వినినంతనె వేగపడక..

దండకారణ్యం అడవికి శౌర్యకేసరి అనే సింహం రాజుగా ఉండేది. తనకు మంత్రులుగా శాకాహార జీవుల నుంచి ‘శ్వేత సుందరి’ అనే కుందేలును, మాంసాహార జీవుల నుంచి ‘వినయవర్ధిని’ అనే నక్కని నియమించుకుంది.

Updated : 14 Jan 2023 06:08 IST

దండకారణ్యం అడవికి శౌర్యకేసరి అనే సింహం రాజుగా ఉండేది. తనకు మంత్రులుగా శాకాహార జీవుల నుంచి ‘శ్వేత సుందరి’ అనే కుందేలును, మాంసాహార జీవుల నుంచి ‘వినయవర్ధిని’ అనే నక్కని నియమించుకుంది. వాటి సలహాలు, సూచనలతో అడవిని చక్కగా పాలించేది. పేరుకు తగ్గట్టుగా తెల్లగా ఉండి, చెవులు లేత గులాబీ రంగుతో ఎంతో అందంగా ఉండేది శ్వేత సుందరి. అలాగే సహజసిద్ధమైన తమ జాతి జిత్తులమారి ప్రవృత్తికి భిన్నంగా వినయవర్ధిని ఎంతో వినయంగా ఉండేది. అదే అడవిలో ఉన్న తోడేలు.. శౌర్యకేసరి, శ్వేత సుందరి, వినయవర్ధినిల మధ్య ఉన్న సఖ్యత, స్నేహాన్ని చూసి అసూయ పడింది. ఏదో ఒకటి చేసి వాటి మధ్య విభేదాలు సృష్టించి.. సింహానికి దగ్గర కావాలని అనుకుంది.

ఒకరోజు శ్వేత సుందరి, వివేకవర్ధిని బయటకు వెళ్లాయి. దారిలో శ్వేత సుందరి ఒక చెట్టు కాయలు తెంపి, వాటి తొక్కను ఒలిచి తినసాగింది. ఇంతలో ఆ తోడేలు అక్కడికి వచ్చింది. శ్వేత సుందరి తింటున్న దాన్ని వినయవర్ధిని చూసి.. ‘అదేంటి.. ఈ కాయలు తెల్లగా, గులాబీ రంగులో భలే ఉన్నాయి’ అని అడిగింది. దానికి కుందేలు.. ‘వీటిని సీమచింతకాయలు అంటారు.. లోపల తెల్లగా గులాబీ రంగులో ఉన్న వీటి రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత బాగుంటాయి’ అంది. ఇందాకే మన మృగరాజు తినగా మిగిలిన ఆహారాన్ని తిని వచ్చాను. అంతగా బాగుంటాయి అంటున్నావు కాబట్టి.. మరోసారి తప్పకుండా రుచి చూస్తాను’ అని జవాబిచ్చిందది. ‘ఓ.. దానికేం భాగ్యం.. నీకు ఎప్పుడు తినాలని అనిపిస్తే అప్పుడు చెప్పు.. నేను నిన్ను ఈ చెట్టు దగ్గరకు తీసుకొస్తా’ అంది కుందేలు. ఈ మాటలన్నింటినీ చాటుగా విన్న తోడేలు.. సరైన సమయం కోసం ఎదురు చూడసాగింది.
ఒకసారి కుందేలు, నక్క బయటకు వెళ్లటం చూసి, తన పథకం అమలుకు అదే సరైన సమయం అనుకుంది తోడేలు. వెంటనే సింహం గుహ వద్దకు వెళ్లి.. ‘మృగరాజా.. మీరు నమ్మకపోవచ్చు కానీ, మీ మంత్రి వినయవర్ధిని మీరనుకున్నంత వినయం ఉన్నదేమీ కాదు. అది పెద్ద జిత్తులమారి. తెల్లగా, గులాబీ రంగుతో ఉన్న మంత్రి శ్వేత సుందరిని తినేయాలని చూస్తుంది. కావాలంటే.. మీరు గుహలో ఓ పక్కకు ఉండి దాని మాటలను వినండి’ అంది. అప్పుడే బయట నుంచి గుహ లోపలికి వస్తున్న నక్కను తోడేలు ఆపి.. ‘మిత్రమా! ఎప్పటి నుంచో నువ్వు ఎంతగానో ఇష్టపడే తెల్లగా, గులాబీ రంగుతో ఉన్నదాన్ని తిందువు గానీ, అక్కడే ఉంది మీ శ్వేతసుందరి, ఇంకెందుకు ఆలస్యం.. బయలుదేరు’ అంది. తోడేలు చెప్పేది సీమచింతకాయల గురించి అనుకున్న నక్క.. ‘ఎప్పుడూ మా మృగరాజు మిగిల్చిన మాంసాన్నే తినేదాన్ని. ఇప్పుడు నువ్వు చెబుతుంటే నోరూరిపోతుంది.. ముందు ఆ తెల్ల, గులాబీ రంగులో ఉన్న దాని సంగతి చూస్తా’ అనుకుంటూ నాలుక చప్పరించింది. కానీ లోపలి నుంచి ఈ మాటలన్నింటినీ వింటున్న మృగరాజు.. తెల్ల, గులాబీ రంగులో ఉన్న దాన్ని అంటే కుందేలునని అనుకుంది. వెంటనే.. ఎక్కడలేని కోపంతో ఊగిపోతూ బయటకు వచ్చింది సింహం.

‘ఎంత ద్రోహానికి తలపెట్టావు.. నిన్ను క్షమించేది లేదు’ అంటూ మంత్రి వినయవర్ధినిపైకి దూకడానికి సిద్ధమైంది. తన పంజా విసరబోయేసరికి.. అంతకుముందే తోడేలు గుహ లోపలికి వెళ్లటం చూసి, ఏదో ప్రమాదం జరగబోతుందని  ఊహించిన శ్వేత సుందరి వాటి ముందుకు వచ్చింది. అప్పటివరకూ చాటుగా అంతా విన్న అది.. తన తోటి మంత్రి వినయవర్ధినికి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టింది. వెంటనే సింహం, వినయవర్ధిని మధ్యన నిలబడి.. తోడేలు పన్నిన పన్నాగాన్ని వివరించింది. దాంతో పట్టరాని కోపంతో తోడేలుకు తన పంజా దెబ్బ రుచి చూపించబోయింది సింహం. అది త్రుటిలో తప్పించుకొని.. ‘మృగరాజా! ఇంకెప్పుడూ ఇటువంటి దుష్ట ఆలోచనలు చేయను. దయచేసి క్షమించండి’ అని వేడుకుంది. మరొకసారి ఇటువంటి చెడు ఆలోచనలతో ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితులలో క్షమించేది లేదని హెచ్చరించి పంపించేసింది. ఎదుటివారు చెప్పే మాటలు వినినంతనె వేగపడక.. వాటి వెనకున్న అంతరార్థం గ్రహించి ప్రవర్తించాలనీ, లేకపోతే జరిగే నష్టం ఎప్పటికీ పూడ్చలేమని తెలియజేసిన శ్వేతసుందరిని మెచ్చుకుంది. తొందరపడి శిక్షించబోయిన వినయవర్ధినిని క్షమాపణలు కోరింది మృగరాజు శౌర్యకేసరి.

కొమ్ముల వెంకట సూర్యనారాయణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు