భలే భలే బన్నీ!

ఒక అడవిలో బన్నీ అనే కుందేలు చాలా ముద్దుగా ఉండేది. ఎప్పుడూ చలాకీగా గెంతులు వేసేది. అందరినీ పలకరిస్తూ, నవ్వుతూ, తుళ్లుతూ.. అందరికీ తలలో నాలుకలా ఉండేది. ముద్దుగా ఉండే దాని మాటలకు మురిసిపోతూ అందరూ చేరదీసేవారు.

Published : 23 Mar 2023 00:08 IST

క అడవిలో బన్నీ అనే కుందేలు చాలా ముద్దుగా ఉండేది. ఎప్పుడూ చలాకీగా గెంతులు వేసేది. అందరినీ పలకరిస్తూ, నవ్వుతూ, తుళ్లుతూ.. అందరికీ తలలో నాలుకలా ఉండేది. ముద్దుగా ఉండే దాని మాటలకు మురిసిపోతూ అందరూ చేరదీసేవారు. ఎవరికీ ఎటువంటి హాని చేయని బన్నీ అంటే అందరూ ఇష్టపడేవారు.

అదే అడవిలో కుటిలం అనే నక్క ఉండేది. ఎప్పుడూ కుతంత్రాలు పన్నుతూ అందరినీ మోసం చేసే నక్కంటే ఎవరికీ నచ్చేది కాదు. కుటిలానికి బన్నీని చూస్తే చాలా కోపం, అసూయ ఉండేది.

ఒకరోజు బన్నీ అడవిలో తిరుగుతూ.. ఒక చెట్టు కొమ్మల మీద నుంచి కిందకు తేనె చుక్కలు చుక్కలుగా కారడం చూసింది. వెంటనే పక్కనున్న చెట్టు పత్రాల్లో పెద్దదాన్ని తెంపి, దొన్నెలాగా చేసి తేనె చుక్కలు పడే చోటులో పట్టుకుంది. చక్కగా దొన్నె నిండా తేనె నిండింది. కమ్మటి తేనె వాసన వస్తుంటే.. గబగబా తేనె మొత్తం తాగేసింది. తన బుజ్జి పొట్ట నిండగానే బన్నీకి నిద్ర కమ్ముకు వచ్చింది. అక్కడే చెట్టు కింద హాయిగా నిద్రపోయింది.

అటుగా వెళ్తున్న కుటిలం నిద్రపోతున్న బన్నీని చూసింది. ‘అందంగా ఉన్న బన్నీ మాంసం ఎంత రుచిగా ఉంటుందో’ అనుకోగానే దాని నోట్లో నీళ్లు ఊరిపోయాయి. వెంటనే ఇంటికి పరుగెత్తుకెళ్లి ఒక సంచి, తాడు తీసుకొని వచ్చింది. నిద్రపోతున్న బన్నీని సంచిలో పడేసి మూతికి తాడు కట్టేసి, ఆ మూటను ఇంటికి తీసుకెళ్లింది.

‘ప్రాణాలతో ఉన్న మంచి కుందేలును తెచ్చాను. మసాలా దట్టంగా వేసి రుచికరంగా కూర వండు’ అని తన భార్య నక్కతో అంది కుటిలం. ‘సరే వండుతాను.. కానీ క్యారెట్లు తీసుకురా మావా...! కుందేలు మాంసంలో క్యారెట్టు కలిపి వండితే రుచిగా ఉంటుందని మా అమ్మ చెప్పింది’ అంది భార్య నక్క.

‘అదెంత భాగ్యం! చిటికెలో తెస్తాను’ అని కుటిలం అక్కడ నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. అంతకు ముందే మెలకువ వచ్చిన బన్నీ ఈ మాటలన్నీ వింది. సంచిలో నుంచి ఎలా తప్పించుకోవాలా..! అని తీవ్రంగా ఆలోచిస్తోంది. భార్య నక్కకు సంచిలో ఉన్న అందమైన కుందేలును చూడాలనిపించింది. సంచికున్న తాడు విప్పి, మెల్లిగా చూసింది. ఈ అలికిడి పసిగట్టిన బన్నీ చనిపోయినట్లు నటించింది. కదలకుండా పడుకున్న బన్నీని చూసి.. ‘నా భర్తేమో బతికున్న కుందేలును తెచ్చా అన్నాడు. కానీ ఇదేమో కదలడం లేదు. బహుశా ఊపిరాడక చచ్చిపోయిందేమో!’ అనుకొని మూటకు తాడు కట్టకుండానే వదిలేసి వంటకు సామగ్రి సిద్ధం చేసే పనిలో పడింది భార్య నక్క.

మెల్లిగా.. బన్నీ కళ్లు తెరిచి చూసింది. నిశ్శబ్దంగా సంచిలో నుంచి బయటకు వచ్చి వేగంగా పారిపోయింది. కుటిలం క్యారెట్‌ తీసుకొని వచ్చి తెరచి ఉన్న మూట చూసి కంగారుపడింది.

ఈలోగా భార్య నక్క అక్కడకు వచ్చి.. ‘కుందేలు ప్రాణాలతో లేదు మావా! చచ్చిపోయింది’ అంది భర్తతో. ఖాళీ సంచిలోకి తొంగి చూసిన కుటిలం.. ‘అయ్యో! కుందేలు మనకు టోకరా ఇచ్చి పారిపోయింది. నువ్వు సంచి తెరిచి ఎంత పని చేశావే?’ అని బాధ పడింది. కుందేలు మాంసం తినలేకపోయినందుకు కాసేపు రెండు నక్కలూ బాధపడ్డాయి.

ఎలాగైనా సరే బన్నీని మళ్లీ పట్టుకోవాలని అవకాశం కోసం కుటిలం ఎదురు చూసింది. కొద్దిరోజుల తర్వాత బన్నీ చెరువు దగ్గర చేపలతో ఊసులు చెబుతూ కుటిలానికి కనిపించింది. పరాకుగా ఉన్న బన్నీ మీదకు ఒక్క ఉదుటున దూకి దొరకపుచ్చుకుంది. కుటిలం చేతికి మరోసారి చిక్కిన బన్నీ... ‘ఇక తన పనైపోయిందని’ భయపడింది. తప్పించుకోవడం కోసం మెదడుకు పని చెప్పింది. అప్పుడే అటుగా వెళ్తున్న నెమలిని చూడగానే ఒక ఉపాయం తట్టింది.

‘చూడు నక్క బావా! ఈ నెమలికి ఎంత గర్వం వచ్చిందో! దాని అందానికి కారణం నేననే విశ్వాసం కూడా లేకుండాపోయింది. నన్ను పలకరించకుండానే వెళ్తోంది’ అంది బాధగా. ‘అదేంటి బన్నీ? నెమలి అందానికి నువ్వు కారణం కావడమేంటి? ఇదేదో వింతలాగా అనిపిస్తోంది, కాస్త వివరంగా చెప్పు’ అంది కుటిలం.

‘నాకు ఒక గురువు, ఎవరినైనా సరే అందంగా మార్చే విద్య నేర్పించాడు. ఈ నెమలి ఒకప్పుడు కురూపిగా ఉండేది. నన్ను బతిమిలాడితే ఇలా అందంగా తయారు చేశాను’ అంది బన్నీ. ‘నాకు అందమంటే భలే ఇష్టం బన్నీ! నువ్వు కూడా అందంగా ఉన్నావనే నిన్ను తినాలనుకున్నాను. నన్ను కూడా అందంగా తయారు చేస్తావా? నిన్ను తినకుండా వదిలేస్తాను’ అని బతిమిలాడింది కుటిలం.

‘నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ చాలా దీనంగా అడుగుతున్నావు నక్కబావ! అందుకే నీ కోరిక తీర్చాలనుకుంటున్నాను’ అంది బన్నీ. ‘మా మంచి బన్నీ! నన్ను అందంగా మారిస్తే నీకు జీవితాంతం రుణపడుంటాను బన్నీ!’ అంది కుటిలం. కపట వినయాలు ఒలకబోస్తూ.

‘అందుకు కొన్ని ఎండు పుల్లలు, ఒక తాడు, రెండు చెకుముకి రాళ్లు కావాలి నక్క బావా!’ అంది బన్నీ. ‘అవన్నీ నేను తెస్తానుగా!’ అని ఆనందంగా పరుగెత్తింది కుటిలం. కాసేపటి తరువాత బన్నీ చెప్పిన వాటితో తిరిగి వచ్చిందది. ‘నేను ఏం చేసినా నువ్వు అభ్యంతర పెట్టకూడదు’ అంది బన్నీ.

‘నెమలి కన్నా అందంగా మారిపోతే చాలు బన్నీ!’ అంది నక్క అత్యాశతో. బన్నీ ముందు కుటిలాన్ని ఒక రావి చెట్టుకు తాడుతో కట్టేసింది. తరువాత ఎండు పుల్లలన్నీ ఒక చోట పేర్చి చెకుముకి రాళ్లతో నిప్పు రాజేసి అంటించింది. ‘మంట ఎందుకు బన్నీ?’ కంగారుగా అడిగింది కుటిలం. ‘మరి నీ ఒంటి మీద రంగు రంగుల చిత్రాలు చిత్రించాలంటే నువ్వు కాస్త ఓర్చుకోక తప్పదు నక్క బావా!’ అంది బన్నీ.

బన్నీ కాలిన పుల్ల ఒక చివర పట్టుకొని నక్క ఒళ్లంతా వాతలు పెట్టడం మొదలు పెట్టింది. మొదట్లో ‘కుయ్యో... మొర్రో...’ అని మూలుగుతూ, రాను రానూ... ‘వద్దు బన్నీ... నాకు అందమూ వద్దు... పాడూ వద్దు...’ అని అరుస్తోంది కుటిలం.

‘నీకు వాతలు పెడుతుంటేనే నొప్పిగా అనిపిస్తోంది కదా నక్కబావా! మరి నన్ను వండుకొని తినాలనుకున్నావు. నీకు ఇదే తగిన శాస్తి. ఇక ఎప్పుడూ నా జోలికి రావు’ అంది బన్నీ. ‘మరోసారి నీకు చెడు చేయాలని ఆలోచన కూడా చేయను బన్నీ! నన్ను క్షమించు’ అని ప్రాధేయపడింది కుటిలం.

‘దేవుడు ఒక్కొక్కరిని ఒక్కోలా సృష్టిస్తాడు. ఎవరి అందం వారిదే! అత్యాశతో సరిగ్గా ఆలోచించలేకపోయావు నక్క బావా! నాకు అపకారం చేయాలనుకున్నావు. తిరిగి నేను నీకు శిక్ష విధిస్తే బాధ ఎలా ఉంటుందో నీకు అర్థమైఉంటుంది. ఇకనైనా నువ్వు ఇతరులతో మంచిగా ఉంటే అందరూ నీతో బాగుంటారు’ అంది బన్నీ. తర్వాత అది చెట్టుకు కట్టిన తాడు ముడి విప్పదీయగానే.. ‘జ్ఞానోదయమైంది బన్నీ’ అని పశ్చాత్తాపంతో అంది కుటిలం.

కె.వి.సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని