ఉన్నంతలోనే ఉన్నత సాయం!

గిరిపురం చిన్నగ్రామం. పగలంతా వ్యవసాయ పనులతో ఆ ఊరి ప్రజలు తీరిక లేకుండా ఉంటారు. సాయంత్రం అయితే ఇల్లు చేరి స్నానాలు ముగిశాక ఊరి మధ్య ఉన్న రచ్చబండ దగ్గర చేరి కబుర్లతో కాసేపు కాలక్షేపం చేస్తుంటారు.

Updated : 27 Dec 2022 02:58 IST

గిరిపురం చిన్నగ్రామం. పగలంతా వ్యవసాయ పనులతో ఆ ఊరి ప్రజలు తీరిక లేకుండా ఉంటారు. సాయంత్రం అయితే ఇల్లు చేరి స్నానాలు ముగిశాక ఊరి మధ్య ఉన్న రచ్చబండ దగ్గర చేరి కబుర్లతో కాసేపు కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి సమయంలో అనేక విషయాలు చర్చకు వస్తుంటాయి.

ఒకరోజు ఆ ఊర్లో ఉన్న మోతుబరి రైతు వర్ధనుడి దాతృత్వం గురించి ప్రస్తావనకు వచ్చింది. అంతకుముందే ఊరిలో ఉన్న మంచినీళ్ల బావితోపాటు మరొకటి అవసరం అయితే వర్ధనుడు ముందుకొచ్చి ఆ ఖర్చు అంతా భరించి తవ్వించాడు. ఆ విషయం మాటల మధ్య చర్చకు వచ్చింది. ఆ సందర్భంగా ఆయన చేసిన దానాల గురించి అందరూ గొప్పగా చెప్పుకొన్నారు.

ఇదంతా రంగనాథం అనే రైతు విన్నాడు. ఆయనది వింత మనస్తత్వం. ఆయన మరీ లేనివాడేమీ కాదు. తన తాహతుకు తగ్గట్టుగా దానధర్మాలు చేయవచ్చు. కానీ చేయడు. తనకు దేవుడు అంత శక్తి ఇవ్వలేదని తప్పించుకుంటూ ఉంటాడు. పై పెచ్చు అతని ముందు దానధర్మాలు చేసేవారిని ఎవరైనా పొగిడితే సహించలేడు.
‘అందులో ఆయన గొప్ప ఏముంది? అతనికి అదంతా పూర్వీకుల ద్వారా వచ్చింది. మన పూర్వీకులు కూడా అలానే దయతలిచి ఉంటే, మనమూ దానధర్మాలు చేసి ఉండే వాళ్లం’ అని అంటూ ఉంటాడు. అది విన్న అక్కడున్నవారు పెద్దగా ఆశ్చర్యపోయేవారు కాదు. ఎందుకంటే వారికి రంగనాథం తత్వం, మాటతీరు బాగా తెలుసు.
రంగనాథం ఎంగిలి చేత్తో కాకిని తోలడు సరికదా! ఎవరినైనా పొగిడితే సహించనూ లేడు. అయితే ఆ ఊరికి ఇటీవలే కొత్తగా, భూమికొని అక్కడే నివాసం ఏర్పరుచుకున్న సుదర్శనుడికి రంగనాథం మనస్తత్వం నచ్చలేదు. ఆయనకు ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచనలో పడ్డాడు.

ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు రంగనాథం గూడు బండి కట్టించుకుని పొరుగూరు వెళ్లి పని ముగించుకుని సాయంత్రానికి తిరుగుముఖం పట్టాడు. ఊరు దగ్గరకొచ్చేసరికి బాగా చీకటి పడింది. ఆ చీకటిలో బండి తోలేవాడికి దారి సరిగా కనపడక బండి చక్రం బురదగుంతలో దిగబడిపోయింది. ఎంత ప్రయత్నించినా.. చక్రాన్ని బండివాడు బయటకు లాగలేకపోయాడు. రంగనాథం కూడా బండి దిగి సహాయపడ్డాడు. కానీ వీలు కాలేదు. ఏం చేయాలో పాలుపోక వారున్న స్థితిలో పొలాల నుంచి గ్రామం వైపు పోతున్న సుదర్శనుడు కనిపించాడు.

బండి తోలేవాడు... ‘బాబ్బాబూ!, మీరూ ఒక చేయి వేశారంటే.. బండి చక్రం గుంత నుంచి బయటకు వస్తుంది! కాస్త సహాయం చేయండి’ అని వినయంగా వేడుకున్నాడు. ‘నేనా..! నేను బలహీనుణ్ని. బండి చక్రాన్ని బయటకు లాగలేను. దేవుడంత శక్తి నాకివ్వలేదు’ అన్నాడు.

‘అలా అనకు! నీ శక్తికొద్దీ సహాయపడు చాలు. చక్రం బయటకు వస్తే వస్తుంది. లేకపోతే లేదు’ అన్నాడు రంగనాథం. బండి తోలేవాడు, సుదర్శనుడు, చక్రాన్ని బలంకొద్దీ ముందుకు నెట్టారు. బండి చక్రం గుంత నుంచి బయటపడింది. రంగనాథం క్షేమంగా ఊరు చేరాడు. మరుసటిరోజు రంగనాథం రచ్చబండ వద్ద అందరితో సుదర్శనుడు చేసిన సహాయం గురించి చెప్పాడు. ‘ముందు సుదర్శనుడు తనకంత శక్తి లేదన్నాడు.. కానీ తరవాత తన శక్తి మేర ప్రయత్నించి సహాయపడ్డాడు’ అన్నాడు.

సుదర్శనుడు కాసేపు మౌనంగా ఉండి... ‘రంగనాథం గారూ! ఎవరైనా ఏ పని అయినా తమకంత శక్తిలేదని, లేదా దేవుడంత శక్తి ఇవ్వలేదని దేవుడి మీద నెపం వేసి చేతులు ముడుచుకోరాదు. మనకు చేతనైనంతలో ప్రయత్నించాలి. అదీగాక ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తూ ఉంటే అసూయ పడకూడదు. నా దగ్గరా సిరిసంపదలు ఉంటే సహాయపడేవాణ్ని. లేవు కాబట్టే చేయలేక పోతున్నానని అనకూడదు. మనకున్న దాంట్లోనే కొంత దానధర్మాలు చేయాలి. మనకున్న శక్తియుక్తులతోనే పరులకింత సహాయపడాలి. అలా చేయడం నిజానికి మరీ అంత గొప్ప విషయమేమీ కాదు కనీస మానవధర్మం అంతే! శక్తి లేదంటూ ఎవరికి వారు పట్టనట్లు ఉండకూడదు. మీకు చెప్పేటంతటివాణ్ని కాకపోయినప్పటికీ చెప్పాల్సి వచ్చింది. తప్పయితే మన్నించండి’ అన్నాడు సుదర్శనుడు. సున్నితమైన ఆ మందలింపు రంగనాథంలో మార్పునకు కారణమైంది. ఆ తరవాత కాలంలో రంగనాథం తనకున్నంతలో అవసరం ఉన్నవారిని ఆదుకుంటూ గ్రామంలో మంచిపేరు తెచ్చుకున్నాడు.

గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని