ఆలోచనతోనే పరిష్కారం!

పార్వతీపురం గ్రామానికి ఒక సాధువు వచ్చాడు. ఆయన అనేక సమస్యలు పరిష్కరిస్తున్నాడని తెలిసి.. భీమయ్య అనే వ్యక్తి సాధువు వద్దకు వెళ్లాడు. ‘నీ పేరేంటి.. సమస్య ఏమిటో చెప్పు?’ అన్నాడు సాధువు. ’

Published : 13 Mar 2023 00:14 IST

పార్వతీపురం గ్రామానికి ఒక సాధువు వచ్చాడు. ఆయన అనేక సమస్యలు పరిష్కరిస్తున్నాడని తెలిసి.. భీమయ్య అనే వ్యక్తి సాధువు వద్దకు వెళ్లాడు. ‘నీ పేరేంటి.. సమస్య ఏమిటో చెప్పు?’ అన్నాడు సాధువు. ’అయ్యా! నా పేరు భీమయ్య.. నాకు ఇతరుల గురించి తప్ప, నా గురించి ఆలోచించలేక పోతున్నాను. అదే నా సమస్య’ అన్నాడతను. ‘ఇతరుల గురించి అంటున్నావు.. ఇంకా వివరంగా చెప్పు?’ అని అడిగాడు సాధువు. ‘చాలా మంది పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్లు అంత ధనం ఎలా సంపాదిస్తున్నారో తెలియడం లేదు’ అన్నాడు భీమయ్య. సాధువుకు విషయం మొత్తం అర్థమైంది. ‘రేపు సీతాపురంలో ఉండే నా ఆశ్రమానికి వస్తే, నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను’ అన్నాడు సాధువు. ‘అలాగే గురువు గారు’ అన్నాడు భీమయ్య.
మరుసటి రోజు సాధువు ఆశ్రమానికి వెళ్లాడు భీమయ్య. ‘రా.. నువ్వు ఎంత వరకు చదువుకున్నావు?’ అని అడిగాడు సాధువు. ‘పెద్దగా బడికి వెళ్లలేదండీ.. ఏదో చదవడం, రాయడం వరకూ వచ్చు.. అంతే..’ అని సమాధానమిచ్చాడతను. ఇంతలో ఒక శిష్యుడి సాయంతో దర్జీని పిలిపించి.. భీమయ్యకు ఏ విధంగా చొక్కా కుట్టాలో చెప్పి కొలతలు తీసుకోమన్నాడు సాధువు. ‘భీమయ్యా.. రెండు రోజుల తరువాత నువ్వు ఏం చేయాలో చెబుతాను. అంతవరకు విశ్రాంతి తీసుకో..’ అన్నాడు సాధువు. ‘అలాగే గురువు గారూ’ అన్నాడతను. రెండు రోజుల తరువాత కొత్త చొక్కా వచ్చింది. దాన్ని భీమయ్యకు ఇచ్చి వేసుకోమన్నాడు సాధువు. ‘ఇదేంటి గురువు గారు.. ఈ చొక్కా భలే తమాషాగా ఉంది.. జేబులు రెండు పక్కల నడుం మీద చాలా పెద్దగా ఉన్నాయి’ అన్నాడు. ‘తొందరపడకు.. నీకే తెలుస్తుంది.. అటు పక్కగా ఉన్న ఎండిపోయిన ముళ్ల కంపను చూశావుగా.. ఆ కొమ్మలను జాగ్రత్తగా మూరెడు ఉండేలా ముక్కలుగా చేసి తీసుకురా..’ అన్నాడు సాధువు. భీమయ్య ఆ పని ముగించే సరికి సాయంత్రమైంది.

మర్నాడు ‘ఇప్పుడు నువ్వు చెరో జేబులో ఒక్కో ముళ్ల కొమ్మ పెట్టుకొని, పూల మొక్కలకు పాదులు తీస్తూ నీళ్లు పొయ్యాలి.. మళ్లీ నేను చెప్పేవరకూ పని ఆపకూడదు’ అన్నాడు సాధువు. ‘అలాగే’ అన్నాడు భీమయ్య. వారం రోజుల తరువాత ‘గురువు గారూ.. ముళ్ల కొమ్మలు చేతికి గుచ్చుకుంటున్నాయి. దాంతో నా పనిపైన శ్రద్ధ పెట్టలేకపోతున్నాను’ అన్నాడు భీమయ్య. ‘ఇప్పుడు కూడా వేరే వారి గురించిన ఆలోచనలు వస్తున్నాయా?’ అడిగాడు సాధువు. ‘లేదు గురువు గారూ.. ముళ్లు గుచ్చుకోవడం వల్ల ఇప్పుడు నా ఆలోచన మొత్తం దాని మీదే ఉంది’ అన్నాడు భీమయ్య. ‘గతంలో నీకంటూ ఏ పనీపాటా లేకపోవడంతో, ఎప్పుడూ పక్కవారి గురించే ఆలోచించే పరిస్థితి వచ్చింది.. ఇక నీకు ఈ చొక్కాతో పని లేదు.. రేపటి నుంచి ప్రతి రోజూ తోటలో ఒక్కో మొక్కకు ఎన్ని పూలు పూశాయో.. ఎన్ని వాడిపోయి ఉన్నాయో ఒక కాగితం మీద రాసి చూపించాలి’ అన్నాడు సాధువు. ‘అలాగే గురువు గారూ’ అంటూ తలూపాడు భీమయ్య. మరుసటి రోజు నుంచి ఎన్ని పూలు పూస్తున్నాయో.. ఎన్ని వాడాయో లెక్క రాసి సాధువుకు చూపించడం ప్రారంభించాడు భీమయ్య.
అలా నెల రోజులు గడిచాక.. ‘నాకు ఇక్కడే కొలువు ఇవ్వండి’ అని సాధువును అడిగాడు భీమయ్య. ‘ఇక్కడ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కానీ, కొలువులు ఇవ్వడం చాలా కష్టం.. కాస్త ఓపిక పట్టు’ అన్నాడు సాధువు. ఒకరోజు పెద్ద పూల తోట యజమాని అయిన భూషయ్య ఆశ్రమానికి వచ్చి.. ‘గురువు గారూ.. నా పూల తోటను చూసుకోవడానికి సరైన మనిషి దొరకడం లేదు. అందరూ మోసం చేసేవారే తగులుతున్నారు’ అని వాపోయాడు. ‘అదిగో అక్కడ పూల మొక్కల వద్ద భీమయ్య అనే వ్యక్తి ఉన్నాడు. నీకు పనికొస్తాడేమో ఒకసారి పరిశీలించు’ అన్నాడు సాధువు. వ్యాపారి అక్కడకు వెళ్లి, భీమయ్య చేస్తున్న పనిని గమనించాడు. ‘ఇదిగో భీమయ్యా.. నిన్నే.. నీతో కాస్త మాట్లాడాలి’ అన్నాడు. ‘ఆగండి అయ్యగారూ... నేను పనిలో ఉన్నాను.. తరవాత మాట్లాడతాను’ అన్నాడు భీమయ్య. భూషయ్య వెంటనే సాధువు వద్దకు వెళ్లి.. ‘ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు.. అన్నం ఉడికిందో లేదో తెలిసిపోతుంది. వెతకబోయిన తీగ ఇక్కడే దొరికింది. భీమయ్య పనితనం నాకు నచ్చింది గురువు గారు.. అతడిని నేను పనిలో పెట్టుకుంటాను’ అన్నాడు.
భీమయ్య పని ముగించుకొని వచ్చాక.. ‘ఇదిగో భీమయ్యా.. ఈయన ఓ పెద్ద పూల తోటకు యజమాని. నీకు కొలువు ఇస్తారట. జాగ్రతగా పని చేసుకో’ అన్నాడు సాధువు. ‘అలాగే గురువు గారూ.. నన్ను నేను తెలుసుకునేలా చేసినందుకు ధన్యవాదాలు.. వెళ్లి వస్తాను’ అని నమస్కరించాడతను. ‘అలాగే.. శుభం’ అన్నాడు సాధువు. తన పూల తోటలో పనిచేసే సిబ్బంది పర్యవేక్షణ బాధ్యత మొత్తాన్ని భీమయ్యకు అప్పగించాడు భూషయ్య. కొద్ది కాలంలోనే అప్పజెప్పిన పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తూ మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు యజమానిని లాభాల బాట పట్టించాడు. ఇన్నాళ్లకు తనకో మంచి పనిమంతుడు దొరికాడని సంతోషించాడు భూషయ్య. సమయం దొరికినప్పుడల్లా సాధువు ఆశ్రమానికి వెళ్లి వచ్చేవాడు భీమయ్య.

యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని