Published : 27 Jan 2023 00:15 IST

ఊరి కరవు తీరింది!

అడవికి ఆనుకొనే ఉండటంతో అడవిగూడెం అనే ఊరికి ఆ పేరు వచ్చింది. ఆ గ్రామంలో శేషయ్య అనే రైతు ఉండేవాడు. శేషయ్య తన ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ.. భార్యాపిల్లల్ని పోషించుకునేవాడు. అడవిగూడెం గ్రామానికి ఆనుకొనే అడవితోపాటు చుట్టూ ఎత్తైన కొండలు ఉండటంతో అడవి జంతువుల భయం ఎప్పుడూ ఉండేది. అప్పుడప్పుడూ చిరుతలు, నక్కలు ఆ ఊరిలోకి వచ్చి కోళ్లనూ, మేకలనూ ఎత్తుకు పోతుండేవి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు గ్రామస్థులు తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. శేషయ్య కూడా తన ఇంటి చుట్టూ ఎత్తయిన ప్రహరీ నిర్మించుకున్నాడు. అయినా, ఇంట్లోకి జంతువులు ప్రవేశిస్తే.. వాటిని తరిమికొట్టేలా పరికరాలనూ సిద్ధంగా ఉంచేవాడు. ఇంత చేసినా.. ఒక నక్క చాలా తెలివిగా ఆయన ఇంట్లోకి వచ్చి కోళ్లను ఎత్తుకెళ్లేది. అలా చాలా పెంపుడు జీవులు దానికి ఆహారమయ్యాయి. గ్రామస్థులందరూ కలిసి ఆ నక్కను ఎలాగైనా చంపెయ్యాలని తీర్మానించారు. సరైన సమయం కోసం ఎదురు చూడసాగారు.
ఇలా రోజులు గడుస్తుండగా అడవిగూడెంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.

కరవు ప్రభావంతో పంటలన్నీ ఎండిపోయాయి. తాగునీటి కోసం అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోసాగారు. కొద్దిరోజుల్లోనే ఆహార సంక్షోభం ఏర్పడింది. అందుకే అక్కడి ప్రజలు కొండల మీదకు వెళ్లి, జంతువులను వేటాడి తమ కడుపు నింపుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరిలాగే శేషయ్య కూడా ఆహార అన్వేషణ కోసం కొండ మీదకు వెళ్లాడు. అక్కడ, నక్క వలలో చిక్కి కనిపించింది. తప్పించుకోవడానికి ఎప్పటి నుంచో తీవ్ర ప్రయత్నం చేస్తూ.. బాగా అలిసిపోయినట్లు కనిపించింది. ఆపదలో ఉన్న తనను పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్న శేషయ్యను చూసి.. ‘అయ్యా.. దయచేసి నన్ను ఈ వల నుంచి తప్పించండి. మీకు రుణపడి ఉంటాను’ అని కోరింది నక్క. అందుకు శేషయ్య.. ‘ఓ నక్కా.. నిన్ను చంపేందుకు మా ఊరి వాళ్లు చాలారోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఇలా వలలో చిక్కావని తెలిస్తే.. వారందరూ ఎంతో సంతోషిస్తారు. అయినా మేమంతా ప్రస్తుతం కరవు కోరల్లో చిక్కుకున్నాం. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నాం. నేను ఆహారం ఏదైనా దొరుకుతుందేమో అని ఇక్కడకు వచ్చాను. నిన్ను విడిపించి సహాయం చేసే సమయం నాకు లేదు’ అంటూ ముందుకు కదిలాడు.

అందుకు నక్క.. ‘అయ్యా.. నేను ఆహారం కోసం మీ ఊరిలోకి రావడం తప్పయితే, ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి? దయచేసి నన్ను వదిలేస్తే మీ ఊరికి కరవు తీరే ఉపాయం చెబుతాను’ అంది. ఆ మాటలకు ఆలోచనలో పడిన శేషయ్య.. నక్క చెప్పినదాంట్లో నిజం ఉందని గ్రహించాడు. నక్క చిక్కుకున్న వలను తన కొడవలితో కోసేశాడు. అది ఒక్క క్షణంలోనే అందులోంచి బయటకు దూకేసింది. శేషయ్య చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పి.. ఒక ఎత్తయిన ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ సమృద్ధిగా పండ్లు, కూరగాయల చెట్లు ఉన్నాయి. ‘అయ్యా.. ఇక్కడ ఉన్న ఫలసంపదను తీసుకెళ్లండి. ఇక మీకు ఆహార కొరత ఉండదు’ అని చెప్పింది నక్క. శేషయ్య సంచుల నిండా పండ్లను, కూరగాయలను నింపుకొన్నాడు. అంతేకాకుండా ఆ పక్కనే ఉన్న అపారమైన జలసంపదను చూపించిందది.
ఇక్కడి నుంచి ఓ కాలువ తవ్వుకుంటే.. ఊరిలోకి నీరు అందుతుందని ఉపాయాన్ని కూడా చెప్పింది నక్క. దాని అద్భుత తెలివికి ఆశ్చర్యపోయిన శేషయ్య.. ధన్యవాదాలు చెప్పి ఊర్లోకి వెళ్లిపోయాడు. కొండ మీద ఆహారంతోపాటు నీరు కూడా లభ్యమవుతుందన్న విషయాన్ని గ్రామ పెద్దతో చెప్పాడు. ఆ మరుసటి రోజే ప్రజలంతా కొండ మీద నుంచి ఊరికి కాలువ తవ్వే పనులను ప్రారంభించారు. చాలా కొద్దిరోజుల్లోనే గంగమ్మ పరుగులు పెడుతూ గ్రామానికి చేరింది. ప్రజలకు నీటితోపాటు ఆహార కొరత తీరింది. ఊరికి ఎంతో మేలు చేసిన నక్కకు వాళ్లందరూ కృతజ్ఞతలు చెప్పారు. అప్పటి నుంచి జంతువుల పట్ల సానుభూతి చూపుతూ మానవత్వాన్ని చాటారు.

వడ్డేపల్లి వెంకటేశ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని