చిట్టి చిలుకమ్మా.. కోపం వద్దమ్మా!

అప్పుడే నిద్ర లేచింది చిట్టి అనే చిలుక. తానున్న జామ చెట్టు మీద నుంచి అమాంతం కిందకు చూసింది. ఒక పండు కింద పడి ఉండడం గమనించింది. ‘

Updated : 25 Mar 2023 03:31 IST

అప్పుడే నిద్ర లేచింది చిట్టి అనే చిలుక. తానున్న జామ చెట్టు మీద నుంచి అమాంతం కిందకు చూసింది. ఒక పండు కింద పడి ఉండడం గమనించింది. ‘ఈ జామ పండు ఇప్పటి వరకూ చెట్టు మీదే ఉంది కదా.. నిద్ర లేచాక తిందామని అనుకున్నా. ఇంతలోనే పడిపోయిందే?’ అనుకుంటూ మనసులోనే బాధపడింది చిట్టి. రివ్వున ఎగురుకుంటూ కిందకు వెళ్లి.. ‘పండూ.. ఎందుకు పడిపోయావు?’ అంటూ చిరుకోపంతో అడిగింది. ‘పండిపోయాను.. పడిపోయాను’ అంటూ జవాబిచ్చింది జామ పండు. ‘ఇప్పుడు నా ఆకలి తీరేదెలా?’ అని బాధగా అడిగింది. ‘నన్ను తింటే నీ ఆకలి తీరుతుంది కదా..’ అని అమాయకంగా అంది జామ పండు.
‘కింద పడిన పండు తినడం నాకు నచ్చదు. చెట్టు మీద ఉన్నప్పుడే ఇష్టంగా కొరుక్కొని తింటాను. నా బుజ్జి పొట్ట ఆకలి తీర్చుకుంటాను. నువ్వు తొందరపాటుతో చెప్పకుండా రాలిపోవడం నాకు అస్సలు నచ్చలేదు.. ఎందుకు పడిపోయావు?’ అంటూ మళ్లీ దిగాలుగా అడిగింది చిట్టి. ‘నన్ను కాదు. నన్ను వెళ్లిపోమన్న కొమ్మనే అడుగు!’ బదులిచ్చింది జామ పండు. ‘ఇప్పుడే అడుగుతా.. ఉండు..’ అంటూ తుర్రుమని ఎగిరి కొమ్మ మీద వాలింది. ‘కొమ్మా.. కొమ్మా.. పండును ఎందుకు కింద పడేశావు?’ అని దాన్ని గట్టిగా అడిగింది చిట్టి. ‘నన్ను కాదు.. కింద కొంచెం కొంచెంగా కనిపిస్తున్న వేరును అడుగు. అదే మా అందరికీ తల్లి. మేం బతకడానికి వేరే ఆధారం. వెళ్లి దాన్నే అడుగు.. నీకు జవాబు దొరుకుతుంది’ అంటూ కొమ్మ చెప్పిన మాటతో ‘నిజమే.. వేరునే అడుగుతాను’ అనుకుంటూ జామ చెట్టు కిందకు చేరింది చిట్టి.

కొంచెంగా పైకి కనిపిస్తున్న తల్లి వేరుతో.. ‘చాలా కాలం నుంచి నేను ఈ చెట్టు మీదే ఉంటున్నాను. ఇది నా చుట్టం అనుకున్నాను. మీ పచ్చని ఆకులతో నా పచ్చని శరీర రంగు బాగా కలిసి పోయిందని.. మనం మంచి మిత్రులమని ఎంతో సంతోషించేదాన్ని. కానీ, ఇప్పుడు నా ఆకలి తీరకుండానే జామ పండును ఎందుకు కింద పడిపోమన్నావు?’ అంటూ దీనంగా అడిగింది చిట్టి. ‘ఆకలి వేసినప్పుడే పండును ఎందుకు తినలేదు?’ అని చిట్టిని ప్రశ్నించింది తల్లి వేరు. ‘నిద్ర రావడంతో బద్ధకించాను. లేచిన తర్వాత తిందామనుకొని వాయిదా వేశాను’ చెప్పింది చిట్టి. ‘వాయిదా వేయడం నీ తప్పు. దాని సమయం వస్తే పండు కింద పడుతుంది. అది చెట్టు సహజ లక్షణం. అందులో మా తప్పు లేదు’ అని నవ్వింది వేరు.

‘నా ఆకలి నీకు నవ్వులాటగా ఉందా? కిందపడిన పండును తిననని నీకు తెలుసుగా.. స్నేహితుడి ఆకలి గురించి కాస్త కూడా ఆలోచించలేవా?’ కొంచెం కోపంగా అడిగింది చిట్టి. ‘మీకు సమయానికి ఆకలి వేయడం, నిద్ర రావడం ఎలాగో.. మాకు కాయలు కాయడం, పండ్లు పండటం, అవి రాలి పడిపోవడమూ అలాగే.. అందుకే, బద్ధకం పనికిరాదంటారు. దేనికైనా సమయ పాలన అవసరం. నీకు ఆకలి వేసినప్పుడు, బద్ధకంతో నిద్రపోయావు. ఆకలి తీర్చుకునే పనిని వాయిదా వేశావు. ఇప్పుడు ఫలితం గురించి ఆలోచించి ప్రయోజనం లేదు చిట్టీ’ అంటూ గట్టిగా జవాబిచ్చింది చెట్టు వేరు.

ఆ మాటలతో చిట్టి ఆలోచనలో పడింది. ‘నిజమే.. ఆకలి వేసినప్పుడే తినాలి. వాయిదా వేస్తే ఇలాగే అవుతుంది. ఇంకెప్పుడూ ఇలా చేయను’ అని చెట్టుతో అంది చిట్టి. అప్పుడు వేరు చిన్నగా నవ్వుతూ.. ‘చిట్టీ.. ఇప్పటి వరకూ నువ్వు అడిగింది చెప్పాను. ఇప్పుడు అసలు విషయం చెబుతాను. నువ్వు తినాలనుకున్న పండు ఇంకా చెట్టు మీదే ఉంది.. ఒక్కసారి పైకి చూడు’ అనగానే.. వెంటనే పైకి చూసిందది. ‘నిజమే.. నిద్ర మత్తులో అసలు ఏం జరుగుతుందో ఆలోచించలేదు. కొమ్మకున్న పండును కాకుండా కిందకు చూశాను. అక్కడో పండు కనిపించడంతో అది నేను తిందామనుకున్నదే అనుకున్నా.. మరి నేల మీదకు మరో జామ పండు ఎలా వచ్చింది?’ అంటూ ఆశ్చర్యంగా అడిగింది.

అదిగో....’ అంది చిట్టి. ‘సరే.. ఇప్పుడు వాయిదా వేస్తూ మాటలతో సమయాన్ని వృథా చేయకు. ఇంకా ఆలస్యమైతే ఆ జామ పండు కూడా కింద పడిపోయే ప్రమాదం ఉంది’ అని చెట్టు వేరు గుర్తు చేసింది. ‘ధన్యవాదాలు మిత్రమా.. సమయానికి గుర్తు చేశావు’ అంటూ తిరిగి చెట్టు కొమ్మ పైన వాలింది. ఎంచక్కా జామ పండును తినడం మొదలు పెట్టింది చిట్టి.

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు