ముల్లును ముల్లుతోనే తీయాలి!
ఒక చెరువు పక్కన చెట్టు మీద పిచ్చుక, పావురం స్నేహంగా ఉండేవి. అవి రెండూ ఇళ్లు కట్టుకొని భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్నాయి. పావురం, పిచ్చుక పక్కపక్కన పొలాల్లో వ్యవసాయం చేస్తున్నాయి. ఒకదాని సలహాలు మరొకటి తీసుకుంటూ చక్కగా పంటలు పండిస్తున్నాయి. ఇలా ఉండగా.. ఒక ఏడాది పావురం పంట దెబ్బతింది. పాపం.. అది చాలా బాధ పడింది.
‘జరిగిన నష్టానికి మనం ఏమీ చేయలేం పావురమా! కానీ నా పంట బాగానే పండింది కదా...! మన రెండు కుటుంబాలు బతకడానికి సరిపోతుంది’ అని ఓదార్చింది పిచ్చుక. పావురం అలాగే అని తల ఊపింది. కానీ మనసులో పిచ్చుకపై అసూయ పెంచుకుంది.
‘తన పంట ఎందుకు పోయింది. పిచ్చుక పంట ఎందుకు పండింది?’ అనే విషబీజం నాటుకుంది. ఇదేమీ తెలియని పిచ్చుక, పావురం కుటుంబాన్ని ఆదరించింది. మళ్లీ పంటలు వేసే కాలం వచ్చింది. ఈ సారి ఇద్దరి పంటలూ బాగా పండాయి. కోత కోసే సమయం వచ్చింది. ఈలోగా పిచ్చుక పంటంతా నీట మునిగిపోయింది. వర్షాలు, వరదలు లేకున్నా... చేనులో నీరు ఎలా నిలిచిందో పిచ్చుకకు అర్థం కాలేదు. పంటంతా పోయిందని కుళ్లికుళ్లి ఏడ్చింది. పావురం పిచ్చుకను ఓదార్చింది.
‘పంటంతా పోయింది. పొలానికి మళ్లీ గండి తీసి వచ్చాను. కొన్ని గింజలైనా చేతికి అందితే బాగుంటుంది. లేకపోతే పిల్లలకు తిండి ఎక్కడ నుంచి వస్తుంది?’ అని నిద్రపోకుండా కూర్చొని బాధపడింది భర్త పిచ్చుక. ‘నాకు అనుమానంగా ఉంది. ఇదేదో కుట్రలాగా అనిపిస్తోంది. అధిక వర్షాలు లేకుండా పంటంతా నీట మునిగి పోయిందంటే ఆలోచించాలి. నన్ను ఒకసారి పొలం దగ్గరకు తీసుకొని వెళ్లండి’ అంది భార్య పిచ్చుక.
‘ఇప్పుడా?’ అంది భర్త పిచ్చుక. ‘అవును, ఇప్పుడే!’ అంది భార్య పిచ్చుక. వాళ్లు వెళ్లేసరికి పొలం దగ్గర ఎవరో ఉన్నట్లు అలికిడి వినిపించింది. దగ్గరగా ఉన్న చెట్టు కొమ్మల మధ్య దాక్కొని చూశాయి. పొలంలో అదనపు నీరు వెళ్లిపోయేందుకు పిచ్చుక తీసిన గండిని పావురం పూడ్చేస్తోంది. పిచ్చుకలు, పావురం చేస్తున్న పనికి ఆశ్చర్యంగా గుడ్లప్పగించి చూశాయి. పావురం పొలం ఎత్తులో, పిచ్చుక పొలం కొంచెం దిగువలో ఉంటుంది. పావురం పొలంలో నీరు వదిలితే అదంతా పిచ్చుక పొలంలోకి వచ్చి నిండుతుంది. అందుకే పిచ్చుక పంటంతా పాడైపోయింది. జరిగిన కుట్రను గ్రహించిన పిచ్చుకల జంట.. ‘మోసాన్ని మోసంతోనే జయించాలి’ అనుకున్నాయి.
పావురం పొలానికి నీళ్లు రాకుండా కాలువను దారి మళ్లించాయి. తమ పొలంలోకి మాత్రం నీళ్లు వచ్చేలా చేశాయి. తన పొలానికి నీరు ఎందుకు రావడం లేదో.. పావురానికి మాత్రం అస్సలు అర్థం కాలేదు. బుర్ర బద్ధలు కొట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఈసారి పిచ్చుక పొలంలో పంట అద్భుతంగా పండింది. పావురం పొలంలో మాత్రం నీళ్లు లేక పంట అంతగా రాలేదు.
పావురం నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. నీరంతా పిచ్చుక పొలంలోకి మళ్లించి పిచ్చుక పంట నాశనం చేయాలి అనుకుంది కానీ, ఇప్పుడు తన పంట ఇలా ఎండుతుందనుకోలేదు.
మొదట తాను చేసిన మోసాన్ని పిచ్చుక గ్రహించి, అదే ఏదో చేసి ఉంటుంది అనుకుంది పావురం. కానీ ఏమీ అనలేక తేలు కుట్టిన దొంగలా, దిగులుగా ఒక మూలన కూర్చుంది.
‘బాధపడకు పావురమా! నువ్వు చేసిన తప్పు గ్రహిస్తే చాలు! మనం తినడానికి నా పంట సరిపోతుంది. స్నేహం అంటే అసూయ, ద్వేషాలు ఉండకూడదు. మనం ఇదివరకటి రోజుల్లో ఉన్నట్లే కలిసి ఉందాం’ అని ప్రేమగా ఓదారుస్తూ చెప్పింది పిచ్చుక.
కేవీ.సుమలత
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Tourism: ఈ దేశాల్లో పర్యటన.. భారతీయులకు చాలా సులువు
-
World News
School Shooting: పక్కా ప్రణాళిక రచించి.. మ్యాపుతో వచ్చి..: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
-
Movies News
Nani: ఆ రాంబాబేనా ఈ ‘ధరణి’?.. ఆసక్తికరం నాని జర్నీ!
-
Crime News
Vizag : ఆత్మహత్య చేసుకుంటామని బంధువులకు సెల్ఫీ వీడియో పంపిన దంపతులు..
-
India News
Rahul Gandhi: ‘చట్టాన్ని గౌరవించడమే.. ’: రాహుల్ ‘అనర్హత’పై అమెరికా స్పందన ఇదే..
-
Sports News
Virat -Babar: ఆ ఒక్క క్వాలిటీనే వ్యత్యాసం.. అందుకే బాబర్ కంటే విరాట్ అత్యుత్తమం: పాక్ మాజీ ఆటగాడు