వచ్చింది.. ఉగాది పండుగ!

‘రామా.. ఇక లేమ్మా.. ఈ రోజు ఉగాది పండుగ’ అంటూ కొడుకుని నిద్రలేపింది సుమతి. ‘సరేనమ్మా’.. అంటూ బద్ధకంగా నిద్రలేచి ‘ఉగాది అంటే ఏమిటమ్మా?’ అని అడిగాడు రామ.

Published : 22 Mar 2023 01:26 IST

‘రామా.. ఇక లేమ్మా.. ఈ రోజు ఉగాది పండుగ’ అంటూ కొడుకుని నిద్రలేపింది సుమతి. ‘సరేనమ్మా’.. అంటూ బద్ధకంగా నిద్రలేచి ‘ఉగాది అంటే ఏమిటమ్మా?’ అని అడిగాడు రామ. ‘ముందు నువ్వు ముఖం కడుక్కొని, స్నానం చేసి, టేబుల్‌ మీద పెట్టిన కొత్త దుస్తులు వేసుకునిరా.. అప్పుడు చెబుతాను పండుగ గురించి..’ అంది అమ్మ. ‘సరేనమ్మా..’ అంటూ బ్రష్‌ తీసుకుని గబగబా వెళ్లిపోయాడు రామ. ‘ఏమండీ.. ఆ మామిడి ఆకులు ఇంటి గుమ్మానికి కట్టండి.. అలాగే నిన్న తెచ్చిన వేప పువ్వు సరిపోదు. మన పెరట్లో ఉన్నది కూడా ఇంకాస్త కోసివ్వండి’ అని అడిగింది సుమతి. ‘అలాగే..’ అంటూ మామిడాకులు కట్టడానికి సిద్ధం అయ్యారు రామ వాళ్ల నాన్న సత్యం.

ఇంతలో స్నానం చేసి వచ్చిన కొడుక్కి నుదుటన బొట్టు పెట్టింది అమ్మ. ‘ఆ.. ఇప్పుడు చెప్పమ్మా ఉగాది అంటే ఏమిటో.?’ అని ఆదరాబాదరాగా వచ్చి అడిగాడు రామ. ‘చెబుతాను విను.. మనం ఏటా జనవరి ఒకటో తేదీన పండుగలా జరుపుకొంటాం కదా..’ అని అమ్మ మాట్లాడుతుండగానే.. ‘ఆ.. న్యూ ఇయర్‌’ అంటూ మధ్యలోనే సమాధానమిచ్చాడు రామ. ‘అవును.. అది ఆంగ్ల సంవత్సరాది.. అలాగే, ప్రతి చైత్ర మాసం మొదటి రోజు తెలుగువాళ్లు కొత్త సంవత్సరాన్ని జరుపుకొంటారు. యుగ, ఆది అనే రెండు సంస్కృత పదాల సమ్మేళనాన్నే ఈ ఉగాదిగా చెబుతుంటారు. ఇది తెలుగు వారిగా మనకు ఎంతో ముఖ్యమైన పండుగ. చలికాలం శిశిర రుతువులో చెట్లన్నీ ఆకులు రాల్చి, ఈ వసంత కాలంలో చిగురిస్తూ.. ఎంతో అందంగా కనిపిస్తుంటాయి. మామిడి చెట్లు తెల్లని పూతతో, లేలేత పిందెలతో మెరుస్తుంటాయి. ఆ చెట్ల మీద కోయిలలు మావి చిగురు తింటూ కుహూ.. కుహూ.. అని పాడుతుంటాయి. ఆరోజు అందరూ ఉగాది పచ్చడి చేసుకుంటారు’ అని వివరించింది అమ్మ.

ఆ వెంటనే.. ‘అమ్మా.. అమ్మా.. ఉగాది పచ్చడి అంటే కూడా ఏంటో చెప్పవా?’ అంటూ అడిగాడు రామ. ‘చెబుతా.. మనం ఇద్దరం కలిసే పచ్చడి చేద్దాం. అప్పుడు నీకే తెలుస్తుంది’ అని సమాధానమిచ్చిందామె. సరేనన్నాడు రామ. ‘ఈ పచ్చడిని షడ్రుచులతో తయారు చేస్తాం. అంటే తీపికి బెల్లం, పులుపు కోసం చింతపండు, ఉప్పదనానికి లవణం, కారానికి మిరియాలు, చేదుకు వేప పువ్వు, వగరుకు లేత మామిడి కాయను ఉపయోగిస్తామన్నమాట. రుచులు అవే ఉన్నా.. కొన్ని ప్రాంతాలను బట్టి అందులో కలిపే పదార్థాలు కాస్త మారుతుంటాయి’ అని పచ్చడిని తయారు చేస్తూ చెప్పింది అమ్మ. ‘అది సరే.. మరి షడ్రుచులే ఎందుకు?’ అని మళ్లీ అడిగాడు రామ. ‘పచ్చడిలో కలిపే తీపి మన ఆనందానికి, చేదు కష్టాలకు సూచిక అన్నమాట. ఇలా ఒక్కో రుచి జీవితంలో ఎదురయ్యే ఒక్కో అనుభవానికి గుర్తు. కష్టసుఖాలను సమానంగా చూస్తూ.. ఎక్కడా ఆగిపోకుండా.. ముందుకు వెళ్లాలనేది ఈ పచ్చడిలోని పరమార్థం’ అని వివరించిందామె. అప్పుడే పెరట్లో నుంచి కుహూ.. కుహూ.. అంటూ కోయిల శబ్దం వినిపించింది. ‘అమ్మా.. కోయిలను చూసి వస్తా’ అంటూ పెరట్లోకి పరిగెత్తాడు రామ. మామిడి చెట్టు చిటారు కొమ్మపై తోక ఊపుతూ కూస్తున్న కోయిల కనిపించింది. ‘అమ్మా .. కోయిల శరీరమంతా నల్లన, కళ్లేమో ఎర్రన, గొంతు మాత్రం తియ్యన’ అన్నాడు రామ. ‘బాగుంది.. నీ చిరు కవిత’ అన్నారు వాళ్ల నాన్న. ఆంగ్లంలో రోజులకు, నెలలకు పేర్లు ఉన్నాయి కానీ సంవత్సరాలకు సంఖ్యలు తప్ప ప్రత్యేకంగా పేర్లేమీ లేవు. కానీ, తెలుగులో ప్రతి సంవత్సరానికో పేరుంటుంది. ఈ కొత్త సంవత్సరం పేరు.. శోభకృత్‌’ అని అన్నారాయన. ‘అవునా.. భలే బాగుంది నాన్న గారు’ అన్నాడు రామ. అప్పుడే బయట ఆటో ఆగిన శబ్దం వినిపించింది. ‘అమ్మా.. అక్క, బావ వచ్చారు’ అంటూ ఎదురెళ్లాడు. తరువాత అమ్మ పెట్టిన ఉగాది పచ్చడి తిన్నారందరూ. ‘అమ్మా.. ఈ పచ్చడి నా స్నేహితులకి కూడా తీసుకెళ్తా’నన్నాడు రామ. అమ్మ సరేనంది. అప్పుడే వీధి చివరనున్న గుడిలో పంచాగ శ్రవణం మొదలైంది.  

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని