గుణశేఖరుడి ఉపాయం!

వారణాసిపురంలో గుణశేఖరుడు అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు. పనుల నిమిత్తం అతను తరచూ విదేశాలకు ప్రయాణం సాగించేవాడు. ఆయా ప్రాంతాల్లో తక్కువ ధరకు వజ్రాలు కొని, మరోచోట ఎక్కువ ధరకు అమ్మేవాడు. అలా తన తెలివితో విపరీతంగా లాభాలు గడించేవాడు. ఈ ప్రయాణంలో తనకు రక్షణగా నలుగురు అంగరక్షకులను నియమించుకున్నాడు.

Updated : 04 Mar 2023 04:58 IST

వారణాసిపురంలో గుణశేఖరుడు అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు. పనుల నిమిత్తం అతను తరచూ విదేశాలకు ప్రయాణం సాగించేవాడు. ఆయా ప్రాంతాల్లో తక్కువ ధరకు వజ్రాలు కొని, మరోచోట ఎక్కువ ధరకు అమ్మేవాడు. అలా తన తెలివితో విపరీతంగా లాభాలు గడించేవాడు. ఈ ప్రయాణంలో తనకు రక్షణగా నలుగురు అంగరక్షకులను నియమించుకున్నాడు. వారు కూడా వ్యాపారికి సహాయపడుతూ నిజాయతీగా పనిచేసేవారు.

ఒకసారి గుణశేఖరుడు వ్యాపార నిమిత్తం పశ్చిమ దేశాలకు వెళ్లాడు. అక్కడ చాలా పెద్దమొత్తంలో సరకును విక్రయించి, భారీగా లాభాలను సంపాదించాడు. ఆ డబ్బుతో ఓడలో తిరిగి సొంతూరికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఓడలో తన అంగరక్షకులు ఒకచోట చేరి, గుసగుసలాడుకుంటున్నట్లు అతడికి తెలిసింది. అక్కడికి వెళ్లి వారి మాటలను చాటుగా వినసాగాడు.

‘ఒరేయ్‌.. ఇంకెంతకాలం ఇలా ఈ వ్యాపారి దగ్గరే జీతానికి పనిచేస్తాం. ఆయన ఈసారి చాలా లాభాలు గడించాడు. మనకు కూడా ఇదే సరైన సమయం.. యజమానిని అంతం చేసి, ఆ డబ్బు సంచులను ఎత్తుకెళ్దాం. ఇంటికెళ్లాక ఆ సొమ్మును సమానంగా పంచుకొని, హాయిగా బతికేద్దాం’ అన్నాడొకడు. ‘అది చాలా తప్పురా.. ఆయన ఎప్పుడూ మనల్ని వేరుగా చూడలేదు. నెలలో చివరి రోజే మన జీతం కచ్చితంగా ఇచ్చేస్తున్నాడు. పండుగలకు కొత్త దుస్తులు కూడా కొనిస్తున్నాడు. ఎక్కడికెళ్లినా వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంటి సభ్యుల్లా చూసుకుంటున్నాడు. మనమీద నమ్మకంతోనే ఆయన వ్యాపారం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని మోసం చేయడం అన్యాయం’ అన్నాడు మరొకడు.

‘మోసం లేదు ఏమీ లేదు.. మనం మాత్రం ఎంతకాలం జీతానికి పని చేయగలం. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు’ అన్నారు మిగతా ఇద్దరు. ఆ ముగ్గురూ కలిసి ఎలాగోలా రెండో వ్యక్తిని ఒప్పించారు. ఎలాగైనా వ్యాపారిని చంపి, ఆయన దగ్గరున్న సొత్తు కాజేయాలని నిర్ణయించుకున్నారంతా.

ఆ మాటలను చాటుగా విన్న గుణశేఖరుడికి చాలా భయం వేసింది. ‘నేను ఒక్కడినే.. వాళ్లు నలుగురు ఉన్నారు. నేరుగా తలపడి గెలవలేను. బుద్ధిబలంతోనే తప్పించుకోవాలి. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి’ అని మనసులోనే అనుకున్నాడు. మరుక్షణంలోనే అతడికి మెరుపులాంటి ఓ ఆలోచన తట్టింది. వెంటనే దాన్ని అమలు పరిచాడు.

శబ్దం చేయకుండా తన గదికి వెళ్లి, ఏమీ తెలియనట్టుగా సహాయకులు నలుగురిని పిలిచాడు. ‘ఇంతకాలం మీరు నాకు అండగా ఉంటూ వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. న్యాయంగా మీకు కూడా ఇందులో భాగం రావాల్సి ఉంటుంది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈసారి వచ్చిన లాభాలను అయిదు వాటాలు వేస్తున్నాను. రేపు సాయంత్రం మనం ఊరు చేరగానే.. మీ నలుగురు మీమీ వాటాలతో వెళ్లిపోండి. అంతేకాదు.. ఇకనుంచి మనం చేయబోయే వ్యాపారంలో మీరు కూడా భాగస్వాములే. తదుపరి వజ్రాల వ్యాపారానికి సరిపడా పెట్టుబడిని రెండ్రోజుల్లోగా తీసుకురండి. లేదు.. మీకు నచ్చిన పని చేసుకుంటానంటే మీ ఇష్టానికే వదిలేస్తున్నా’ అంటూ తన దగ్గరున్న డబ్బును అయిదు వాటాలు చేసి వాళ్లకు పంచాడు.

ఈ ఊహించని పరిణామంతో అంగరక్షకులు ఆశ్చర్యపోయారు. ‘ఇంత మంచి మనిషినా.. మేం చంపాలనుకుంది’ అంటూ లోలోపలే బాధపడ్డారు. తరువాత ఎవరి డబ్బు వాళ్లు పట్టుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. మరుసటి రోజు ఆ నలుగురూ పెట్టుబడి నిమిత్తం కొంత సొమ్ముతో గుణశేఖరుడి ఇంటికి వచ్చారు. ‘అయ్యా.. ఇదిగో మనం చేయబోయే వ్యాపారానికి మా వంతు పెట్టుబడి. ఇకపై అందరం కలిసే వ్యాపారం చేద్దాం’ అన్నారు. ‘సరే.. అలాగే చేద్దాం’ అంటుండగానే రాజభటులు వచ్చి వాళ్లను బంధించారు. ఆ క్షణం ఏం జరుగుతుందో వాళ్లకు అర్థం కాలేదు.. ‘అన్యాయం.. అక్రమం.. మోసం’ అంటూ కేకలు వేయసాగారు.

‘ఏది అన్యాయం? ఏది మోసం? ఏది అక్రమం? మీకు జీతం ఇచ్చి, తిండి పెట్టినందుకు యజమానినే చంపాలనుకోవడమా..?’ అంటూ బయటకు వచ్చాడు న్యాయధికారి. వ్యాపారి చాటుగా విన్న విషయం తెలియక.. ‘మేం రహస్యంగా మాట్లాడుకున్న సంగతి బయటకు ఎలా వచ్చిందా?’ అన్నట్లు ఒకరి ముఖం మరొకరు చూసుకోసాగారు. ‘సమయానికి చక్కటి ఉపాయం తట్టింది కాబట్టి గుణశేఖరుడు బతికిపోయాడు. లేకపోతే, ఈపాటికి మీరు అతడిని చంపేసి ఉండేవారు కదా..!’ అని న్యాయాధికారి ప్రశ్నించాడు. దాంతో చేసేది లేక తమ తప్పు ఒప్పుకొని, క్షమాపణలు కోరారు ఆ నలుగురు.

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని