గుణశేఖరుడి తీర్పు!

పసిడిపాలెం గ్రామంలో ఆనందయ్య అనే వ్యక్తి ఉండేవాడు. కుండలు చేయడంలో మంచి నైపుణ్యం గల వ్యక్తిగా చుట్టుపక్కల ఊళ్లలో ఆయనకు మంచి పేరుంది. నాణ్యమైన మట్టిని సేకరించడం దగ్గర్నుంచి.. ఎన్ని నీళ్లు కలపాలో, ఎంతసేపు వాటిని కాల్చాలో ఆనందయ్యకు బాగా తెలుసు.

Published : 15 Mar 2023 00:05 IST

సిడిపాలెం గ్రామంలో ఆనందయ్య అనే వ్యక్తి ఉండేవాడు. కుండలు చేయడంలో మంచి నైపుణ్యం గల వ్యక్తిగా చుట్టుపక్కల ఊళ్లలో ఆయనకు మంచి పేరుంది. నాణ్యమైన మట్టిని సేకరించడం దగ్గర్నుంచి.. ఎన్ని నీళ్లు కలపాలో, ఎంతసేపు వాటిని కాల్చాలో ఆనందయ్యకు బాగా తెలుసు. అందుకే తను చేసే కుండలు నాణ్యంగా ఉండేవి. దాంతో గిరాకీ కూడా బాగుండేది. ఇక వేసవికాలం అయితే చెప్పక్కర్లేదు. కుటుంబ సభ్యులు కూడా వివిధ పనుల్లో ఆనందయ్యకు సాయం చేస్తూ ఉంటారు. ఆనందయ్య ఇంటి పక్కనే శరభయ్య అనే వ్యక్తి కూడా కుండలు చేసి విక్రయించే వ్యాపారమే చేస్తుండేవాడు. అతడు తయారు చేసిన కుండలకు పెద్దగా గిరాకీ ఉండేది కాదు. ఎందుకంటే వాటిల్లో నాణ్యత అంతంతమాత్రంగానే ఉండేది.

పని పట్ల శ్రద్ధ చూపని శరభయ్య.. ఆనందయ్యను చూసి అసూయ పడేవాడు. ఆనందయ్య కుండలు కొనేందుకు వచ్చే వినియోగదారులను తన సరకులు కొనమని పిలిచినా.. ఎవరూ తీసుకొనేవారు కాదు. దాంతో ఆనందయ్యను శత్రువులా చూసేవాడు శరభయ్య. అతని వ్యాపారాన్ని దెబ్బ తీసేందుకు తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఆనందయ్య మాత్రం శరభయ్యతో స్నేహంగానే ఉండేవాడు. ఒకరోజు  శరభయ్య దగ్గరకు ఆనందయ్య వచ్చి.. ‘మిత్రమా.. మేము ఒక పెళ్లి వేడుక కోసం ఊరికి వెళ్తున్నాం. వారం రోజుల తర్వాత తిరిగొస్తాం. మా ఇంటి ముందు ఉంచిన కుండలను కాస్త చూస్తూ ఉండు. వాటిని ఇంట్లో పెడదామంటే స్థలం సరిపోను లేదు. ఎవరైనా వస్తే విక్రయించి, డబ్బులు నీ దగ్గరే ఉంచు.. వచ్చాక తీసుకుంటా’ అన్నాడు. అందుకు శరభయ్య.. ‘అయ్యో.. దానిదేముంది ఆనందయ్యా.. నేను చూసుకుంటాను కదా.. మీరు క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రండి’ అన్నాడు. శరభయ్యకు కృతజ్ఞతలు చెప్పి ఆనందయ్య కుటుంబం ఊరికి బయలుదేరింది.

మరుసటి రోజున శరభయ్యకు ఓ మోసపూరిత ఆలోచన వచ్చింది. తన దగ్గర ఉన్న నాసిరకం కుండలను ఆనందయ్య ఇంటి ముందర ఉంచి.. అక్కడి కుండలను తీసుకువచ్చి తన ఇంటి ముందు అమ్మడం మొదలు పెట్టాడు. కొనేందుకు ఎవరైనా వస్తే.. ‘ఆనందయ్య ఊరిలో లేడు.. నా కుండలు కూడా నాణ్యంగా ఉన్నాయి. ఒకసారి పరిశీలించి, మీకు నచ్చితేనే తీసుకెళ్లండి’ అని చెప్పేవాడు. అవి ఆనందయ్య చేసినవి కావడంతో.. రెండు రోజుల్లోనే మొత్తం అమ్ముడుపోయాయి. శరభయ్యకు మంచి లాభాలు వచ్చాయి. వారం రోజుల తర్వాత తిరిగొచ్చిన ఆనందయ్య.. తన ఇంటి ముందు ఉన్న కుండలను చూసి ఆశ్చర్యపోయాడు. అవి తాను చేసిన కుండలు కావని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. వెంటనే శరభయ్య దగ్గరకు వెళ్లాడు. ఆనందయ్య రాకను గమనించిన శరభయ్య.. లేని నవ్వును ముఖం మీద పులుముకొని ‘ఇదేనా రావడం? ప్రయాణం బాగా జరిగిందా?’ అంటూ పలకరించాడు. శరభయ్య కుశల ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా.. కుండలు మారిన విషయంపై నిలదీశాడు ఆనందయ్య. తనకేమీ తెలియదన్నాడు శరభయ్య.

ఆ వివాదం కాస్తా.. రాజు భూపాలవర్మ దగ్గరకు చేరింది. ఆసక్తిగా ఉన్న ఈ సమస్య పరిష్కార బాధ్యతను మంత్రి గుణశేఖరుడికి అప్పగించాడు. ఇరువురి వాదనలు విన్న తరువాత సభ సమక్షంలో ఇద్దరినీ కుండలు చేయమన్నాడు మంత్రి. వారిద్దరి పనితనాన్ని దగ్గరుండి పరిశీలించాడు. చెయ్యడం అయ్యాక.. వాటిని ఎండబెట్టుకొని, మరుసటి రోజు మధ్యాహ్నం సభకు తీసుకొని రమ్మన్నాడు. కోటలోనే వారిద్దరికీ ఆరోజు వసతి కూడా కల్పించారు. తర్వాతి రోజు వారిద్దరూ కుండలతోపాటు సభకు హాజరయ్యారు. వాటి నాణ్యతను నిశితంగా పరిశీలించాడు గుణశేఖరుడు. విచిత్రంగా శరభయ్య కుండనే అన్ని పరీక్షల్లో మేటిగా నిలిచింది. అయినా, ఆనందయ్య చేసిన కుండనే నాణ్యమైందిగా తేల్చాడు. ‘ఇది అన్యాయం ప్రభూ... అన్ని పరీక్షల్లో నెగ్గిన నా పనితనాన్ని మీరు అవమానిస్తున్నారు. ప్రత్యక్షంగా మీరే గమనించారు.. నేను తయారు చేసిన కుండే మేటిగా నిలిచిందని మీరే అన్నారు’ అంటూ మంత్రి, రాజు వైపు చూశాడు శరభయ్య.

రాజుకు కూడా గుణశేఖరుడి తీర్పులోని మర్మం ఏమిటో అర్థం కాలేదు. ‘రాజా.. నేను వీరిద్దరి పనితనాన్ని నిశితంగా పరిశీలించాను. నాణ్యత కోసం ఆనందయ్య పడే శ్రమ దగ్గరుండి చూశాను. నాకు చిన్న అనుమానం వచ్చి.. రాత్రి వారి వసతి మందిరం బయటే ఉండి చాటుగా పరిశీలించసాగాను. ఆ సమయంలో శరభయ్య, తాను తయారు చేసిన కుండను ఆనందయ్య కుండ దగ్గర పెట్టి, ఆనందయ్య తయారు చేసినదాన్ని వెంట తీసుకొచ్చుకున్నాడు. దాన్నే ఇప్పుడు సభలో తనదిగా ప్రదర్శించాడు’ అంటూ అసలు విషయాన్ని వివరించాడు మంత్రి. మోసం తెలిసిపోవడంతో తన తప్పును ఒప్పుకొన్నాడు శరభయ్య. గుణశేఖరుడి సమయస్ఫూర్తిని అభినందించాడు రాజు. శరభయ్యకు జైలు శిక్ష విధిస్తూ.. రాజు ఆదేశించడంతో, అతడు క్షమాపణలు కోరాడు. మరోసారి పొరపాటు జరగదనీ, ఇకపై నీతిగా ఉంటూ.. నాణ్యమైన కుండలను తయారు చేసి మంచి పేరు సంపాదిస్తానని హామీ ఇచ్చాడు. ఆనందయ్య కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడంతో.. సరేనన్నాడు రాజు.

వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు