Published : 01 Feb 2023 00:23 IST

అపకారికి ఉపకారం!

డవిలో అన్నింటికన్నా ముసలి జంతువు ఎలుగుబంటి. ఆ అడవిలోని ప్రతి మొక్కా, ప్రతి చెట్టూ గురించి తెలిసింది దానొక్కదానికే. అందుకే ఎలుగుబంటిని అందరూ వనమాత అని గౌరవంగా పిలుచుకుంటారు. చివరకు మృగరాజు కూడా దాని సూచనలు, సలహాలు తీసుకుంటాడు. ఒకరోజు ఆ అడవిలోకి ఎక్కడి నుంచో గాయాలతో వచ్చిన ఒక నక్క మృగరాజు ముందు కుప్పకూలి.. ‘రక్షించండి.. రక్షించండి.. వైద్యం చేయించండి’ అని ప్రాధేయపడింది.

‘ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏమైంది నీకు?’ అని అడిగింది సింహం. ‘నేను సుందరవనం అటవీ ప్రాంతం నుంచి విహారానికి బయలుదేరాను. ఈ అడవిలోకి రాగానే.. కొన్ని పులుల కంటపడ్డాను.. అవి నన్ను తరమడంతో.. తప్పించుకొనే క్రమంలో గాయపడ్డాను. వైద్యం కోసం మీ వద్దకు వచ్చాను. దయచేసి నన్ను రక్షించండి’ అని కోరింది. ‘సరే.. ముందు నీకు వైద్యం చేయిస్తాను’ అంటూ పక్కనే ఉన్న ఏనుగుని పిలిచి.. ‘ఈ నక్కకు వైద్యం చేయండి’ అని ఆదేశించింది. ‘అలాగే మహారాజా!’ అంటూ నక్కకు చికిత్స చేయగా.. వారం రోజుల్లో పూర్తిగా నయం అయింది.

కోలుకున్న నక్క.. సింహం దగ్గరకు వచ్చి ‘మీ సహాయానికి నా కృతజ్ఞతలు. ఈ అడవి నాకు చాలా నచ్చింది. దయచేసి నేను ఇక్కడే ఉండేందుకు అనుమతించండి’ అని కోరింది. సింహం ఒక నిమిషం ఆలోచించి.. ‘సరే.. ఏ విషయమూ రేపు చెబుతాను’ అంది. సరేనని అక్కడి నుంచి వెళ్లిపోయింది నక్క.
మరుసటి రోజు.. ‘సరే నిన్ను ఇక్కడ ఉండడానికి అనుమతిస్తున్నాను. అయితే ఇక్కడున్న జంతువులకు హాని తలపెట్టకూడదు. ఇది ఈ అడవి షరతు’ అని స్పష్టం చేసింది సింహం. ‘అలాగే మృగరాజా.. ధన్యవాదాలు’ అంటూ ఆనందంతో అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది నక్క. కొన్ని రోజులు గడిచాయి. ఆ అడవిలో ఉన్న జంతువులు ఎలుగుబంటిని ఎక్కువగా గౌరవించడం నక్కకు ఏమాత్రం నచ్చలేదు.

పైపెచ్చు ఆ అడవిలో ఏ జీవికి కూడా గొడవలు పడే స్వభావం లేకపోవడం దానికి మింగుడుపడలేదు. ఒకరోజు అడవిలోని ఉత్తర దిక్కుగా తిరుగుతున్న జంతువుల్లో కొన్ని ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయాయి. అందులో కొత్తగా వచ్చిన నక్క కూడా ఉంది. వాటి పరిస్థితిని గమనించిన ఏనుగు విషయాన్ని సింహానికి తెలియజేయగా.. అది ఎలుగుబంటిని పురమాయించింది.

ఎలుగుబంటి ఒక్క క్షణం ఆలోచించి ఏనుగును తూర్పు ప్రాంతంలోని చెట్ల నుంచి కొన్ని ఆకులను తీసుకురమ్మంది. ఆ ఆకుల్ని పిండి పసరు తీసి పడిపోయిన జంతువుల నోట్లో పోసింది. కొద్దిసేపట్లోనే అవన్నీ స్పృహలోకి వచ్చాయి. ‘చూశారా.. సమూహంగా, ఐక్యంగా ఉండటం వల్ల ఎన్ని లాభాలో..’ అంది మృగరాజు. అవునన్నట్లు జీవులన్నీ తలూపాయి.

కొద్ది రోజులు గడిచాయి. నక్కకు ఏదో వెలితి. తన సహజమైన తగువులు పెట్టే స్వభావం ఉపయోగించలేక పోతున్నందుకు బాధపడసాగింది. నిదానంగా సింహం వద్దకు చేరి.. అడవిలోని వివిధ జంతువుల మీద చాడీలు చెప్పసాగింది. అయితే ఆ మాటలు విని నవ్వి ఊరుకునేది సింహం. దాంతో నక్కకు ఇంకా అసహనం పెరిగిపోయింది. ఇక లాభం లేదనుకుని మృగరాజును పొగడటం ప్రారంభించింది.

ఒకరోజు నక్క.. సింహం వద్దకు వచ్చి ఎలుగుబంటి గురించి చెడుగా చెప్పడం ప్రారంభించింది. అప్పుడే అటుగా వెళుతున్న ఎలుగుబంటి.. సింహంతో మాట్లాడుతున్న నక్క వైపు వేగంగా కదిలింది. తన వైపు వస్తున్న ఎలుగుబంటిని చూసిన నక్క.. ‘అమ్మ బాబోయ్‌.. ఈ ముసలి ఎలుగుకు నా మాటలు వినిపించాయా ఏంటి?’ అని అనుకుంది.

ఈలోగా ఎలుగుబంటి ఒక్కసారిగా నక్క మీదకు దూకడంతో.. అది పక్కకు తప్పుకొంది. ఇంతలో వెనక నుంచి ఒక పెద్ద చెట్టు విరిగి పడింది. అది చూసిన మృగరాజు ‘ఎంత ప్రమాదం తప్పింది. సమయానికి ఎలుగుబంటి రాకపోతే నక్క చనిపోయి ఉండేది’ అంది. కొంత సమయం తర్వాత తేరుకున్న నక్క.. అసలు విషయం తెలుసుకొని ‘నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమించండి. మీలాంటి గొప్ప మనసు కలిగిన జంతువుల మధ్య నేను ఉండదగిన దాన్ని కాదు’ అని అక్కడ నుంచి తాను వచ్చిన అడవికే తిరిగి వెళ్లబోయింది.

వెంటనే ఎలుగుబంటి ‘నక్క మిత్రమా.. ఈ లోకంలో ఎన్నో రకాల జీవులున్నాయి. ప్రతి జీవి ఇతర జీవులకు ఏ హానీ చేయకుండా బతకాలి. కానీ, ఈ మధ్యకాలంలో ఒకరిని ఇబ్బంది పెట్టి, తమ పబ్బం గడుపుకుంటున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు’ అని హితబోధ చేసింది.

ఇంతలో మృగరాజు కలగజేసుకొని ‘అవును.. నువ్వు ఈ అడవిలో ఉండడానికి అనుమతి అడిగినప్పుడు, నేను ఒకరోజు కావాలన్నాను. ఎందుకో తెలుసా? మా వనమాత అయిన ఎలుగుబంటి సలహా కోసం.. ఎందుకంటే కొత్త వాళ్లకు ఆశ్రయం ఇవ్వాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. వారి వల్ల మనకు ఏ నష్టం జరగదని భావిస్తేనే అవకాశం ఇవ్వాలి. నువ్వు ఇక్కడ ఉండడానికి కారణమైన ఎలుగు మీదే చాడీలు చెబుతున్నావు. మనం కొత్త చోటకు వెళ్లినప్పుడు అక్కడి పద్ధతులను అనుగుణంగా నడుచుకోవడం ధర్మం’ అంది. నక్కకు జ్ఞానోదయం కావడంతో క్షమాపణలు కోరింది.

కళ్లేపల్లి ఏడుకొండలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు