ముందుచూపు!

భువనపురం జమీందారు నివాస భవనానికి చలపతి కాపలాదారుగా ఉండేవాడు. అతడికి వయసు మీద పడటంతో  ఇక విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు.

Updated : 18 Mar 2023 02:36 IST

భువనపురం జమీందారు నివాస భవనానికి చలపతి కాపలాదారుగా ఉండేవాడు. అతడికి వయసు మీద పడటంతో  ఇక విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అదే విషయాన్ని జమీందారుకు చెప్పాడు. ‘తెలిసిన వారు ఎవరైనా మంచివాళ్లు ఉంటే, నీ స్థానంలో కాపలదారుగా తీసుకురా.. ఆ తర్వాత నువ్వు విశ్రాంతి తీసుకో..’ అన్నాడు జమీందారు. అందుకు సరేనన్నాడు చలపతి. తెలిసిన వారందరినీ వాకబు చేసినా.. ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో జమీందారే తన భవనానికి కాపలాదారు కావాలనే విషయాన్ని ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ చాటింపు వేయించాడు. మరుసటి రోజే కొందరు యువకులు వచ్చారు. వారిని అనేక రకాలుగా పరీక్షించాడు జమీందారు.

ఆ పరీక్షల్లో రంగడు, చెన్నడు, భద్రుడు అనే ముగ్గురు తుది వరకు నిలిచారు. వారిని ఒక్కొక్కరిగా పిలిచి.. ‘ఒక పనిని విజయవంతంగా చేయాలంటే ఏమి ఉండాలి? కాపలాదారుడికి కావాల్సిన లక్షణాలు ఏంటి?’ అని ప్రశ్నించాడు. ‘చేస్తున్న పని వల్ల మనకు మంచి లాభం కలుగుతుందనుకున్నప్పుడు దాన్ని విజయవంతంగా చేయగలం. కాపలాదారుడికి ఉండాల్సిన లక్షణం విశ్వాసం’ అన్నాడు రంగడు. ‘మనకు ఇష్టమైన పనిని ఎంపిక చేసుకున్నప్పుడు విజయవంతంగా చేయగలం. కాపలాదారుడికి ఉండాల్సిన లక్షణం నిద్రపోకుండా ఉండటం’ అని తన సమాధానాలు చెప్పాడు చెన్నడు. ‘సరైన ప్రణాళిక, ఆత్మవిశ్వాసం, అంకితభావం, ధైర్యం, ఇష్టంతో కూడిన కష్టపడేతత్వం ఉండాలి. అప్పుడే ఏ పనినైనా విజయవంతంగా చేయగలం. కాపలాదారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా, అలికిడి వినిపించినా వెంటనే స్పందించే గుణం ఉండాలి’ అన్నాడు భద్రుడు.

ఆ ముగ్గురి సమాధానాలను విన్న జమీందారు, వారిని రెండు రోజుల తర్వాత రమ్మని చెప్పి పంపాడు. కానీ, విచిత్రంగా ఆ రోజు రాత్రి కాపలా కాసేందుకు అవసరమైన సామగ్రితో జమీందారు భవనం వద్దకు వచ్చాడు భద్రుడు. అప్పటికే ప్రహరీ తలుపులు మూసేసి ఉన్నాయి. దాంతో భద్రుడు ఒకసారి ప్రహరీ చుట్టూ తిరిగి పరిశీలించాడు. బయటనున్న ఓ చెట్టు కొమ్మ ప్రహరీ మీదుగా భవనంలోకి ఉండటాన్ని గమనించాడు. వెంటనే భద్రుడు ఆ చెట్టు కొమ్మ ఆసరాతో ప్రహరీ దాటి లోపలకు చేరుకున్నాడు. ఆ గోడ వెంట తిరుగుతూ.. కాపలా కాయసాగాడు. తెల్లవారుజామునే నిద్రలేచిన జమీందారు, భవనం బయటకు వచ్చాడు. అప్పటికే కాపలాగా ఉన్న భద్రుడిని చూశాడు. కానీ, పలకరించలేదు. మర్నాడు కూడా భవనానికి కాపలాగా వచ్చాడు భద్రుడు. ఆ సమయంలో ప్రహరీ తలుపులు తెరిచే ఉన్నాయి. లోపలికి వెళ్లి, ఆ తలుపులు మూసేశాడు. ఆ రాత్రి కూడా భవనం చుట్టూ తిరుగుతూ కాపలా కాశాడు.

మూడో రోజు జమీందారు చెప్పిన సమయానికి రంగడు, చెన్నడు, భద్రుడు వెళ్లారు. ‘నేను రెండు రోజుల తర్వాత వచ్చి కలవమని ముగ్గురికీ చెప్పాను. కానీ, గత రెండు రోజులూ రాత్రి వేళ వచ్చి, తెల్లవారేవరకూ నా భవంతి చుట్టూ కాపలాగా ఉన్నావు. నిన్ను పనిలో పెట్టుకోకున్నా ఎందుకలా చేశావు?’ అని భద్రుడిని అడిగాడు జమీందారు. ‘అయ్యా.. మీ ఇంటికి కాపలాదారు అవసరమని చాటింపు వేయించారు. ఈ విషయం దొంగల చెవిన పడితే, చోరీకి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే, ముందుచూపుతో వెంటనే కాపలాకు వచ్చాను. మీరు నా శక్తి సామర్థ్యాలు పరీక్షించారు కదా! నాకు పని ఇస్తారన్న నమ్మకం ఉంది. ఒకవేళ పని ఇవ్వకపోతే.. ఈ రెండు రోజులూ మీ ఇంటిని కాపాడగలిగాననే తృప్తి మిగులుతుంది. ఇందులో నేను నష్టపోయేది ఏమీ లేదు’ అని జవాబిచ్చాడు భద్రుడు.

‘భవనం చుట్టూ ఉన్న ప్రహరీని దాటుకుని మొదటి రోజు ఎలా లోపలికి రాగలిగావు?’ అని అడిగాడు జమీందారు. ‘ప్రహరీని ఆనుకొని బయటనున్న చెట్టు కొమ్మ భవనంలోకి పాకింది. ఆ కొమ్మ సహాయంతో వచ్చాను. దొంగలు కూడా అలా సులభంగా ప్రవేశించే ఆస్కారం ఉంది. కాబట్టి, ఆ కొమ్మను తొలగించేస్తే మంచిది’ అని చెప్పాడతను. ‘ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయాలంటే ఏమి ఉండాలని, కాపలాదారుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలని.. నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు చెప్పిన సమాధానాలు నాకు బాగా నచ్చాయి. అప్పుడే నిన్ను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ, వెంటనే ఆ విషయం చెబితే రంగడు, చెన్నడు బాధపడతారని రెండు రోజులు సమయమిచ్చాను. నువ్వు మాత్రమే నిస్వార్థంగా, ముందుచూపుతో ఆలోచించి.. నా భవనం చుట్టూ కాపలా కాశావు. నీ ఆలోచన, పని ఉన్నతమైంది. కాపలాదారు పనికి నువ్వే అర్హుడివి’ అని ప్రకటించాడు జమీందారు. తమలోని లోపాలను తెలుసుకున్న రంగడు, చెన్నడు.. మౌనంగా వెనుదిరిగారు.

డి.కె.చదువులబాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని