ఏనుగుకు తెలిసొచ్చింది!

అనగనగా ఒక అడవిలో కోతి, ఏనుగు స్నేహంగా ఉండేవి. అడవిలోని ఇతర జీవులకు తన చేతనైన సహాయం చేస్తుండేది కోతి. ఏనుగు కూడా కోతిలా ఇతరులకు సాయం చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంది

Published : 29 Mar 2023 00:13 IST

అనగనగా ఒక అడవిలో కోతి, ఏనుగు స్నేహంగా ఉండేవి. అడవిలోని ఇతర జీవులకు తన చేతనైన సహాయం చేస్తుండేది కోతి. ఏనుగు కూడా కోతిలా ఇతరులకు సాయం చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంది. ఒకరోజు అడవిలో పెద్ద గాలి వాన వచ్చింది. దాంతో భారీ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. చిన్న చిన్న చెట్లు కొన్ని నేలకూలాయి. గాలి దుమారానికి రాళ్లు, రప్పలు ఎగిరిపడ్డాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. ఏ జంతువూ ఆహారం కోసం బయటికి వెళ్లే పరిస్థితి లేదు. అన్నీ భయంభయంగా వాటి నివాసాల్లోనే ఉండిపోయాయి.

అర్ధరాత్రి ఒక పెద్ద చెట్టు విరిగి.. సింహం గుహ ద్వారానికి అడ్డంగా పడిపోయింది. బయటికి వచ్చే వీలు లేకపోవడంతో సింహం, దాని బుజ్జి కూన గుహలోనే చిక్కుకుపోయాయి. ఎట్టకేలకు ఉదయానికి వర్షం ఆగింది. కోతి అడవిని చుట్టి వచ్చేందుకు బయటకు వెళ్లింది. సింహం గుహకు అడ్డుగా చెట్టు కొమ్మలు పడిపోయి ఉండటాన్ని గమనించిందది. శక్తినంతా కూడదీసుకొని వాటిని పక్కకు నెట్టబోయింది. అవి చాలా పెద్దవి కావడంతో దాని బలానికి కొంచెం కూడా కదల్లేదు. గుహలోంచి కోతిని చూసి.. ‘మిత్రమా.. నువ్వు వెళ్లి ఏనుగుని పిలుచుకురా..’ అని ఆదేశించింది సింహం.

కోతి గబగబా వెళ్లి, ఏనుగుకు విషయం చెప్పింది. ఏనుగు వెంటనే కోతితో కలిసి గుహ వద్దకు చేరుకుంది. గుహకు అడ్డంగా పడిన చెట్టు కొమ్మలను తన తొండంతో పక్కకు నెట్టేసింది. ఆ తర్వాత గుహలోంచి సింహం బయటికి వచ్చింది. ‘మిత్రమా.. నువ్వు చాలా బలమైన దానివి. అంత పెద్ద కొమ్మలను పక్కకు జరపటం నీకే సాధ్యం. ఇలాగే కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉండు..’ అంటూ ఏనుగుని అభినందించి, కానుకలు ఇచ్చి పంపించింది సింహం. మృగరాజు ప్రశంసలతో ఏనుగు ఉత్సాహం రెట్టింపైంది. కోతితో కలిసి అడవి మొత్తం తిరుగుతూ.. దారికి అడ్డంగా పడిన చెట్ల కొమ్మలను పక్కకు జరిపింది.

ఒకరోజు సింహం తన బుజ్జి కూనతో బయటకు వెళ్లింది. ఆ కూన అప్పుడప్పుడే తల్లిని చూసి నడక, వేట నేర్చుకుంటుంది. అవి రెండూ అలా వెళ్తుండగా.. ఓ కుందేలు పిల్లని చూసిందా కూన. దాన్ని వేటాడబోయి పక్కనే ఉన్న ఓ పెద్ద గుంతలో పడిపోయింది. సింహం దగ్గరకు వెళ్లి చూస్తే.. ఆ గొయ్యి చాలా లోతుగా ఉన్నట్లు కనిపించింది. దిక్కు తోచక భయంతో బోరున ఏడవసాగిందా కూన. ఇంతలో ఏనుగు అటుగా రావడం గమనించింది సింహం. ‘మిత్రమా.. నా బుజ్జి కూన గుంతలో పడిపోయింది. నువ్వు వెంటనే కోతిని పిలుచుకు రా..’ అంది. ‘ఈ మాత్రం దానికే కోతి ఎందుకు? ఇప్పుడు నేను వెళ్లి కోతిని పిలుచుకొస్తే.. అది సింహం కూనను రక్షిస్తుంది.. మృగరాజు మన్ననలు పొందుతుంది. దానికి ఆ అవకాశం ఇవ్వకూడదు’ అని మనసులోనే అనుకుంది ఏనుగు.

‘మృగరాజా.. ఈ చిన్న పనికే కోతి ఎందుకు.. మీ బుజ్జి కూనను గొయ్యిలోంచి నేనే పైకి తీసుకొస్తా’ అంటూ పరుగున వెళ్లి అందులో దూకేసింది ఏనుగు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. బుజ్జి కూన పక్కకు తప్పుకొని త్రుటిలో ప్రాణాలు దక్కించుకుంది. గుంత లోతుగా ఉండటంతో ఏనుగు గాయపడింది. ఎంత ప్రయత్నించినా, బయటకు మాత్రం రాలేకపోయింది. కుందేలు ద్వారా కబురు అందుకున్న కోతి.. పరుగున అక్కడికి చేరుకుంది. గుంత అంచుల వెంబడి లోపలికి వెళ్లింది కోతి. సింహం కూనను తన పొట్టకు తగిలించుకొని, వెళ్లిన దారిలోనే బయటకు తీసుకొని వచ్చింది. ‘మిత్రమా.. ఎలాగైనా నన్ను కూడా కాపాడు’ అంటూ పెద్దగా అరిచింది ఏనుగు.

ఈలోగా ఎలుగుబంటి, పులిని పిలిచిన సింహం.. వాటి సాయంతో ఏనుగును బయటికి తీసుకొచ్చింది. రాగానే ఏనుగును చూసి కోపంతో గర్జించింది సింహం. ‘కోతిని పిలుచుకురమ్మని చెప్పినా వినకుండా, గొయ్యిలోకి దూకి నీ ప్రాణాలతోపాటు నా బిడ్డకూ ముప్పు తీసుకొచ్చావు. ఏదైనా పని చేసే ముందు అన్ని కోణాల నుంచి ఆలోచించాలి’ అని మందలించింది సింహం. తప్పు తెలుసుకున్న ఏనుగు.. మిత్రుడు కోతితో కలిసి ఇంటికి బయలుదేరింది. దారిలో కోతి.. ‘‘మిత్రమా.. నువ్వు ఎంత బలవంతుడివైనా, నీ అవసరం లేని చోట ఆ శక్తి పనికిరాదు. ‘అనువు కానిచోట అధికులమనరాదు’ అని పెద్దలు ఊరకే చెప్పలేదు’’ అంది. అవునన్నట్లు తలూపింది ఏనుగు.
పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని