దురాశతో దుఃఖమే!

కవిటి గ్రామంలో రమణయ్య, గోపయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. ఇద్దరూ స్నేహితులు. ఇద్దరికీ పక్కపక్కనే ఎకరం చొప్పున పొలాలు ఉన్నాయి. అందులో వరి పంట పండించేవారు. రమణయ్య కాస్త దురాశపరుడు. గోపయ్య న్యాయబద్ధంగా జీవించేవాడు. మిత్రుడితో గోపయ్య, దురాశ మంచిది కాదని, అది ఎప్పటికైనా ముప్పు తెస్తుందని చెప్పేవాడు.

Published : 06 Feb 2023 00:50 IST

కవిటి గ్రామంలో రమణయ్య, గోపయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. ఇద్దరూ స్నేహితులు. ఇద్దరికీ పక్కపక్కనే ఎకరం చొప్పున పొలాలు ఉన్నాయి. అందులో వరి పంట పండించేవారు. రమణయ్య కాస్త దురాశపరుడు. గోపయ్య న్యాయబద్ధంగా జీవించేవాడు. మిత్రుడితో గోపయ్య, దురాశ మంచిది కాదని, అది ఎప్పటికైనా ముప్పు తెస్తుందని చెప్పేవాడు.

రమణయ్య నవ్వి.. ‘చేతకాని వాడి మాటలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు సమాజమంతా అందినప్పుడు దోచుకునే నైజంతోనే నడుస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్నాడు. గోపయ్య మిత్రుడి మాటలకు బాధపడినా, అవకాశం దొరికినప్పుడల్లా దురాశ వదులుకోమని చెప్పేవాడు.

ఒకరోజు వారు తమ గ్రామానికి సమీపంలో జరిగే ఆదివారం సంతకు కలిసి వెళ్లారు. సంతలో సరుకులు కొని తెచ్చుకోవడానికి వీలుగా ఎద్దుల బండిపై వెళ్లారు. అక్కడికి పక్క గ్రామం నుంచి వచ్చిన రాజయ్య అనే రైతు వీరిని పలకరించి.. ‘అయ్యా! మన గ్రామాలకు చెందిన జమీందారు మన పొలాల్లో మేలైన విత్తనాలు వేసేందుకు వీలుగా ఎకరానికి ఒక బస్తా చొప్పున ఇస్తున్నారు. మీరు కూడా ఎలాగూ బండి తెచ్చారు కాబట్టి జమీందారును విత్తనాలు అడిగి తీసుకువెళ్లండి’ అని సమాచారమిచ్చాడు.

మేలైన విత్తనాలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందనే ఆలోచనతో గోపయ్య, రమణయ్య జమీందారు గారి దగ్గరకు వెళ్లారు. జమీందారుకు నమస్కరించి.. ‘మాకు మేలైన విత్తనాలు ఇప్పించండి’ అని అడిగారు. జమీందారు దివానును పిలిచి.. ‘వీరికి అవసరమైన విత్తనాలు, వీరి చిరునామా తీసుకొని ఇవ్వండి’ అని చెప్పారు.

దివాను వారిద్దరిని పిలిచి.. ‘అయ్యా! ఎకరానికి ఒక బస్తా చొప్పున విత్తనాలు ఇస్తాం. మీ చిరునామా, మీకున్న భూమి వివరాలు ఈ పుస్తకంలో రాసి మీకు కావాల్సిన విత్తనాలు తీసుకువెళ్లండి’ అని అన్నాడు. గోపయ్య పుస్తకంలో తన చిరునామా, ఒక ఎకరం భూమి అని రాశాడు. అతనికి ఒక బస్తా విత్తనాలు ఇచ్చారు. రమణయ్య తన చిరునామా రాసి అయిదు ఎకరాల భూమి అని రాశాడు. అయిదు బస్తాల విత్తనాలు తీసుకున్నాడు.

అది చూసిన గోపయ్య.. ‘మిత్రమా! నీకున్నది ఒక ఎకరం భూమి కదా! అయిదు ఎకరాలు అని రాసి అయిదు బస్తాల విత్తనాలు తీసుకోవడం సరికాదు కదా!’ అని అన్నాడు. ‘అవన్నీ వాళ్లకు తెలుస్తాయా? అవకాశం వచ్చింది.. కావాల్సినంత తీసుకోవడమే నాకు తెలిసిన విద్య’ అనేశాడు. తర్వాత వాళ్ల గ్రామానికి ఎడ్ల బండిపై విత్తనాల బస్తాలతో వెళ్లిపోయారు.

గోపయ్య తన ఎకరంలో జమీందారు ఇచ్చిన బస్తా విత్తనాలు వేశాడు. రమణయ్య ఒక బస్తా విత్తనాలు ఎకరా పొలంలో వేసి, మిగిలిన నాలుగు బస్తాలు గ్రామంలో రైతులకు అమ్మేశాడు. గోపయ్యతో.. ‘చూశావా! నాలుగు బస్తాలు నేను రైతులకు అమ్మేశాను. నువ్వు మాత్రం ఒక్క బస్తా మాత్రమే తెచ్చుకున్నావు. నువ్వు తెచ్చుకొని ఉంటే బాగుండు కదా?’ అని అన్నాడు.

గోపయ్య.. ‘అది చాలా తప్పు పని. నాకు నచ్చదని నీకు తెలుసు కదా!’ అని సమాధానం ఇచ్చి ఊరుకున్నాడు. మేలైన విత్తనాలతో సాగు చేయడం వల్ల పంట దిగుబడి బాగా పెరిగింది. ఒక ఎకరానికి 15 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది.

గోపయ్య, రమణయ్య చాలా ఆనందపడ్డారు. వ్యవసాయ పనులు పూర్తి చేసి ధాన్యాన్ని కల్లంలో పోగు వేశారు. రమణయ్య చాలా ఆనందంగా ఉన్నాడు. ఇంతలో వీరి చిరునామా వెతుకుతూ జమీందారు గారి దివాను అక్కడికి చేరాడు. గోపయ్య, రమణయ్యను చూసి పలకరించి.. ‘మీరిద్దరూ జమీందారు గారిచ్చిన మేలైన విత్తనాలు మీ పొలంలో వేసి చక్కని దిగుబడి పొందారని తెలిసింది. అందుకే మేం ఇచ్చిన ప్రతి బస్తాకు మూడు బస్తాల చొప్పున తిరిగి వసూలు చేయడానికి వచ్చాను. ఎందుకంటే మేం ఇచ్చిన విత్తనాల వల్లనే దిగుబడి పెరిగింది. మీరు తీసుకున్నప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదంటే, ఒక బస్తా విత్తనాలకు మూడు బస్తాలు ఇవ్వాల్సి వస్తుందంటే.. ఎవరూ కూడా మేలైన విత్తనాలు మా నుంచి తీసుకుని వెళ్లలేరు. అందుకే అప్పుడు మీ చిరునామాలు తీసుకొని, మీకు ఎకరాకు ఒక బస్తా చొప్పున ఇచ్చాం. మీకు ఇంతకుముందు కన్నా దిగుబడి ఎకరానికి అయిదు బస్తాలు పెరిగింది. అందులో మూడు బస్తాలు మాకు ఇవ్వడం వల్ల మీకేమీ నష్టం జరగదు’ అని చెప్పాడు. గోపయ్య.. ‘మీ ఆలోచన న్యాయబద్ధంగానే ఉంది. నేను ఒక ఎకరానికి గాను ఒక బస్తా విత్తనాలు తీసుకున్నాను కాబట్టి, ఇదిగో ఈ మూడు బస్తాలు మీకు అందజేస్తున్నాను’ అని తన వంతు దివానుకు అందించాడు.

పక్కనే ఉన్న రమణయ్య గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే తాను అయిదు ఎకరాలని రాసి.. అయిదు బస్తాల విత్తనాలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు 5 ఎకరాలకు గాను 15 బస్తాలు ఇవ్వాల్సి వస్తుంది. తాను ఎకరంలో పండించినవి 15 బస్తాలే. తాను దురాశతో చేసిన తప్పు ఇప్పుడు మొదటికే మోసం తెచ్చింది అని మొహం మాడ్చుకున్నాడు. చేసేదిలేక, తేలు కుట్టిన దొంగలా తాను పండించిన మొత్తం 15 బస్తాలను దివానుకు ఇచ్చేశాడు. దివాను వాటిని బండిపై తీసుకుని వెళ్లిపోయాడు.

గోపయ్య, రమణయ్యతో.. ‘చూశావా! నీ దురాశ ఎంత పని చేసిందో. నీకు తిండి గింజలు లేకుండా చేసేసింది’ అని అన్నాడు. అప్పుడు సిగ్గుతో రమణయ్య.. ‘నువ్వు నన్ను దురాశ వీడి మంచిగా బతకమని చాలాసార్లు చెప్పావు. కానీ నీ మాటను పెడ చెవిన పెట్టి, మొదటికే మోసం తెచ్చుకున్నాను. దురాశ మిగుల్చు దుఃఖమే అని తెలుసుకున్నాను. ఇకపై దురాశ వీడి న్యాయబద్ధంగా జీవిస్తాను’ అని మిత్రుడితో చెప్పాడు.

గోపయ్య, రమణయ్యలో కలిగిన పరివర్తనను గమనించి.. ‘మిత్రమా! ఇదిగో నేను పండించిన పంట నుంచి సగం బస్తాలను నీకు ఇస్తున్నాను’ అని ఆరు బస్తాలు మిత్రుడికి ఇచ్చాడు. అప్పటి నుంచి రమణయ్య దురాశ వీడి న్యాయబద్ధంగా జీవించడం మొదలు పెట్టాడు.

మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని