మార్పు మంచిదే..!

కల్వలపాలెం గ్రామంలో రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను మహా పిసినారి. లాభం లేకుండా ఎవరికీ ఏ సాయం చేసేవాడు కాదు.

Published : 11 Feb 2023 00:11 IST

ల్వలపాలెం గ్రామంలో రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను మహా పిసినారి. లాభం లేకుండా ఎవరికీ ఏ సాయం చేసేవాడు కాదు. రాజయ్య భార్య శాంతమ్మది మంచి మనసు కావడంతో అందరూ ఆమెను గౌరవించేవారు. రాజయ్య దంపతులకు ధనరాజు అనే ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. వాళ్ల ఇల్లు ఊరికి దూరంగా.. అడవికి ఆనుకొని ఉండేది. దాంతో ఇంటి చుట్టూ జంతువుల సంచారం ఎక్కువగా ఉండేది. ఆహారం వెతుక్కుంటూ ఇంటి పరిసరాల్లోకి వచ్చే జీవులను రాజయ్య కర్రతో తరిమేసేవాడు.
ఒకసారి ఆ ప్రాంతంలో ఎండలు తీవ్రరూపం దాల్చడంతో నీటి కొరత ఏర్పడింది. అడవిలో ఉన్న కొద్దిపాటి నీటి వనరులూ అడుగంటిపోయాయి. జంతువులకు గొంతు తడవడమే గగనమైంది. అవి దాహం తీర్చుకోవాలంటే కల్వలపాలెంలోని రాజయ్య ఇంట్లో ఉన్న బావి దగ్గరకు వెళ్లాల్సిందే. అతడి ఇల్లు పల్లంలో ఉండటంతో అందులో నీళ్లు ఎప్పుడూ సమృద్ధిగానే ఉండేవి. ఎంతటి ఎండాకాలమైనా సరే.. నీళ్లు అడుగంటడం అంటూ ఉండదు. నీటి కోసం అల్లాడుతున్న జంతువులతో, సింహం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

‘మిత్రులారా.. నీటి సమస్యను తీర్చగలిగే ఉపాయం ఏదైనా మీ దగ్గర ఉంటే చెప్పండి!’ అని అడిగాడు మృగరాజు. అప్పుడు ఓ ఏనుగు.. ‘రాజా.. మనకు నీరు దొరకాలంటే రాజయ్య ఇంట్లో ఉన్న బావి దగ్గరకు వెళ్లాల్సిందే. మండువేసవిలోనూ అందులో సమృద్ధిగా నీళ్లుంటాయి. కానీ, అతను మహా పిసినారి. దయలేని వ్యక్తి’ అంది. అందుకు మిగతా జంతువులూ వంతపాడాయి. సింహానికి కూడా ఏనుగు చెప్పింది సబబే అనిపించింది. మరుసటి రోజు జంతువులన్నీ వెళ్లి రాజయ్యను కలిశాయి. ‘అయ్యా.. మేమంతా దాహంతో అల్లాడుతున్నాం. ఎండాకాలం ముగిసే వరకూ మీ బావి నీరు అందించి, మా దప్పిక తీర్చి ఆదుకోండి’ అని ప్రాధేయపడ్డాయి. రాజయ్య మాత్రం అందుకు ససేమిరా అన్నాడు. మీకిస్తే నాకేంటి లాభం అంటూ ఎదురు ప్రశ్నించాడు. చేసేది లేక జీవులన్నీ అడవిలోకి వెళ్లిపోయాయి.

కాసేపటి తర్వాత.. అడవిలోని చెట్లకు కాసే పండ్లు తెంపుకొని, జీవులన్నీ రాజయ్య ఇంటికి వెళ్లాయి. వాటిని చూసిన రాజయ్య.. సంతోషంగా ఫలాలను తీసుకుని బావి నీళ్లను తాగేందుకు అనుమతి ఇచ్చాడు. ఈసారి ఫలాలతోపాటు అడవిలో దొరికే తేనె, చింతపండు తీసుకువస్తేనే దాహం తీరుస్తానని తేల్చిచెప్పాడు. అతను చెప్పినట్టుగానే జంతువులన్నీ అటవీ సంపదను ఇచ్చి దప్పిక తీర్చుకోసాగాయి. ఆ అటవీ సంపదను ఊర్లో ఎక్కువ ధరలకు అమ్మి బాగా లాభాలు గడించాడతను. ఒకరోజు రాజయ్య కుమారుడు ధనరాజు ఆడుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాడు. కొడుకు కనిపించకపోయేసరికి రాజయ్య, అతడి భార్య ఊరంతా వెతికారు. అయినా ఆచూకీ దొరకలేదు. ప్రతిఫలం ఆశించి.. నీటిని ఇస్తున్నానని కోపంతో జంతువులే తన కుమారుడిని అడవిలోకి ఎత్తుకెళ్లాయేమోననే అనుమానం వచ్చింది రాజయ్యకు.

వెంటనే ఆవేశంగా ఓ గొడ్డలి, కర్రను తీసుకుని అడవి వైపు వేగంగా నడవసాగాడు. దారి మధ్యలో జంతువుల సమూహం రాజయ్యకు ఎదురైంది. ఆ సమూహంలో తన కుమారుడు ధనరాజు నవ్వుతూ అతడికి కనిపించాడు. కొడుకును చూడగానే రాజయ్యకు ఎంతో సంతోషం కలిగింది. జంతువుల వైపు కోపంగా చూస్తూ.. గొడ్డలిని పైకి ఎత్తాడు. ఇంతలో జంతువులన్నీ అతడిని వారించాయి. ‘రాజయ్యా... మీ కొడుకును మేం ఎత్తుకురాలేదు. తనే ఆడుకుంటూ పొరపాటున అడవిలోకి వచ్చాడు. మీ అబ్బాయిని నీకు అప్పగించడానికే మీ ఇంటికి బయలుదేరాం. ఇంతలో నువ్వే మాకు ఎదురయ్యావు’ అంది సింహం. ఆ మాటలతో నిజం తెలుసుకొని, తన కుమారుడిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు రాజయ్య. జంతువులకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి బయలుదేరాడు. తమ కుమారుడు క్షేమంగా తిరిగిరావడంతో శాంతమ్మ కూడా ఎంతో సంతోషించింది. జంతువుల దయాగుణం గొప్పదని కొనియాడింది. ఇకనైనా సాటి మనుషులు, మూగజీవాల పట్ల ప్రేమగా ఉండాలని భర్తను కోరింది. రాజయ్య కూడా జంతువుల పట్ల తాను వ్యవహరించిన తీరుకు పశ్చాత్తాప పడ్డాడు.

మరుసటి రోజు నీటి కోసం వచ్చిన జంతువులు.. రాజయ్యకు తేనె అందించబోయాయి. అప్పుడు ‘మీరంతా ఇక నీటి కోసం నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు. నీటి కోసం ఇబ్బందులు రాకుండా అడవిలో అక్కడక్కడా ఇంకుడు గుంతలు తవ్వుదాం. రాబోయే వర్షాకాలంలో నీరు నిలిచి భూగర్భజలాలు పెంపొందుతాయి. భవిష్యత్తులో కష్టాలు రాకుండా ఉంటాయి’ అని వివరించాడతను. ఆ మాటలకు వాటి ఆనందానికి అవధుల్లేవు. జంతువులన్నీ కృతజ్ఞతలు చెప్పడంతో.. ఒకరికి సాయం చేయడంలో ఎంత ఆనందం ఉంటుందో రాజయ్యకు అర్థమైంది. ఆ క్షణం నుంచి కష్టాల్లో ఉన్న వారికి తోచినంత సాయం చేస్తూ.. మంచి పేరు తెచ్చుకున్నాడు. భర్తలో కలిగిన మార్పునకు భార్య శాంతమ్మ ఎంతో సంతోషించింది.

వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని