విరిగిన విమానం బొమ్మ!

‘వినీ! మనం ఈ రోజు నాన్న స్నేహితుడు సురేష్‌ అంకుల్‌ వాళ్ల ఇంటికి భోజనానికి వెళ్తున్నాం. మీతో ఎక్కడికైనా వెళ్లాలంటేనే భయం వేస్తోంది. నేను ఎంత చక్కగా చెప్పినా మీరు వినడం లేదు. నువ్వు, తమ్ముడు అనవసరంగా పెద్ద మాటలు మాట్లాడకండి.

Updated : 21 Jun 2024 06:48 IST

‘వినీ! మనం ఈ రోజు నాన్న స్నేహితుడు సురేష్‌ అంకుల్‌ వాళ్ల ఇంటికి భోజనానికి వెళ్తున్నాం. మీతో ఎక్కడికైనా వెళ్లాలంటేనే భయం వేస్తోంది. నేను ఎంత చక్కగా చెప్పినా మీరు వినడం లేదు. నువ్వు, తమ్ముడు అనవసరంగా పెద్ద మాటలు మాట్లాడకండి. అది కావాలి, ఇది కావాలని గొడవ చేయకుండా బుద్ధిగా ఉండండి’ అంది అమ్మ. వినీల, వినీత్‌ ఒకరి ముఖం మరొకరు చూసుకుని నవ్వుకున్నారు. ‘అమ్మా! అక్కడ సూర్య ఉంటాడుగా, మేము ముగ్గురం కలిసి ఆడుకుంటాం’ అన్నాడు వినీత్‌. సురేష్‌కు ఒక్కడే బాబు, అతడి పేరు సూర్య. వినీల, సూర్య మూడో తరగతి చదువుతున్నారు. వినీత్‌ రెండో తరగతి చదువుతున్నాడు. 

మధ్యాహ్నం నలుగురూ కలిసి సురేష్‌ వాళ్లింటికి భోజనానికి వెళ్లారు. అక్కడ పెద్దవాళ్లందరూ హాల్లో సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ముగ్గురూ లోపల గదిలో ఆట వస్తువులతో ఆడుకుంటున్నారు. ‘వినీత్‌! విమానం బొమ్మ కీ మరీ అంత గట్టిగా తిప్పకు... విరిగిపోతుంది’ అన్నాడు సూర్య. ‘ఏమీ విరగదు లే!’ అంటూ గట్టిగా తిప్పాడు వినీత్‌. బొమ్మకి కీ ఇచ్చే చువ్వ విరిగిపోయింది. అయినా ఎంత మాత్రం పశ్చాత్తాపపడకుండా.. దాన్ని పక్కన పడేసి, మరో బొమ్మ తీసుకున్నాడు.  

‘అయ్యో! నా విమానం బొమ్మ’ అని విరిగిన విమానం బొమ్మను చేతిలోకి తీసుకుని బాధపడ్డాడు సూర్య. మరి కాసేపట్లో వినీల, వినీత్‌ నిర్లక్ష్యంగా ఆడుకుంటూ రెండు బొమ్మలను పాడు చేశారు. ‘వినీ! బొమ్మలతో జాగ్రత్తగా ఆడుకోవాలి. అవి కొనడానికి చాలా డబ్బులు కావాలని మా అమ్మ చెప్పింది. మీరిద్దరూ ఇలా పగలకొడితే బోలెడన్ని డబ్బులు వృథా చేసినట్లే కదా?!’ అని బాధగా అన్నాడు సూర్య. ‘బొమ్మలు ఆడుకోవడానికి కానీ, దాచుకోవడానికి కాదు’ అని పెంకిగా సమాధానం ఇచ్చింది వినీల. 

‘పిల్లలూ! భోజనానికి రండి’ అని అప్పుడే సూర్య వాళ్ల అమ్మ పిలిచింది. వినీల, వినీత్‌ రివ్వున పరుగెత్తుకుంటూ వెళ్లిపోయారు. ‘చేతులు కడుక్కుని రండి’ అని వినీల, వినీత్‌లను వారి అమ్మ వారించినా వినకుండా డైనింగ్‌ టేబుల్‌ కుర్చీల్లో కూర్చుండిపోయారు. సూర్య బొమ్మలన్నీ సర్ది అల్మారాలో పెట్టి, పగిలిన ముక్కలు శుభ్రంగా ఎత్తివేసి చేతులు కడుక్కుని భోజనానికి వచ్చాడు. 

‘ఆంటీ! మీరు పెట్టిన లడ్డూ చాలా బాగుంది. నాకు ఇంకోటి కావాలి’ అని, ఒక చేత్తో లడ్డూ పట్టుకుని మరో చెయ్యి చాపుతూ అంది వినీల. ‘వినీ! అలా అడగకూడదు. నీ చేతిలో ఉంది ముందు తిను’ అని సిగ్గు పడుతూ అంది వినీల వాళ్ల అమ్మ. ‘ఉహూ! నాకు ఇప్పుడే కావాలి!’ అని పేచీ పెట్టింది వినీల. ‘వినీ!’ అని కాస్త కోపంగా అరిచాడు వినీల వాళ్ల నాన్న. 

‘ఫర్వాలేదు లెండి’ అంటూ సూర్య వాళ్ల అమ్మ వినీలకు మరో లడ్డూ ఇచ్చింది. ‘ఆంటీ! నాకు వెళ్లేటప్పుడు బోలెడు లడ్డూలు ఇస్తారా?’ అంది వినీల. ‘ఓ! అలాగే ఇస్తాను’ అని వింతగా చూస్తూ అంది సూర్య వాళ్ల అమ్మ. ‘నాకు కూడా రెండు లడ్డూలు కావాలి’ అన్నాడు వినీత్‌. ఆవిడ వినీత్‌కు కూడా మరొకటి ఇచ్చింది. ఇద్దరూ లడ్డూలను మొత్తం తినకుండా చిదిమేసి టేబుల్‌ మీద, కింద పడేశారు. 

‘మీ ఇద్దరికీ నేను అన్నం తినిపిస్తాను. ఇక్కడ నుంచి లేవండి’ అంది వినీల వాళ్ల అమ్మ. కానీ వాళ్లు వినిపించుకోకుండా... ‘ఆ కూర వేయండి ఆంటీ, ఈ కూర వేయండి ఆంటీ’ అంటూ ప్లేటంతా నింపేసుకుని చిందర వందర చేశారు. వాళ్ల అమ్మనాన్నలిద్దరూ వారించలేక సతమతమయ్యారు. వారి దృష్టి సూర్య మీద పడింది. అతడు వాళ్ల అమ్మ పెట్టినవి గొడవ చేయకుండా పొందికగా తింటున్నాడు. 

వినీత్‌ భోజనాలయ్యాక సోఫా ఎక్కి, కిందకు దూకడం మొదలు పెట్టాడు. వినీల కూడా  తమ్ముడితో పోటీ పడుతూ పైకి కిందకూ పరుగులు తీస్తోంది. ‘ఏంటా ఆటలు?’ అని కోప్పడ్డాడు వినీల వాళ్ల నాన్న. ‘అయితే లోపలకు వెళ్లి ఆడుకుంటాం’ అని ఇద్దరూ గదిలోకి వెళ్లి మంచం మీదకు ఎక్కి, దుప్పటి తొక్కుతూ గెంతులు వేస్తున్నారు. ‘ఇక మనం బయలుదేరుదాం’ అని వాళ్ల అల్లరి భరించలేక లేచి నిలబడ్డారు వినీల వాళ్ల అమ్మ, నాన్న. 

వాళ్లిద్దరూ చాలా బాధపడుతున్నారని అక్కడున్న అందరికీ అర్థమైంది. సూర్య వాళ్ల అమ్మ చెవిలో ఏదో చెప్పాడు. ఆవిడ సరేనన్నట్లు తలాడించి టీవీ ఆన్‌ చేసింది. యూ ట్యూబ్‌లో.. ‘మంచి అలవాట్లు’ అని సూర్య చేసిన వీడియో పెట్టింది. ‘ఇప్పుడు మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన ఓ మంచి అలవాటు గురించి, మా అమ్మ చెప్పింది నేను మీకు వివరిస్తాను. మనం బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు వారి మంచాలు, సోఫాలు ఎక్కి తొక్కకూడదు. వారు తినడానికి ఏదయినా ఇచ్చినప్పుడు థాంక్స్‌ చెప్పి తీసుకోవాలి. పొందికగా కింద పడకుండా తినాలి. మళ్లీ మళ్లీ ఇంకా ఇవ్వమని వారిని అడగకూడదు. అలా చేస్తే మన తల్లిదండ్రులు చాలా అవమానానికి గురవుతారు. మనం పద్ధతిగా మసలుకుంటే బుద్ధిమంతులం అనిపించుకుంటాం. మనం ఎక్కువగా అల్లరి చేసి ఇబ్బంది పెడితే, మళ్లీ వాళ్ల ఇంటికి వస్తు న్నామంటే భయపడతారు’ అని చెబుతున్నాడు ఆ వీడియోలో.

వినీల, వినీత్‌ అది వినగానే వాళ్ల అమ్మనాన్నల వైపు చూశారు. వారిద్దరి కళ్లల్లో బాధ కనిపిస్తోంది. సూర్య అమ్మనాన్నల వైపు చూశారు. వాళ్లు తమను అయిష్టంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇద్దరికీ తమ తప్పులను అందరూ ఎత్తి చూపినట్లు స్పష్టంగా అర్థమైంది. తమతో సమాన వయసులో ఉన్న అబ్బాయి మంచి అలవాట్ల గురించి చెప్పడంతో సిగ్గు పడ్డారు. సూర్య వాళ్ల దగ్గరకు వచ్చాడు. 

‘వినీల, వినీత్‌! మీరు బాధ పడుతున్నారని తెలుస్తోంది. మరోసారి మీ వల్ల అంకుల్, ఆంటీ ఇబ్బంది పడరని ఆశించవచ్చా?’ అని వాళ్ల చేతులు పట్టుకుని అడిగాడు. ‘నువ్వు వీడియోలో చెప్పినట్లు, ఇకపై మేం బుద్ధిగా ఉంటాం’ అని ఒక్కసారే అన్నారిద్దరూ. వినీల అమ్మ, నాన్నలిద్దరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

- కె.వి.సుమలత 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని