సాయం చేసిన మేలు!

వింధ్యా పర్వతం పక్కన, కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ స్వచ్ఛమైన నీటితో గలగల పారే సెలయేరు ఒకటుంది. దానికి ఆనుకొనే ఒక ఆశ్రమం ఉంది.

Published : 16 Feb 2023 00:28 IST

వింధ్యా పర్వతం పక్కన, కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ స్వచ్ఛమైన నీటితో గలగల పారే సెలయేరు ఒకటుంది. దానికి ఆనుకొనే ఒక ఆశ్రమం ఉంది. అందులో కణ్వుడు అనే గురువు కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పుతుండేవాడు. ఒక ఉదయం విద్యాసాగరుడు, యుగంధరుడు అనే ఇద్దరు శిష్యులను పిలిచి.. ‘నాయనలారా.. మీ ఇద్దరి విద్య పూర్తయింది. అన్నింట్లోనూ ఉత్తీర్ణులయ్యారు. ఇక మీరు  బయటకు వెళ్లి మీ తెలివితేటలను ఉపయోగించి తగిన కొలువు దక్కించుకొని ఉన్నతులుగా నిలవండి’ అన్నాడు కణ్వుడు. వారిద్దరూ చాలా సంతోషంతో.. ‘గురుదేవా! మీ మాటలు మా బాధ్యతను తెలిపాయి. ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మాకు బాధగా ఉన్నా, అది తప్పక చేయాల్సిందే కాబట్టి.. మాకు విద్యా బుద్ధులు నేర్పినందుకు గురుదక్షిణగా మీరు ఏదైనా కోరుకుంటే సంతోషిస్తాం’ అంటూ నమస్కరించారు. ‘సాటి ప్రాణికి సహాయపడే గుణమే అత్యుత్తమమైంది. అందుకే, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో అలసత్వం చూపకండి’ అన్నాడు కణ్వుడు.

అప్పుడే రాజు గారి కొలువులో పనిచేసేందుకు, ప్రతిభావంతులైన ఇద్దరు కావాలని ఆశ్రమానికి వర్తమానం వచ్చింది. వెంటనే గురువు.. ‘అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లండి’ అన్నాడు. ఇద్దరూ గురువుకు పాదాభివందనం చేసి.. అక్కడి నుంచి రాజధానికి బయలుదేరారు. విద్యాసాగరుడు మంచివాడు. అడిగినా, అడగకపోయినా తన దృష్టికి వస్తే చాలు సహాయం చేసేందుకు ముందుంటాడు. యుగంధరుడు కూడా మంచివాడే కానీ అడిగిన వారికి మాత్రమే సహాయం చేస్తాడు. అడగని వారి గురించి పట్టించుకోనవసరం లేదని అతని అభిప్రాయం. ఇద్దరూ దట్టమైన అడవి మార్గం మీదుగా రాజధానికి వెళ్తున్నారు. క్రూరమృగాలు ఉంటాయేమోనని జాగ్రత్తగా చుట్టూ చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ‘పని విషయంలో కాస్త వెనకాముందూ అయినా కానీ సమయపాలన లేకపోతే రాజు ఏమాత్రం ఉపేక్షించడు’ అని గురువు చెప్పిన మాటలు వారికి గుర్తొచ్చి నడకలో వేగం పెంచారు.

అదే సమయంలో వాళ్లకు ముందుగా వెళ్తున్న ఒక పల్లకి, దాన్ని మోస్తున్న బోయీలు కనిపించారు. అంతలోనే ఎక్కడి నుంచో ఒక బందిపోటు ముఠా వచ్చి, వారి మీద దాడి చేసి బోయీలను గాయపరిచారు. పల్లకిలో ఉన్న వ్యక్తిని కొట్టి, అతడి వద్దనున్న నగలు, డబ్బు ఎత్తుకెళ్లబోయారు. అది చూసిన విద్యాసాగరుడు క్షణం ఆలోచించకుండా దొంగల ముఠాతో తలపడేందుకు అటుగా కదిలాడు. వెంటనే యుగంధరుడు.. ‘విద్యాసాగరా! మనం కొలువు కోసం వెళ్లాలి. ఒక్క క్షణం ఆలస్యమైనా రాజు గారు మనల్ని లోపలకు రానివ్వరు. మనకు ఈ గొడవ అవసరం లేదు పద..’ అని వారించాడు. విద్యాసాగరుడు ఆ మాటలు వినలేదు... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో అలసత్వం చేయమని గురువు గారికి మాట ఇచ్చిన సంగతిని గుర్తుచేశాడు. ‘ఆ మాట ఇప్పుడు పాటిస్తే ఉద్యోగం పోతుంది. మన గురించి ఆలోచించకుండా పరోపకారం చేయడం కూడా తప్పే.. నీ ఇష్టం... నేనైతే ఆగను’ అంటూ వెళ్లిపోయాడు యుగంధరుడు. బోయీలతో వీరోచితంగా పోరాడి వారిని తరిమికొట్టాడు విద్యాసాగరుడు. పల్లకిలో ఉన్న వ్యక్తికి సపర్యలు చేశాడు. కాస్త కోలుకున్నాక, గాయాలతోనే బోయీల సాయంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయాడతను.

ఆ తరువాత విద్యాసాగరుడు రాజ భవనానికి వెళ్లాడు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో సమయం మించిపోయిందని భటులు లోనికి అనుమతించలేదు. విద్యాసాగరుడు మౌనంగా వెనుదిరిగాడు. సమయానికి వెళ్లిన యుగంధరుడు అన్ని పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సంపాదించాడు. ఆ రోజు సభకు హాజరుకావాల్సిన ప్రత్యేక అతిథి రాకపోవడంతో కారణం తెలుసుకోవాలని మంత్రిని ఆదేశించాడు మహారాజు. ‘ప్రభూ! అతిథిని మార్గ మధ్యలో దొంగలు గాయపరిచారు. విద్యాసాగరుడు అనే యువకుడు ప్రాణాలొడ్డి ఆయనను కాపాడాడు. ఆ అతిథి గాయాలతో తిరిగి వెళ్లిపోయారు. ఆయన్ని కాపాడిన యువకుడు కణ్వుడి శిష్యుడే. అతడు మన కొలువులో ఉద్యోగం కోసం వస్తుండగా.. మన అతిథిని రక్షించే క్రమంలో ఆలస్యమైంది. దాంతో సమయపాలన పాటించలేదని మన భటులు వెనక్కి పంపించారు’ అని వివరించాడు మంత్రి. తక్షణం విద్యాసాగరుడిని పిలిపించమని ఆదేశించాడు రాజు.
మరుసటి రోజే భటులు విద్యాసాగరుడిని రాజు ముందుకు తీసుకువచ్చారు. ‘విద్యాసాగరా! నువ్వు మా అతిథిని కాపాడి రాజ్య గౌరవం నిలబెట్టావు. అందుకు నిన్ను నా ఆంతరంగికుడిగా నియమిస్తున్నాను’ అన్నాడు రాజు. ‘ప్రభూ.. కొలువు ఇచ్చినందుకు ధన్యవాదాలు. కానీ, నాదొక మనవి.. ఆలస్యమైందన్న కారణంతో నన్ను వెనక్కి పంపించారు. సమయపాలన మంచిదే.. కానీ, ఆ ఆలస్యానికి కారణం కూడా తెలుసుకుంటే బాగుండేది. ఆంతరంగికుడిగా మంచితోపాటు చెడు కూడా తెలపాల్సిన బాధ్యత నాపై ఉంది’ అన్నాడు విద్యాసాగరుడు వినయంగా. రాజు ఆనందంతో ‘భేష్‌.. విద్యాసాగరా..’ అని మెచ్చుకున్నాడు. అక్కడే ఉన్న యుగంధరుడితో సహా మిగతా వారి చప్పట్లతో సభ మొత్తం మారుమోగింది.

కె.వి.సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు