెళ్లి దాన్ని చంపి, తీపి కబురు చెప్పండి. అంతవరకూ నేనిక్కడే ఉంటా’ అంటూ వణుకుతూ అంది నక్క. ఒంటెను వెతుక్కుంటూ ఉత్తరం దిక్కుగా వేగంగా వెళ్లిందది. నక్క చెప్పినట్లే పొడవైన కాళ్లతో ఉన్న ఒంటెను చూసి అడవి దద్దరిల్లేలా గర్జించింది సింహం.

సింహాన్ని చూసిన ఒంటె వినయంగా నమస్కరించింది. బలంగా ఉన్న తన నాలుగు కాళ్లతో అది తన్నగలదనీ, దాన్ని వేటాడటం అంత సులువు కాదనీ మనసులోనే ఓ అంచనాకు వచ్చింది. భారీగా ఉన్న దాని మూపురం వింతగా తోచింది. మృగరాజు ఆహార్యం చూసి.. భయంతో ఒక అడుగు వెనక్కు వేసింది ఒంటె. దాంతో సింహం ఆలోచనలో పడింది. ‘ఈ అడవికి రాజుగా ఉండాలంటే నాతో యుద్ధం చేసి గెలవాలి. నిన్ను చూస్తే నా మీదకు దాడికి వచ్చినట్లుగా లేదు. నిన్ను గతంలో ఎప్పుడూ చూసింది కూడా లేదు’ అంది సింహం. ‘రాజా! నేను యుద్ధానికి రావటమేంటి? నేను సాధు జంతువును.. పైగా శాకాహారిని.. దారి తప్పి అడవిలోకి వచ్చాను’ అంటూ అసలు విషయం చెప్పింది ఒంటె.

ఆ మాటలతో సింహానికి విషయం అర్థమైంది. ‘మిత్రమా.. మా మంత్రి జిత్తులమారి నక్క మాటలు నమ్మి నీపైన ప్రతి దాడికి వచ్చాను. అడవిలోకి నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నేను దగ్గరుండి మరీ నీకు అడవి మొత్తాన్ని చూపిస్తాను. అంతకంటే ముందు గుహకు వచ్చి, మా ఆతిథ్యం స్వీకరించు’ అంది. సరేనన్న ఒంటె.. సంతోషంగా సింహం వెంట నడిచింది. అవి రెండూ అలా వెళ్తుంటే.. అడవి జీవులన్నీ వింతగా చూడసాగాయి. కొత్త జంతువును తోడ్కొని వస్తున్న సింహం కూడా గర్వంతో పొంగిపోయింది. ఒంటె తన మిత్రుడైనందుకు సంబరపడింది. కాసేపట్లోనే అవి రెండూ గుహ వద్దకు చేరుకున్నాయి.

అడుగుల శబ్దం వినిపించడంతో.. గుహలో గురక పెట్టి నిద్రిస్తున్న నక్క.. ఒక్కసారిగా లేచి చూసింది. ఎదురుగా సింహం కనిపించడంతో.. ‘రాజా.. ఆ ఒంటెను చంపారా?’ అని ఆశగా అడిగింది. సింహం పెద్దగా గర్జిస్తూ ‘జిత్తులమారీ.. నీ ఎత్తులు ఇక నా దగ్గర సాగవు. ఇతర జంతువులపైన చాడీలు చెప్పి, అనవసరంగా వాటిని నాతో చంపించావు. కొన్నింటికి శిక్షలు వేయించావు. నువ్వు చేసిన పనికి.. నిన్ను ఈ అడవి నుంచి బహిష్కరిస్తున్నా. ఇక నా కళ్ల ముందు కనిపించకు.. వెళ్లు’ అని ఆగ్రహించింది సింహం. చేసేది లేక ఉసూరుమంటూ.. మరో అడవికి పారిపోయింది నక్క. అతిథిగా వచ్చిన ఒంటెకు చక్కటి మర్యాదలు చేసింది సింహం. అడవి మొత్తం చూపించాక.. దగ్గరుండి మరీ దాన్ని గ్రామం సరిహద్దు వరకూ సాగనంపి వచ్చింది.

పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని