story: తమ్ముడి అసూయ... అన్న సాయం!

రాజుపాలెంలో ఉండే ధర్మన్న.. దర్జీ పని చేసేవాడు. ఆయనకు సూరన్న, చంద్రన్న అనే ఇద్దరు కొడుకులున్నారు. వారు కొంత వరకు చదువుకున్నారు. ధర్మన్నకు దుస్తులు కుట్టడంలో మంచి నైపుణ్యముంది. దర్జీపని నేర్పిస్తా, నేర్చుకోమని కొడుకులకు చెప్పాడు.

Updated : 03 Jun 2024 05:11 IST

రాజుపాలెంలో ఉండే ధర్మన్న.. దర్జీ పని చేసేవాడు. ఆయనకు సూరన్న, చంద్రన్న అనే ఇద్దరు కొడుకులున్నారు. వారు కొంత వరకు చదువుకున్నారు. ధర్మన్నకు దుస్తులు కుట్టడంలో మంచి నైపుణ్యముంది. దర్జీపని నేర్పిస్తా, నేర్చుకోమని కొడుకులకు చెప్పాడు. సూరన్న నేర్చుకోవడానికి సిద్ధపడ్డాడు. బద్ధకస్తుడైన చంద్రన్న మాత్రం నాన్న మాటలు పట్టించుకోలేదు. స్నేహితులతో వీధుల్లో తిరుగుతూ, పనికిరాని మాటలతో కాలక్షేపం చేస్తుండేవాడు. ధర్మన్న పదేపదే చెప్పి చూశాడు. కానీ చంద్రన్న తండ్రి మాటలు పెడచెవిన పెట్టాడు. సూరన్న మాత్రం తండ్రి నుంచి విద్యను పట్టుదలగా నేర్చుకున్నాడు. 

 కొంతకాలం తర్వాత ఇద్దరికీ వివాహాలయ్యాయి. కొన్ని రోజులకు అనారోగ్యంతో ధర్మన్న చనిపోయాడు. చంద్రన్న, సూరన్న ఒకే ఇంట్లో ఉండలేకపోయారు. వేరువేరుగా జీవించాలని నిర్ణయించుకున్నారు. దుస్తులు కుట్టే మిషన్‌ను అన్నను తీసుకోమన్నాడు చంద్రన్న. తనకు దస్తులు కుట్టేపని రాదు కాబట్టి, ప్రతిగా తనకు అన్న ఇరవైవేల రూపాయలివ్వాలని పట్టుబట్టాడు. తమ్ముడే కదా అని అడిగిన డబ్బిచ్చాడు సూరన్న. 

చంద్రన్న భార్య కూలీ పనులకెళ్లేది. చంద్రన్నకు ఏ పనీ చేతకాక ఖాళీగా ఉండేవాడు. సూరన్నకు చేతినిండా పని ఉండేది. దుస్తులు కుడుతూ బాగా సంపాదించసాగాడు. రెండు సంవత్సరాలు తిరిగే సరికి, ఇంటిలోనే వస్త్రాల దుకాణం పెట్టాడు. జనం అవసరమైన వస్త్రాలు సూరన్న దగ్గరే కొని, అక్కడే కుట్టించుకునేవారు. వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. అనతి కాలంలోనే బాగా సంపాదించి తోటలు కొన్నాడు. అవి మంచి ఫలసాయం ఇస్తున్నాయి. పిల్లలను పట్నంలో చదివిస్తున్నాడు. 

చంద్రన్నకు ఇద్దరు పిల్లలు. ఖర్చులు పెరిగాయి. ఇరవైవేల రూపాయలూ ఎప్పుడో ఖర్చయిపోయాయి. దినం గడవడమూ కష్టమైపోయింది. అన్న ప్రగతిని చూసి తమ్ముడు అసూయపడ్డాడు. ‘దర్జీ పని నేర్పుతానని నాన్న నెత్తీనోరూ కొట్టుకుని చెప్పినా వినకుండా.. ఏ పనీ చేతకాక అసమర్థుడిగా మిగిలి పోయాను కదా!’ అని విచారించసాగాడు. 

భర్త బాధ చూసిన భార్య... ‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. పని నేర్చుకోవడానికి వయస్సుతో పనిలేదు. మీ అన్నను అడిగి దుస్తులు కుట్టేపని నేర్చుకో!’ అంది. వేరు కాపురం పెట్టేటప్పుడు అధర్మంగా, మొండిగా అన్న దగ్గర ఇరవై వేల రూపాయలు తీసుకున్న విషయం గుర్తుకొచ్చింది. ఇప్పుడు దర్జీ పని నేర్పమంటే అన్న ఏమంటాడోనని సందేహపడుతూనే వెళ్లి అడిగాడు. సూరన్న సంతోషంగా ఒప్పుకున్నాడు. 

అనతి కాలంలోనే అన్నిరకాల దుస్తులు కుట్టడం నేర్పించాడు. మెలకువలు వివరించాడు. ఊళ్లో తమ్ముడు తనకు పోటీ అవుతాడని కూడా ఆలోచించకుండా కుట్టు మిషన్‌ కూడా కొనిచ్చాడు. దుస్తుల దుకాణమూ పెట్టించి, జీవితంలో నిలదొక్కుకునేందుకు సాయం చేశాడు. 

ఓ రోజు చంద్రన్న, సూరన్నతో... ‘అన్నా! అప్పట్లో నీ నుంచి నేను అన్యాయంగా ఇరవైవేలు రాబట్టుకున్నాను. నీ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోయాను. అసూయతో రగిలిపోయాను. కానీ నువ్వు.. నేను నీకు పోటీ అవుతానని తెలిసి కూడా నాకు దర్జీ పని నేర్పావు. దుకాణం పెట్టించావు. నావల్ల నీ వ్యాపారం తగ్గుముఖం పడుతుంది కదా!’ అన్నాడు.

సూరయ్య ఓ నవ్వు నవ్వి.. ‘తమ్ముడూ...! నువ్వు బద్ధకం వదిలి పని నేర్చుకుంటానంటే.. నాకు చాలా సంతోషం వేసింది. నువ్వు బాగు పడితే, ఈ ప్రపంచంలో మొదట సంతోషించేవాడిని నేనే. ఒకరిని చూసి ఒకరు అసూయపడితే అన్నదమ్ముల అనుబంధానికి, మానవ సంబంధాలకు అర్థమేముంది. ఎదుటివారి మంచిని కోరుకోవడం, చేతనైన సాయం చేయడమే మానవత్వం. మనిషి జీవితానికి సార్థకత’ అని చెప్పి తమ్ముడిని ఆశీర్వదించాడు. అన్న మంచితనానికి ఏమిచ్చినా రుణం తీరదనుకున్నాడు చంద్రన్న.

డి.కె.చదువుల బాబు 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని