చిట్టి కొంచెం.. తెలివి ఘనం!

ఆ రోజు అమ్మకంటే ముందుగా నిద్ర లేచింది ‘చిట్టి’ అనే కుందేలు. ‘ఈరోజు అమ్మ తోడు లేకుండా ఒంటరిగానే అడవిని చుట్టి రావాలి’ అనుకుంది. నిన్న తన స్నేహితులైన ఉడుత పిల్ల, జింక పిల్ల కలిసి తనతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి.

Published : 15 Feb 2023 00:01 IST

ఆ రోజు అమ్మకంటే ముందుగా నిద్ర లేచింది ‘చిట్టి’ అనే కుందేలు. ‘ఈరోజు అమ్మ తోడు లేకుండా ఒంటరిగానే అడవిని చుట్టి రావాలి’ అనుకుంది. నిన్న తన స్నేహితులైన ఉడుత పిల్ల, జింక పిల్ల కలిసి తనతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ‘చిట్టీ! అమ్మ తోడు లేకుండా నువ్వు ఎక్కడికీ వెళ్లలేవు కదూ! ఒట్టి అమ్మకూచివి..’ అన్నవాటి మాటలు చిట్టిని ఎంతో బాధపెట్టాయి. తాను అమ్మకూచిని కాదని నిరూపించుకోవాలనుకుంది. అందుకు ఇదే సరైన సమయం అనుకుంది. చడీచప్పుడు కాకుండా మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ ముందుకుసాగింది. రోజూ అయితే అమ్మతో కలిసి నడుస్తూ వెళ్లేది. ఇప్పుడు ఒంటరిగా వెళ్లడం కొత్తగా, వింతగా అనిపిస్తోంది. హుషారుగా చిందులేస్తూ కదిలింది. అలా నడుస్తూ నడుస్తూ తనకు తెలియకుండానే మృగరాజు ఉండే చోటుకు వచ్చేసింది.

తన కంటే బాగా పెద్దగా, గంభీరంగా ఉన్న మృగరాజును చూడగానే వెన్నులో వణుకు మొదలైంది. వచ్చిన దారిలోనే వెళ్లిపోదామని వెనుతిరగబోయింది. అంతలోనే.. ‘ఆగు! వచ్చినట్టే వచ్చి, వెళ్లిపోతావే? నీ పేరేమిటి? ఇక్కడకు ఎందుకొచ్చావు?’ అని మృగరాజు గట్టిగా అడిగింది.

తప్పదనుకుంటూ చిట్టి మృగరాజు వైపు తిరిగింది. వణుకుతున్న గొంతుతోనే.. ‘నా పేరు చిట్టి. దారి తప్పి.. ఇదిగో ఇలా వచ్చాను. మీరు అనుమతి ఇస్తే.. నేనుండే చోటుకు వెళ్లిపోతాను మృగరాజా!’ అని దీనంగా అంది. ‘నాకు ఆకలిగా ఉంది. నీకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వను... ఇవ్వలేను. వేటాడకుండానే నోటికి చిక్కిన ఆహారాన్ని ఎలా వదులుకోను? ఇప్పుడు నువ్వు నాకు ఆహారం కాక తప్పదు!’ అంటూ మృగరాజు చిట్టి దగ్గరకు రాసాగింది.

‘భయం, చావును దగ్గర చేస్తుంది.. ధైర్యం, దూరం చేస్తుంది.. ఆలోచనలను రేకెత్తిస్తుంది’ అనుకుంటూ చిట్టి ధైర్యాన్ని కూడదీసుకుంది. ‘ఒక్కసారి ఆగండి. మృగరాజా!’ అని చిట్టి గట్టిగా అనడంతో... ‘ఎందుకన్నట్టుగా?’ చూసింది మృగరాజు. ‘ఇప్పుడు నేను ఏడ్చినా మీకు ఆహారం కాక తప్పదు. కానీ నన్ను తినే ముందు మా అమ్మ మీ గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అవి తెలుసుకోవచ్చా?’ అని అడిగింది వినయంగా.

‘ఏమిటా.. మాటలు?’ అని మృగరాజు అడిగింది. ‘హమ్మయ్య! మృగరాజు నన్ను తినకుండా ఆగింది’ అని మనసులో అనుకుంటూ ఇలా చెప్పింది. ‘‘మృగరాజా! అమ్మ నాకు పనులు ఎలా చేయాలో చెబుతుంది. పెద్దలు, తోటి స్నేహితులతో ఎలా ప్రవర్తించాలో చెబుతుంది. చదువు కూడా నేర్పుతుంది. ఒకసారి నేను చాలా నేర్చుకున్నానని, నేనే గొప్పదాన్నని గర్వంగా అన్నాను. అప్పుడు అమ్మ నాతో... ‘చిట్టీ! గర్వం పతనానికి తొలిమెట్టు. వినయం, విజయానికి సోపానం. కనుక గర్వించకు. మన మృగరాజు కూడా పండితులే. ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. కానీ ఏనాడూ గర్వించలేదు. అర్థమైందా?’ అంటూ నాకు బుద్ధి చెప్పింది. ఆనాటి నుంచి మిమ్మల్ని, మీ పాండిత్యాన్ని చూడాలనుకున్నాను. మంచికో, చెడ్డకో, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. ఒక్కసారి మీ పాండిత్యం చూసి, మీకు ఆహారం కావాలని ఉంది. కాదనకండి! మృగరాజా!’’ అని చిట్టి దీనంగా వేడుకుంది.

‘సరే! నా పాండిత్యం ప్రదర్శిస్తాను.. అంకెలు అనంతం. ఎంత ఎగిరినా ఆకాశాన్ని అందుకోలేం. ఎంత ప్రయత్నించినా, భూమిని కొలవలేం. పాలు తెల్లగా ఉంటాయి. బొగ్గు నల్లగా ఉంటుంది. చాలా... ఇంకా చెప్పాలా?’ అంది మృగరాజు.

‘అమ్మ అన్నది నిజమని నిరూపితమైంది. మీ పాండిత్యం చాలా గొప్పదని ఒప్పుకొంటున్నాను. కానీ ఒక్క చిన్న ప్రశ్న అడుగుతాను. దీనికి సమాధానం చమత్కారంగా చెప్పాలి. గతంలో నన్ను అమ్మ అడిగిన ప్రశ్ననే, ఇప్పుడు మిమ్మల్నీ అడుగుతున్నాను. నేనప్పుడు సమాధానం చెప్పేశాను. మీరూ చెప్పగలరు. అడగనా.. మృగరాజా?’ అంటూ ఆగింది. ‘చమత్కారం అంటే నాకు చాలా ఇష్టం. ఇట్టే జవాబు చెప్పేస్తా. అడుగు!’ అంది మృగరాజు. ‘చెప్పకపోతే నన్ను విడిచి పెట్టాలి మృగరాజా!.. సరేనా?’ అంది చిట్టి.

‘చెప్పక పోవడం ఉండదు. జవాబు చెబుతా. నిన్నుతింటా. ముందు ప్రశ్న అడుగు!’ అంది మృగరాజు. ‘సున్నా పక్కన సున్నా పెడితే ఏమవుతుంది?’ అని చిట్టి అడిగింది. ‘ఇదేం పిచ్చి ప్రశ్న. సున్నా పక్కన సున్నా పెడితే రెండు సున్నాలు అవుతాయి. అంతేగా?!’ మృగరాజు చిట్టి వైపు విచిత్రంగా చూస్తూ అంది.
‘కాదు.. మృగరాజా! సమాధానం ఉంది. ముందే చెప్పానుగా. ఇది చమత్కారంగా ఉంటుందని. ఆలోచించండి!’ అని చిట్టి మృగరాజు వైపు చూస్తూ, నవ్వుతూ అంది. సింహం కొంతసేపు ఆలోచించింది. ‘ఊహూ! తట్టడం లేదు. జవాబు చెప్పు, చిట్టీ’ అంది.

‘మరి నన్ను తినకూడదు!’ అని చిట్టి మరోసారి గుర్తు చేసింది. ‘సరే! జవాబు చెప్పు!’ అని మృగరాజు అంది. ‘సున్నా పక్కన సున్నా పెడితే సున్నానే అవుతుంది మృగరాజా!’ అని నవ్వుతూ జవాబిచ్చింది కుందేలు. ‘భలే చమత్కారంగా చెప్పావు.

చిట్టీ! నీ మాటలు నాలో ఆకలిని తగ్గించాయి. నీతో ఆడిన కబుర్లు నాకు ఆనందాన్ని ఇచ్చాయి. చిట్టి కొంచెం.. తెలివి ఘనం. నిన్ను తినను.. వెళ్లిపో!’ అంది మృగరాజు చిట్టిని మెచ్చుకోలుగా చూస్తూ. ‘ధన్యవాదాలు! మృగరాజా!’ అని చెప్పి చిట్టి వెనుతిరిగింది. ‘అమ్మతోడు లేకపోయినా, అమ్మ పంచిన జ్ఞానం ఇప్పుడు నన్ను కాపాడింది. అమ్మా!

ఇంకెప్పుడూ నిన్ను విడిచి వెళ్లను. నువ్వు నేర్పిన విషయాలు మరచిపోను...’ మనసులోనే అమ్మకు కృతజ్ఞతలు చెప్పుకొంటూ, ఆనందంగా ఇంటి బాట పట్టింది చిట్టి.

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని