కోకిల కూత బాగుంది!

పెరట్లో వేప చెట్టు మీద వాలిన కోకిల.. ‘కూ.. కూ!’ అంటూ మధురంగా కూస్తోంది. అయిదో తరగతి చదువుతున్న మల్లికి ఆ కోకిల కూత బాగా నచ్చింది. ‘కూ.. కూ!..’ అంటూ తనూ బదులుగా అంది.

Published : 21 Mar 2023 00:55 IST

పెరట్లో వేప చెట్టు మీద వాలిన కోకిల.. ‘కూ.. కూ!’ అంటూ మధురంగా కూస్తోంది. అయిదో తరగతి చదువుతున్న మల్లికి ఆ కోకిల కూత బాగా నచ్చింది. ‘కూ.. కూ!..’ అంటూ తనూ బదులుగా అంది. అప్పుడు కోకిల కూడా.. ‘కూ.. కూ!’ అంటూ మళ్లీ కూసింది. మల్లికి భలే ముచ్చటగా అనిపించింది.

అప్పుడే పక్క వాటాలోకి కొత్తగా వచ్చిన లిల్లీ బయటకు వచ్చింది. వరండాలోని అరుగు మీదే ఉన్న మల్లిని చూసి గదిలోకి వెళ్లిపోయింది. లిల్లీ అని పిలిచినా రాలేదు. దీనంగా ఉన్న మల్లిని చూసి.. ‘ఎందుకలా ఉన్నావు?’ అని అడిగింది వాళ్లమ్మ రాణి. ‘లిల్లీ మన పక్క వాటాలో ఉంటోంది. బడిలో నా వెనుక బెంచీ మీద కూర్చుంటుంది. కానీ బడికి నాతో కలిసి రాదు. నాతో మాట్లాడదు. నేనేం తప్పు చేశాను?’ అని అడిగింది.

అప్పుడు రాణి నవ్వుతూ.. ‘లిల్లీ వాళ్లు మొన్ననే కొత్తగా వచ్చారు కదా. తనకు అంతా కొత్తగా ఉంటుంది. మెల్లగా అలవాటు అవుతుంది. అప్పటి వరకూ ఎదురు చూడాలి గానీ, బాధ పడకూడదు’ అని అమ్మ ఓదార్పుతో సరేనంది మల్లి.

‘మల్లి కూడా నీ బడిలోనే చదువుతోంది కదా! తనతో కలసి వెళ్లొచ్చు కదా!’ అని లిల్లీతో అంది వాళ్లమ్మ రమ. ‘నాకు సిగ్గమ్మా.. కొత్తవాళ్లతో మాట్లాడలేను!’ అంటూ చకచకా బడికి వెళ్లిపోయింది లిల్లీ.

‘ఇద్దరూ ఒకే బడిలో చదువుతున్నా, కలిసి వెళ్లడం లేదు.. ఒకే ఇంటిలో ఉంటున్నా, మాట్లాడుకోవడం లేదు!’.. రోజూలానే లిల్లీ తన ముందు నుంచే తన దారిన తాను బడికి వెళ్లి పోవడం చూసి అనుకుంది మల్లి. బడిలో తన వెనుకనే కూర్చున్న లిల్లీని చూసి నవ్వింది మల్లి. కానీ లిల్లీ బదులుగా నవ్వలేదు.

‘లిల్లీకి గర్వం ఎక్కువేమో? ఎవరితోనూ మాట్లాడదు’ అని మల్లితో స్నేహితురాలైన దివ్య అంది. ‘గర్వం కాదు, కొంచెం సిగ్గు. కొత్తగా వచ్చింది కదా. కొన్ని రోజుల్లో బాగా మాట్లాడుతుందని మా అమ్మ చెప్పింది!’ అని దివ్యతో అంది మల్లి.

ఆ మాటలు లిల్లీ చెవిన పడ్డాయి. అప్పుడే తరగతిలోకి తెలుగు టీచరు వచ్చారు. ‘పిల్లలూ! ఈ రోజు మనం తొలి పండుగ అనే పాఠం చదువుకుందాం!’ అంటూ పాఠం చెప్పడం ప్రారంభించారు. తరగతి గదిలో ఇతర పిల్లలతోపాటు మల్లి, లిల్లీలు కూడా టీచర్‌ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు. ‘తెలుగు వారికి తొలి పండుగ ఉగాది. ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఆరు రుచులతో ఉగాది పచ్చడిని అందరూ చేసుకుని తింటారు. ఉగాది అంటేనే కొత్తదనానికి స్వాగతం పలకడం. కూ.. అంటూ కోయిల మధురంగా కూస్తుంది. తన కూతకు బదులివ్వగానే ఎంతో ఆనందిస్తుంది. కొత్తవారు కదా అని సిగ్గు పడదు. మళ్లీ మళ్లీ మధురంగా కూస్తుంది. మనకు ఆనందాన్నిస్తుంది. కొత్తవారిని పలకరించడంలో కోకిలను ఆదర్శంగా తీసుకోవాలి’ అని టీచర్‌ చెప్పిన పాఠం లిల్లీని ఆలోచనలో పడేసింది.

‘ఉగాది... అంటేనే మార్పునకు పునాది!’ అని చెప్పిన టీచర్‌ మాట లిల్లీకి ఎంతగానో నచ్చింది. అప్పుడే విరామ సమయం ఇచ్చారు. ‘మల్లీ!’ అని ఆప్యాయంగా పలకరించింది లిల్లీ. ఆ పిలుపుతో ముందు ఆశ్చర్యపోయినా, తర్వాత ఆనందించింది మల్లి.

‘గతంలో చదివిన బడిలో, కొత్తగా చేరినప్పుడు నన్ను కొంతమంది ఆట పట్టించారు. అప్పటి నుంచి కొత్తవారితో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. దివ్యతో నా గురించి చెప్పిన మాటల ద్వారా నీ మంచితనం తెలిసింది. కొత్తవారిలోనూ మంచి వారుంటారని నిన్ను చూసి తెలుసుకున్నాను. నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. నీకిష్టమే కదూ!’ అనే లిల్లీ మాటలకు మల్లి నవ్వుతూ.. ‘నీతో స్నేహం.. నాకెంతో ఆనందం!’ అంది.

సాయంత్రం బడి పూర్తి కాగానే రోజూలా కాకుండా మల్లి, లిల్లీలు కలిసి ఇంటికి రావడాన్ని రాణి, రమ గమనించారు. వారి వైపు మురిపెంగా చూస్తూ.. ‘ఇద్దరూ మిత్రులయ్యారే.. చాలా ముచ్చటగా ఉంది!’ అంది రాణి.  

‘అవును లిల్లీ.. మల్లితో నువ్వు కలవడం నాకు ఆనందాన్నిచ్చింది’ అంది రమ. ‘కలిసే బడికి వెళతాం. కలిసే ఇంటికి వస్తాం. ఇకపై ఎప్పుడూ కలిసే ఉంటాం. మా మనసులు మల్లె కన్నా తెల్లనైనవి. మంచు కన్నా చల్లనైనవి. రేపే ఉగాది... మార్పునకు పునాది. కొత్తదనానికి స్వాగతం పలుకుతూ... మల్లిని మిత్రురాలిగా చేసుకున్నాను. కొత్తవారందరూ చెడ్డవారు కారని తెలుసుకున్నాను!’ మల్లి వంక చూస్తూ, నవ్వుతూ అంది లిల్లీ. ‘శభాష్‌ లిల్లీ! రేపు ఉగాది పచ్చడిని అందరం కలసి చేసుకుందాం.. కలిసి తిందాం.. కొత్తదనానికి స్వాగతం పలుకుదాం’ అంది రాణి.

ఈ మాటలు విన్న మల్లి.. ‘భలేగా చెప్పావమ్మా!’ అంటూ దగ్గరగా వెళ్లింది. అప్పుడే చెట్టుపైన కోకిల ‘కూ’ అంటూ కూసింది. అది గమనించిన లిల్లీ కూడా.. ‘కూ’ అంటూ బదులిచ్చింది. ‘కూ... కూ..!’ అంటూ కోకిల కూతకు వంత పాడింది. ‘కోయిల కొత్త రాగం చాలా బావుంది లిల్లీ!’ అంటూ మురిపెంగా చెప్పింది మల్లి.  

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని