వజ్రాల వ్యాపారి!

ఉదయగిరి రాజ్యాన్ని జయసింహుడు పాలించేవాడు. ఓసారి రాజును కలవాలని ఒక వజ్రాల వ్యాపారి అనుకున్నాడు.

Published : 07 Feb 2023 00:18 IST

దయగిరి రాజ్యాన్ని జయసింహుడు పాలించేవాడు. ఓసారి రాజును కలవాలని ఒక వజ్రాల వ్యాపారి అనుకున్నాడు. రాజును కలవాలంటే ముందుగా సీతాపురంలో ఉండే సైన్యాధికారి భీమన్న అనుమతి తరువాత, మంత్రి సుశర్మ అనుమతి కావాలన్న విషయం తెలుసుకుని.. ముందుగా భీమన్న ఇంటికి వెళ్లాడు. ‘అయ్యా! నేను వజ్రాల వ్యాపారిని పొరుగుదేశం నుంచి వస్తున్నా. రాజుగారిని కలవాలి’ అన్నాడు.

‘ఓ.. అలాగే, మంత్రిగారితో మీ విషయం చెబుతాను. మీరు ఈ రోజు మా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం మంత్రిగారి ఇంటికి తీసుకువెళతాను’ అన్నాడు భీమన్న. ‘అలాగే.. ఈ పెట్టెను భద్రంగా దాచండి, దీనికి తాళం లేదు’ అన్నాడు వ్యాపారి. ‘మీరు నిశ్చింతగా ఉండండి’ అన్నాడు భీమన్న.

వ్యాపారి ఎలాగూ పెట్టెకు తాళం లేదు అన్నాడు కదా అని, భీమన్న ఆ రోజు రాత్రి పెట్టె తెరిచి చూశాడు. అందులో పాతిక వజ్రాలున్నాయి. రెండు తీసి దాచాడు. తెల్లారింది. వ్యాపారి కాలకృత్యాలు తీర్చుకుని, అల్పాహారం చేసి వజ్రాల పెట్టెను తీసుకుని భీమన్నతోపాటు మంత్రి ఇంటికి వెళ్లాడు. మంత్రితో వ్యాపారి విషయం చెప్పాడు భీమన్న.

‘రాజు గారిని కలిసే ఏర్పాటు రేపు చేస్తాను. ఈ రోజు మా ఇంటనే ఉండండి’ అన్నాడు మంత్రి కూడా. వ్యాపారి ‘ఈ పెట్టెను భద్రం చేయండి. దీనికి తాళం లేదు’ అని చెప్పాడు. ‘మీకా భయం లేదు’ అన్నాడు మంత్రి. ఆ రోజు రాత్రి, మంత్రి కూడా ఆ పెట్టెను తీసి చూశాడు. అందులో ఇరవై మూడు వజ్రాలున్నాయి. నాలుగు వజ్రాలు తీసి దాచాడు. మరుసటి రోజు ఉదయం.. మంత్రి, వ్యాపారిని కోటకు తీసుకెళ్లి.. ‘ఈయన వజ్రాల వ్యాపారి. మిమ్మల్ని కలవడానికి వచ్చారు’ అని రాజుకు పరిచయం చేశాడు.

మంత్రి రాజమందిరం నుంచి వెళ్లిపోయాక ‘మహారాజా! ఈ పెట్టెలో ఉన్న వజ్రాలను భద్రం చేయండి. రేపు వచ్చి తమరిని కలుస్తాను’ అని ఆ వ్యాపారి వెళ్లిపోయాడు. బయట.. మంత్రి, వ్యాపారి కోసమే ఎదురు చూడసాగాడు. ‘మీ దయ వల్ల వజ్రాలన్నీ రాజుగారు కొన్నారు. మంచి ధనం వచ్చింది’ అన్నాడు వ్యాపారి.

‘మీ వ్యాపారానికి సహకరించాను. కాబట్టి నాకు కొంత ధనం ఇవ్వాలి’ అన్నాడు మంత్రి. ‘తప్పకుండా.. ఇదిగోండి’ అని కొంత ధనం ఇవ్వబోయాడు. ‘ఇక్కడ కాదు. మా ఇంటి వద్ద తీసుకుంటాను’ అన్నాడు మంత్రి. ‘నేను మీ ఇంటి బయట నిరీక్షిస్తుంటాను’ అన్నాడు వ్యాపారి. ‘అలాగే’ అన్నాడు మంత్రి. కొద్దిసేపటికి మంత్రి వచ్చి.. వ్యాపారి వద్ద నుంచి ధనం తీసుకుని ‘భీమన్న ఇంటి వద్దనే ఉన్నాడు.. అతణ్ని కూడా కలిసి వెళ్లండి’ అన్నాడు మంత్రి. ‘తప్పకుండా’ అని వెళ్లిపోయాడు వ్యాపారి.
భీమన్న వ్యాపారి కోసమే ఎదురు చూడసాగాడు. ‘వజ్రాలు అమ్ముడు పోయినట్టున్నాయి. మరి నాకు కూడా కొంత ధనం ఇవ్వండి’ అన్నాడు. ‘ఇదిగో తీసిపెట్టాను’ అని ఇచ్చాడు వ్యాపారి. భీమన్న ఇంటి ముందు నుంచి ఎద్దుల బండిలో కూరగాయలను సంతలో అమ్మడానికి వెళుతున్న రామయ్యను ఆపి ‘ఇదిగో ఈయన పొరుగు రాజ్యం వెళ్లాలి. మన రాజ్యం పొలిమేర వద్ద దింపి తర్వాత సంతకు వెళ్లు’ అన్నాడు భీమన్న. ‘అలాగే అయ్యగారు’ అన్నాడు రామయ్య.

బండి బయలుదేరాక.. ‘సంత నుంచి పొలిమేర దూరం కదా? నన్ను సంత దగ్గర దింపు చాలు. అక్కడి నుంచి నేను వెళతాను’ అన్నాడు వ్యాపారి. ‘అయ్యా! పొరుగు రాజ్యం వారంటే, మీరు మాకు అతిథులు. నాకు ఇబ్బందేమీ లేదు’ అన్నాడు రామయ్య. పొలిమేర వద్దకు రాగానే రామయ్య ఎద్దుల బండి ఆపి కిందకు దిగి.. ‘అయ్యగారూ.. జాగ్రత్తగా దిగండి’ అన్నాడు. ‘నా కోసం చాలా దూరం వచ్చావు. ఇదిగో తీసుకో’ అని ఒక వెండి నాణెం ఇవ్వబోయాడు వ్యాపారి. ‘అయ్యగారూ... చెప్పాగా! మీరు మాకెంతో కావాల్సిన వారు అని. ఇదిగోండి ఇవి నా తోటలో కాసిన కూరగాయలు’ అని కొన్ని చేతిసంచిలో పెట్టి వ్యాపారికి ఇచ్చి వెళ్లిపోయాడు రామయ్య.

మరుసటి రోజు మహారాజు ప్రత్యేకమందిరానికి మంత్రి, సైన్యాధికారిని పిలిపించాడు. అప్పటికే వ్యాపారి అక్కడ ఉన్నాడు. ‘నిజం చెప్పండి. ఈ వ్యాపారి వద్ద మీరు ఎన్ని వజ్రాలు దొంగిలించారు?’ అని గద్దించాడు రాజు. ‘మహారాజా! మాకేపాపమూ తెలియదు’ అన్నారు మంత్రి, సైన్యాధికారి. ‘అయితే మీ చేతులు చూపించండి’ అన్నాడు రాజు. ఇద్దరి కుడి అరచేతులు ఎర్రగా ఉన్నాయి. ‘మీ చేతులు ఎందుకు ఎర్రగా ఉన్నాయో తెలుసా?’ అన్నాడు రాజు. తెలియదు అన్నట్లు తలూపారు వారు.

‘వివరణ ఇవ్వు సుధామా!’ అన్నాడు రాజు. మంత్రి, సైన్యాధికారి బిత్తరపోయారు. వ్యాపారి మారువేషాన్ని తొలగించాడు. సుధాముణ్ని చూసి మంత్రి సైన్యాధికారి నివ్వెరపోయారు. ‘మహారాజా! పోయిన వారం మీరు... ఈ రాజ్యం కోసం మంత్రి, సైన్యాధికారి ఎంతో పాటుపడుతున్నారు. నువ్వేమో అందరినీ నవ్విస్తూ బహుమతులు పొందుతున్నావు. నీ పనే హాయిగా ఉంది’ అని ఎగతాళిగా మాట్లాడారు. దానికి వీరిద్దరూ కూడా అవును అన్నట్లు నవ్వారు. వీరిద్దరి గురించి కొంత విన్నాను. వీరిని పరీక్షించడానికి నేను వజ్రాల వ్యాపారిగా మారాను. వజ్రాలను ఆకు పసరులో ముంచి తీసి పెట్టెలో పెట్టి, తాళం లేదు అని కావాలనే చెప్పాను. దొంగిలించే బుద్ధి లేకపోతే వాటిని ముట్టుకోరు..’ అని జరిగింది చెప్పాడు సుధాముడు.

‘అంతేకాదు వజ్రాలు అమ్ముడు పోయినందుకు మళ్లీ ధనం కూడా తీసుకోవడం నిజంగా సిగ్గుచేటు. అవి నిజమైన వజ్రాలు కావు. నన్ను కలవాలంటే మీ ఇద్దరినీ ప్రసన్నం చేసుకోవాలని అందరినీ బాగా నమ్మించారు’ అన్నాడు రాజు.

మంత్రి, సైన్యాధికారి నేరాన్ని ఒప్పుకొన్నారు. ‘మన రాజ్యంలో నిజాయతీపరుడు అంటే రామయ్య. నేను వెండినాణెం ఇస్తానన్నా తీసుకోక అతనే తన తోటలోని కూరగాయలను ఉచితంగా ఇచ్చాడు’ అన్నాడు సుధాముడు.

మంత్రి, సైన్యాధికారిని చెరసాలలో పెట్టించి వారి నేరాలు రుజువయ్యాక, వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ దేశ బహిష్కరణ చేశాడు రాజు. ‘సుధామా.. నన్ను మన్నించు. ఇకపై నిన్ను ఇతర సేవలకు కూడా వినియోగించుకుంటాను’ అన్నాడు రాజు. ‘సంతోషం.. మహారాజా!’ అన్నాడు సుధాముడు.

 యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని