నందనవనానికి విహారి మహారాజైంది!

నందనవనం అనే అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అసలే అర్ధరాత్రి, మరోవైపు చిమ్మచీకటి. విహారి అనే ఏనుగు తన కాలికి ఏదో తగలడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచింది. చూస్తే చుట్టూ మంటలు.

Updated : 28 Feb 2023 01:14 IST

నందనవనం అనే అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అసలే అర్ధరాత్రి, మరోవైపు చిమ్మచీకటి. విహారి అనే ఏనుగు తన కాలికి ఏదో తగలడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచింది. చూస్తే చుట్టూ మంటలు. వాటిని చూడగానే క్షణమైనా ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న సరస్సు వద్దకు వెళ్లింది. మంటల వెలుగులో తన తొండంతో నీటిని ఒడిసి పట్టి, మంటలపై చల్లింది.

‘అడవి అంటుకుపోతోంది.. అందరూ నిద్రలేవండి!’ అంటూ అరుస్తూనే మంటలను ఆర్పివేసింది. కానీ ఏ జీవీ అప్పటికి లేవలేదు. నెమ్మదిగా తెల్లారింది. జంతువులు, పక్షులు నిద్రలేచి మంటలకు కాలిన ప్రదేశాన్ని విచిత్రంగా గమనించసాగాయి. విహారి సాహసాన్ని గుర్తించాయి. ‘సమయానికి విహారి మంటలను అదుపు చేయకపోతే మనకు ప్రాణ నష్టం జరిగేది’ అనుకున్నాయి. విహారిని మెచ్చుకున్నాయి.

‘మృగరాజుకు ఈ విషయం తెలిసిందా?’ జంతువుల సమూహంలో ఉన్న జింక ఒకటి ముందుకు వస్తూ అడిగింది. ‘కాకితో కబురు పంపాను’ అంది పగడం అనే నక్క. అప్పుడే ఆ కాకి ఎగురుకుంటూ అక్కడకు వచ్చింది. ‘జరిగిన ప్రమాదం గురించి విని మృగరాజు ఏమన్నారు? ఇక్కడకు వస్తున్నారా?’ అని జింక, కాకిని అడిగింది. ‘లేదు! ఇలాంటి చిన్న చిన్న విషయాలు నా వద్దకు తీసుకు రావద్దు. నేను నిద్రపోవాలి. వెళ్లిపో!’ అంటూ గట్టిగా గర్జించింది. భయపడి నేను వచ్చేశానని కాకి అంది.
‘వెంటనే మనందరమూ విహారితో కలిసి మృగరాజు వద్దకు వెళ్లాలి!’ గట్టిగా అంది జింక. ‘ఎందుకు?’ అని అడిగింది పగడం. ‘అక్కడే చెబుతాను.. పదండి!’ అంటూ విహారితో సహా అందరినీ మృగరాజు వద్దకు బయలుదేరదీసింది. ‘అంతా ఇలా కట్టకట్టుకు వచ్చారెందుకు?’ అని మృగరాజు అడిగింది.

జింక ధైర్యం తెచ్చుకుంటూ.. ‘జరిగిన ప్రమాదం గురించి మీకు తెలిసి కూడా.. ఇలా అడగడం ఏమీ బాగాలేదు మృగరాజా!’ అని కాస్త బాధగా అంది. ‘సరే! ఇప్పుడు నేను విహారికి దండ వేసి, దండం పెట్టాలా? ఇదేమైనా పెద్ద ప్రమాదమా?’ అంతే వెటకారంగా అంది సింహం. దీంతో జింకలో ఆవేశం ఎక్కువైంది. మిగతా జీవులన్నీ మృగరాజు ప్రవర్తనను ఆశ్చర్యంగా గమనించ సాగాయి. ‘పగడం! మాట్లాడవేంటి? రాజైన సింహం వెక్కిరిస్తుంటే చూస్తూ ఊరుకుంటావా?’ అని జింక, నక్క వైపు చూస్తూ అడిగింది.
‘మనందరికీ రాజు కదా! ఆయన్ను ధిక్కరిస్తే ఇక్కడ జీవించే హక్కును కోల్పోతానని ఆలోచిస్తున్నాను. ఎదిరించి సాధించలేనప్పుడు మౌనం మేలని మిన్నకుండి పోతున్నాను!’ అని పగడం నెమ్మదిగా అంది. కానీ జింకకు పగడం చెప్పిన మాటలు నచ్చలేదు.

‘ఎన్నాళ్లు? ఇంకా ఎన్నేళ్లు? ఆసనం మీద కూర్చున్నవాడు రాజు కాదు. ఆపదలో కాపాడిన వాడే నిజమైన రాజనిపించుకుంటాడు. అందుకు విహారికి పూర్తి అర్హతలు ఉన్నాయి. నేను విహారిని రాజు కావాలనుకుంటున్నాను. నా నిర్ణయాన్ని సమర్థిస్తూ నాతో వచ్చేదెవరు?’ అంటూ అన్ని జీవుల వైపూ చూసింది జింక.

జింక ధైర్యానికి పగడం ఆశ్చర్య పోసాగింది. మృగరాజు జింక వైపు విచిత్రంగా చూడసాగింది. జింక నిర్ణయాన్ని సమర్థిస్తూ అన్ని జీవులూ దాని వైపు వెళ్లాయి. పగడం అటు వైపు వెళ్లాలా.. వద్దా.. అని ఆలోచించ సాగింది. ‘నేను రాజుగా ఉండను. నాకు ఇష్టం లేదు!’ అని విహారి గట్టిగా అంది. ‘భలే అన్నావు విహారీ!’ అంది మృగరాజు.
‘చూడు విహారీ! సమర్థులు చేతులు కట్టుకుని కూర్చుంటే అసమర్థులు మితిమీరి ప్రవర్తిస్తారు. వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారుతుంది. చెప్పిందే శాసనంగా తయారవుతుంది. జీవులు అన్యాయమై పోతాయి. ఎదిరించే వారు లేకపోతే బెదిరించే వాళ్లదే రాజ్యం అవుతుంది. నీ వెనుక మేమంతా ఉన్నాం. మా ముందుండి మమ్మల్ని కాపాడు.. కాదనకు’ అంది జింక. ఈ మాటలతో విహారిలో మార్పు మొదలైంది.

‘నేను రాజుగా ఉంటాను’ అని విహారి గట్టిగా అంది. ‘మృగరాజా! విహారికి సింహాసనాన్ని అప్పగించి మర్యాదగా పదవి నుంచి తప్పుకోండి’ అని జింక, సింహం వైపు చూస్తూ అంది. ‘తప్పుకోను. విహారిని రాజుగా ఒప్పుకోను. అందరూ వెళ్లిపోతే మీకే మంచిది. లేకపోతే నందనవనాన్ని చిందరవందరగా చేసేస్తాను. మీ అందరినీ విడతల వారీగా చంపి తింటాను!’ అని సింహం గర్జిస్తూ గట్టిగా అంది.

దీంతో విహారిలో ఆవేశం వచ్చింది. ‘తోటి జీవుల ప్రాణం తీస్తానంటే చూస్తూ ఊరుకోను. ఇప్పుడే మీతో తలపడతాను’ అంటూ విహారి సింహం వైపు ఆవేశంగా నడిచింది. ‘విహారీ! అనవసరంగా మృగరాజుతో తలపడకు’ అంటూ పగడం ఆపింది.

పగడం ప్రవర్తనకు జింకతో సహా అన్ని జీవులూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ‘జిత్తులమారివి అనిపించావు. మోసం చేయడం నీ నైజం. విహారికి అడ్డు రాకు. తప్పుకో!’ అని జింక అనేసరికి అన్ని జీవులూ దాని మాటలను సమర్థించాయి. ‘తప్పుకొంటాను. కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి!’ అని పగడం దీనంగా వేడుకునే సరికి.. ఏం చెబుతుందో చూద్దామని జింకతో సహా అన్ని జీవులూ సరే అన్నాయి. అప్పుడు పగడం ఇలా చెప్పసాగింది. ‘‘చూడండి! కొన్ని రోజుల క్రితం మృగరాజు నాతో.. ‘నాకు విశ్రాంతి కావాలి. కానీ నా తర్వాత రాజుగా ఉండే అర్హతలన్నీ విహారిలో ఉన్నాయి. విహారి అడవంతా విహరిస్తుంది. అన్ని జీవులనూ ఆదరిస్తుంది. ఆపదలో ఉన్నవారిని కాపాడుతుంది. కనుక విహారితో ఈ విషయం చెప్పు’ అని పంపింది. కానీ విహారి నా మాటలకు ఒప్పుకోలేదు. రాజుగా ఉండనంది. మృగరాజుతో అదే విషయం చెప్పాను. ‘శక్తి, యుక్తులున్న వారు బాధ్యతలు మోయలేనంటే ఎలా?’ అని మృగరాజు అంటూ ఒకరాత్రి వేళ అడవిలో చిన్నగా మంటలంటించమంది. అలాగే విహారికి మెలకువ వచ్చేలా చేయమంది. ఏ ప్రాణ నష్టం జరగకుండా చూడమంది. నేను మృగరాజు ఆలోచన అమలు చేశాను. విహారిలో చైతన్యం కలిగింది. ఇప్పుడు చెప్పండి మృగరాజుతో తల పడదామా.. జై కొడదామా...’’ అని పగడం అంది.

జింక, విహారితో సహా అన్ని జీవులూ ఆశ్చర్యపోయాయి. ‘మమ్మల్ని మన్నించండి మృగరాజా!’ అని జింకతో సహా జీవులన్నీ అన్నాయి. మృగరాజు నవ్వుతూ లేచింది. ‘క్షమాపణలకు ఇక్కడ చోటు లేదు. మీకు తెలియదు కాబట్టి అలా అన్నారు. ఆవేశాన్ని అవసరంగా మార్చాలనుకున్నాను. విహారిలో మార్పు తేవాలనుకున్నాను. అందుకే పగడంతో కలిసి చిన్న నాటకమాడాను. మా ప్రయత్నం ఫలించింది. విహారీ! ఇప్పటికైనా రాజుగా ఉంటావా?’ అని సింహం గట్టిగా అడిగింది. ‘మీ మాటలను గౌరవిస్తున్నాను మృగరాజా!’ అని విహారి వినయంగా అంది. ‘హమ్మయ్య! నాకు విశ్రాంతి దొరికింది. విహారి మహా రాజైంది’ అని సింహం నవ్వుతూ అంది. మిగతా జీవులూ నవ్వాయి.

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని