ఎవరి గొప్ప వారిది!

కోకిల, కాకి ఒకే చెట్టు మీద నివసిస్తుండేవి. ఒకరోజు కోకిల, కాకి వైపు చూస్తూ.... ‘నిన్ను చూస్తుంటే నాకు కోపంగా ఉంది. మనస్సాక్షి లేని నీతో మాట్లాడటం నాదే తప్పు.

Published : 24 Mar 2023 00:47 IST

కోకిల, కాకి ఒకే చెట్టు మీద నివసిస్తుండేవి. ఒకరోజు కోకిల, కాకి వైపు చూస్తూ.... ‘నిన్ను చూస్తుంటే నాకు కోపంగా ఉంది. మనస్సాక్షి లేని నీతో మాట్లాడటం నాదే తప్పు. నీకన్నా నేనే గొప్పదాన్నని ఏదో ఒకరోజు నువ్వే తెలుసుకుంటావు’ అని కోపంగా వెళ్లిపోయింది.

అలా ఎగురుకుంటూ వెళ్లి అరటి చెట్టుపై కూర్చుంది. కొద్ది దూరాన ఉన్న టేకు చెట్టుతో పక్కనే ఉన్న మరో అరటి చెట్టు మాట్లాడటం చూసింది.

‘అవి ఏమి మాట్లాడుకుంటున్నాయా?’ అని ఆసక్తిగా వినసాగింది కోకిల. ‘అరటి చెట్టు మిత్రమా! నా మాటలు నువ్వు అస్సలు అంగీకరించడం లేదు. అందుకే రోజూ నీతో గొడవ పడుతున్నాను’ అంది టేకు చెట్టు.

‘టేకు చెట్టు మిత్రమా! నేను చెప్పే నిజాన్ని నువ్వే అంగీకరించడం లేదు’ అంది అరటి చెట్టు.

‘‘ఇద్దరూ ఒకరినొకరు ‘మిత్రమా’ అనుకుంటున్నారు. పైగా గొడవ అంటున్నారు.. చిరునవ్వుతోనే మాట్లాడుకుంటున్నారు.. ఒకరిపై మరొకరు అరుచుకోవడం లేదు’’ అనుకొంటూ వారి మాటలు వినసాగింది కోకిల.

‘నీ నుంచి వస్తున్న అరటి పండ్లు, పువ్వులు, పత్రాలు.. మొత్తం మీద ప్రతి ఒక్కటీ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అందుకే నువ్వు నాకన్నా గొప్పదానివి. కానీ ఈ విషయాన్ని నువ్వు అంగీకరించవు’ అంది టేకు చెట్టు.

‘నేను ఆ కొంత సమయం మాత్రమే ఉపయోగపడతాను. కానీ నీ కలపతో తయారైన తలుపులు, మంచం, బల్లలు, కుర్చీలు ఎక్కువకాలం చెక్కు చెదరకుండా ఉంటాయి. అందుకే నువ్వు నాకన్నా గొప్పదానివి’ అని అంది అరటి చెట్టు.

‘అదేంటీ.. మీలోని నైపుణ్యాలను మీరే తక్కువ చేసుకొంటూ మాట్లాడుతున్నారు. మీ గొప్పతనాన్ని మీరు గొప్పగా చెప్పుకోవాలి కానీ....’ అని ఆశ్చర్యంగా కోకిల వారిద్దరి వైపు చూస్తూ అంది.

‘నా గురించి గొప్ప చెప్పుకోవడం అంటే ఇతరుల గొప్పతనాన్ని తక్కువగా అంచనా వేయడమే అవుతుంది’ అంది టేకు చెట్టు.

‘మా గొప్పతనం మాకు తెలుసు. దాని గురించి చెప్పడం కన్నా ఇతరుల్లోని గొప్పతనాన్ని మెచ్చుకోవడం వల్ల మానసిక ఆనందంతో పాటు, స్నేహం వృద్ధి చెందుతుంది’ అంది అరటి చెట్టు.

వారి మాటలతో కోకిలకు కనువిప్పు కలిగింది. వెంటనే తాను నివసిస్తున్న చెట్టు దగ్గరకు వెళ్లింది. ‘ఓ కాకి మిత్రమా! నిన్ను కోపంలో ఏదో అన్నాను.

ఆలోచించి చూస్తే నువ్వు నాకన్నా గొప్పదానివే’ అంది కోకిల. ‘అదేమీ లేదు.. నువ్వే నాకన్నా గొప్పదానివి, నేనెన్ని చేసినా నీలా పాడలేను. నేనే కోపంలో బాగోలేదని తిట్టాను. ఒకసారి పాటపాడవూ..’ అని ప్రేమగా అంది కాకి.

కోకిల తన కమ్మని గొంతుతో పాడుతుంటే ఆనందంతో వినసాగింది కాకి. ఆ తర్వాత కాకి, కోకిల మధ్య తమలో ఎవరు గొప్ప అన్న గొడవే రాలేదు. చక్కగా ఒకదానికొకటి సాయం చేసుకుంటూ ఆప్తమిత్రుల్లా కాలం గడిపాయి.

ఓట్ర ప్రకాష్‌ రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని