story: చలమయ్య కుమారుడు..!

నవ్యపురం జమీందారు వద్ద కోటయ్య దివానుగా పని చేస్తుంటాడు. పొలానికి అవసరమైన పెట్టుబడి, కూలీల ఖర్చు.. రాబడి ఇలా ఆదాయ వివరాలు రాయడం కోటయ్య పని. ఒకసారి అతను పని మీద భువనపురానికి వెళ్లాల్సి వచ్చింది.

Updated : 20 Jun 2024 01:52 IST

వ్యపురం జమీందారు వద్ద కోటయ్య దివానుగా పని చేస్తుంటాడు. పొలానికి అవసరమైన పెట్టుబడి, కూలీల ఖర్చు.. రాబడి ఇలా ఆదాయ వివరాలు రాయడం కోటయ్య పని. ఒకసారి అతను పని మీద భువనపురానికి వెళ్లాల్సి వచ్చింది. దాంతో.. వ్యవసాయానికి అవసరమైన నాగళ్లు, గొర్రు, గడ్డపార, పార, కొడవళ్లు తీసుకురావాలని ఓ సహాయకుడు గుర్తు చేశాడు. అక్కడ చాలామంది వ్యవసాయ పనిముట్లు తయారుచేసే వాళ్లు ఉన్నారు. ఇద్దరు పని వాళ్లను వెంటబెట్టుకుని కోటయ్య భువనపురం బయలుదేరాడు. అక్కడ పనిముట్ల తయారీకి చలమయ్య పెట్టింది పేరని తెలుసుకుని.. అతని దగ్గరకే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కోటయ్య. విశాలమైన స్థలంలో కొందరు పనిముట్లు తయారు చేస్తున్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి.. ‘మీలో చలమయ్య ఎవరు?’ అని అడిగాడు. ‘అయ్యా! చలమయ్య ఇప్పుడే పని మీద బయటకెళ్లాడు. అక్కడ పని చేస్తున్న అబ్బాయి ఆయన కుమారుడు. అతను కూడా మీకు కావాల్సిన పని చేసి పెడతాడు’ అని బదులిచ్చాడు ఓ వ్యక్తి. అతని దగ్గరకు వెళ్లి కావాల్సిన పనిముట్ల వివరాలు చెప్పి.. కాస్త త్వరగా ఇవ్వమని చెప్పాడు కోటయ్య. ఆ యువకుడు పైకి చూడకుండా పని చేసుకుంటూ.. ‘అయ్యా! మీకు నాణ్యమైన వస్తువులు కావాలంటే.. కాస్త సమయం పడుతుంది. కాసేపు వేచి ఉండండి.. మీకు కావాల్సినవి చేసి ఇస్తాను’ అన్నాడు. ఆ మాటలు విన్న కోటయ్య.. ‘అసలు నేను ఎవరనుకున్నావు? నవ్యపురం జమీందారు దివానును. నువ్వు పనిముట్లు చేసేంత వరకు ఇక్కడే ఉండటానికి నాకేం పనుల్లేవనుకున్నావా? నీ పని ఆపి.. ముందు నేను చెప్పిన పని చేసి పెట్టు’ అని కోపంగా అన్నాడు. ఆ యువకుడు వినయంగా.. ‘కొద్దిసేపు ఆగండి.. ఈ పని మధ్యలో ఆపలేను. ఇక పూర్తికావొచ్చింది’ అని బదులిచ్చాడు. అయినా కూడా వినకుండా.. ‘పని చేసుకునేవాడివి.. నా మాటకే ఎదురు చెబుతావా? నీ సంగతేంటో తేలుస్తాను’ అని బయటికి వచ్చాడు కోటయ్య. వెంటనే రాజ భటులకు ఫిర్యాదు చేసి.. అతని దగ్గరకు తీసుకొచ్చాడు.

రాజ భటుడు ఆ యువకుడిని చూసి.. నమస్కరించాడు. దాంతో కోటయ్య.. ‘అతను నా మాటను గౌరవించలేదని మీకు చెబితే.. మీరేంటి అతనికి నమస్కారం చేస్తున్నారు’ అని అడిగాడు. ‘ఈయన చలమయ్య కొడుకు నందనుడు. ఎన్నో పరీక్షలు నెగ్గి.. ప్రథమ స్థానంలో నిలిచి మన మహారాజు వద్ద ఖజానా అధికారిగా ఎంపికయ్యారు’ అని చెప్పాడు రాజభటుడు. ఆ మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు కోటయ్య. వెంటనే అతని దగ్గరకు వెళ్లి.. ‘క్షమించండి! మీరు రాజాస్థానంలో ఉద్యోగి అని తెలియక అమర్యాదగా ప్రవర్తించాను. నాదొక సందేహం.. మీరు అంతటి ఉద్యోగం చేస్తున్నా.. ఎందుకు మళ్లీ ఈ పని చేస్తున్నారు’ అడిగాడు కోటయ్య. ‘నా చిన్నప్పటి నుంచి.. మా నాన్న ఈ పనే చేస్తున్నారు. చదువుకుంటూనే.. అలా నేను కూడా నేర్చుకున్నాను. చదువుతో ఉద్యోగం సంపాదించాను. కానీ.. చిన్నప్పుడు నేర్చుకున్న వృత్తిని వదల్లేక వారానికి ఒకసారి వచ్చి ఇలా పని చేస్తాను’ అని బదులిచ్చాడు నందనుడు. ఇంతలోనే చలమయ్య అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూసి.. ‘మీరు చాలా అదృష్టవంతులు. మీ అబ్బాయి ఉన్నత విద్య అభ్యసించినా.. మూలాలు మాత్రం మరవలేదు. కోటలో ఉద్యోగం చేస్తున్నా.. కొంచెం కూడా గర్వం లేకుండా వినయంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు నేటి యువతకు ఆదర్శం’ అన్నాడు కోటయ్య. ఆ తర్వాత అతనికి కావాల్సిన పనిముట్లు చలమయ్య, నందనుడు కలిసి తయారు చేసి ఇచ్చారు. అవి తీసుకొని అక్కడి నుంచి మళ్లీ నవ్యపురానికి బయలుదేరాడు కోటయ్య.  

 డి.కె.చదువులబాబు 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని