Published : 02 Feb 2023 00:24 IST

జయదేవుడి తెలివితేటలు!

కోసల దేశానికి రాజు జయదేవుడు. చాలా తెలివితేటలు కలిగిన పరాక్రమవంతుడు. పరిపాలనాధీశుడు, సమర్థుడు కావడం వల్ల పాలన కూడా సుభిక్షంగానే ఉంది. ఒకరోజు మంత్రి రాజ్యంలోని కష్టసుఖాల గురించి రాజు గారితో చర్చిస్తున్నారు. ‘ప్రభూ..! మన నగరంలోని రాజవీధి.. పూర్వీకుల కాలంలో నిర్మితమైంది. అందువల్ల ప్రస్తుతం అది చాలా ఇరుకుగా ఉంది. వీధికి అటూ ఇటూ ఉన్న ఇళ్లు కూడా చాలా పురాతనమైనవి. వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల ఇళ్లు కూలిపోయి ప్రాణనష్టమూ కలగవచ్చు. కనుక ఆ ఇళ్లు పడగొట్టించాలి. వీధి కూడా వెడల్పు చేయించాలి’ అన్నాడు మంత్రి.
‘యుద్ధప్రాతిపదికన ఆ పనులు ప్రారంభిద్దాం’ అన్నాడు రాజు జయదేవుడు. ‘కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. చెప్పమంటారా?’ అన్నాడు మంత్రి. ‘రాజ్యంలో అన్ని వీధుల కన్నా ప్రధానమైనది రాజవీధి. అలాంటిది అక్కడ సమస్య ఉన్నప్పుడు పరిష్కరించాలి కదా! తప్పకుండా చెప్పండి మంత్రివర్యా’ అన్నాడు రాజు.
‘ప్రభూ, ఆ భవనాలను పడగొట్టడానికి ముందు ఆయా గృహ యజమానులకు నష్టపరిహారం కింద వాళ్లు అడిగినంత చెల్లించాల్సి ఉంటుంది. వాళ్లంతా పలుకుబడి ఉన్న భాగ్యవంతులు. తమ తమ ఇళ్లకు వాళ్లు చెప్పినంత మూల్యం ఇవ్వకపోతే గొడవ చేస్తారు. కావాలనే వాళ్లు ఎక్కువ మొత్తం అడుగుతారు. వాళ్లు అడిగినంతా ఇద్దాం అంటే చాలా మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. అంత సొమ్ము మనం ఎక్కడ నుంచి తేగలం? అలాగని వాళ్ల దగ్గర నుంచి స్థలాలు బలవంతంగా తీసుకుంటే, మీకు ప్రజల్లో చెడ్డపేరు వస్తుంది’ అన్నారు మంత్రి.
అంతా విన్నాక.. ‘ఓహో! అలాగా... పైగా ఇప్పుడు గతంతో పోల్చుకుంటే, ఇళ్ల విలువలు కూడా పెరిగాయి కదా మంత్రివర్యా?’ అన్నాడు రాజు.  ‘అవును ప్రభూ!’ అన్నాడు మంత్రి. ‘మన ఖజానాలో నిల్వ చాలా తక్కువగా ఉన్నట్లుంది. ఇప్పుడు ఇళ్ల విలువలు చాలా పెరిగాయి. అంటే విలువను బట్టి సుంకం ఉంటుంది. సుంకాన్ని హెచ్చించి ఆదాయాన్ని వృద్ధి చేసుకోవటం చాలా అవసరం కదా?’ అన్నాడు రాజు.
‘చిత్తం, అవసరమే’ అన్నాడు మంత్రి. ‘రాజవీధిలోని ఇళ్లతో  ప్రారంభించండి. ఇళ్ల యజమానులందరికీ పత్రాలను ఇచ్చి వాటిలో తమ తమ గృహాల విలువలను వారినే రాయమనండి’ అన్నాడు రాజు.
‘ప్రభూ, గృహ యజమానులనే ధరలు వెయ్యమంటే పన్ను తగ్గుతుందని విలువ తగ్గించి వేస్తారేమో. వాళ్లు ఇచ్చిన విలువల ప్రకారం పన్నులు వేస్తే ఇప్పుడు వచ్చినంత సుంకం కూడా రాకపోవచ్చు’ అని చెప్పబోయాడు మంత్రి. రాజు, మంత్రి మాటకు స్పందించకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు.  
మంత్రి రాజాజ్ఞను అమలు పరిచాడు. భవంతుల ధరలు ఎక్కువ రాస్తే సుంకం ఎక్కువ కట్టాల్సి వస్తుంది అనే దురుద్దేశంతో వీధిలో అందరూ అసలు ధరల కంటే చాలా తక్కువ విలువలు రాశారు. ‘ప్రభూ, ఇళ్ల యజమానులు ధరలు ఎంత తగ్గించి వేసుకున్నారో చూడండి’ అంటూ రాజు చేతికి ఆ పత్రాలు ఇచ్చాడు మంత్రి.
‘ప్రభూ! మన ఉద్యోగులను పంపి సరైన విలువలు కట్టించమని చెప్పమంటారా?’ అని మళ్లీ అడిగాడు మంత్రి. ‘వద్దు మంత్రివర్యా! పత్రాల్లో వాళ్లు రాసిన విలువలు అలాగే ఉండనివ్వండి. వాళ్ల పన్ను సంగతి తర్వాత చూద్దాం. తక్కిన వీధుల్లోని ఇళ్లకు మాత్రం మన ఉద్యోగులతో విలువలు కట్టించి ఆ ప్రకారం వచ్చిన పన్నును ఖజానాకు జమ చేయించండి’ అన్నాడు రాజు.
మంత్రి ఏదో అభ్యంతరం చెప్పబోయాడు కానీ, ప్రభువు అందుకు అవకాశం ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత.. ‘రాజవీధిని వెడల్పు చేయాల్సి ఉంది, కావున అక్కడ ఇరువైపులా ఉన్న ఇళ్లను రాజ్యావసరాల కోసం రాజు కొనాలనుకుంటున్నారు. ఇక్కడ  ఇళ్లుగలవారికి ఇటీవల వారు పత్రాల్లో చూపించిన విలువ చెల్లిస్తాం’ అనే ఉత్తర్వు జారీ చేశాడు రాజు.
ఆ ధనవంతులంతా నిర్ఘాంతపోయారు. తేలు కుట్టిన దొంగల్లా ఎవరూ నోరెత్తడానికి వీలులేకపోయింది. పన్నులు తక్కువ వేయించుకోవాలన్న దుర్బుద్ధితో వాళ్లు పత్రాల్లో తమ ఇళ్ల విలువ తక్కువ చూపించారు. కానీ రాజు మాత్రం న్యాయబద్ధంగా లెక్క కట్టించి ఆ మేరకు నష్టపరిహారం చెల్లించారు. దీంతో రాజుకు చెడ్డపేరు రాలేదు. ఇళ్ల యజమానులు కూడా తమకు న్యాయంగానే సొమ్ము వచ్చిందని ఆనందపడ్డారు. రాజవీధి కూడా వెడల్పైంది. రాజు తనకున్న లౌక్యం, తెలివితేటలతో తేలిగ్గా సమస్యను పరిష్కరించాడు.
కేవీ సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని