story: ఏనుగు దిద్దిన ఎంపిక!

ఒక అడవికి రాజు పులి. అది ఓసారి వనంలోని కళాకారులు, క్రీడాకారులైన జంతువులు, పక్షులకు పురస్కారాలు ఇవ్వాలనుకుంది. కానీ దానికి ఎవరు అర్హులో గుర్తించడానికి సమయం లేకపోయింది.

Published : 22 Jun 2024 05:35 IST

క అడవికి రాజు పులి. అది ఓసారి వనంలోని కళాకారులు, క్రీడాకారులైన జంతువులు, పక్షులకు పురస్కారాలు ఇవ్వాలనుకుంది. కానీ దానికి ఎవరు అర్హులో గుర్తించడానికి సమయం లేకపోయింది. దీంతో ఆ బాధ్యతను మంత్రి ఎలుగుబంటికి అప్పగించింది. ‘ప్రభూ..! చాలా మంచి ఆలోచన. కళాకారులకు పురస్కారాలు.. గుర్తింపునే కాదు, మరింత ప్రతిభను చూపటానికి బాటలు వేస్తాయి. మీరు నిశ్చింతగా ఉండండి. నేను పురస్కారానికి అర్హులైన కళాకారులను ఎంపిక చేస్తాను’ అంది ఎలుగుబంటి. 
 కానీ, ఎలుగుబంటికి కూడా నిజమైన కళాకారులు, క్రీడాకారులు ఎవరో తెలీదు. తనకు పరిచయం ఉన్న నక్కను అడిగి, పేర్లు సేకరించి పులి రాజుకు ఇవ్వాలనుకుంది. నడుస్తూ.. నడుస్తూ.. నక్క కోసం బయలుదేరిందది. చెరువు దగ్గర నీళ్లు తాగుతూ నక్క కనిపించింది. దానికి విషయం చెప్పింది ఎలుగుబంటి.
 ‘ఓస్‌! అదెంత పని, నన్నడుగు చెబుతా!’ అంది నక్క. ‘మిత్రమా! ఈ అడవిలో వేగంగా పరుగులు తీసేదెవరో చెప్పు’ అని అడిగింది ఎలుగుబంటి. ‘ఇంకెవరూ..చెరువు ఒడ్డున కనిపిస్తున్న తాబేలు!’ అంది నక్క. తాబేలు పేరు రాసుకుంది ఎలుగుబంటి. ‘మరి! అడవిలో కమ్మని పాటలు పాడేదెవరు?’ అని మళ్లీ అడిగింది ఎలుగుబంటి. దగ్గరలో ఒంటికాలిపై జపం చేస్తున్న కొంగను చూపింది. ఎలుగుబంటి దాని పేరు కూడా రాసుకుంది. చివరగా.. ‘చక్కగా నృత్యం చేసేదెవరు?’ అని అడిగింది ఎలుగుబంటి. ‘ఇంకెవరూ ముళ్లపంది’ బదులిచ్చిందది. ఎలుగుబంటి ముళ్లపంది పేరు రాసుకుని, పులి రాజుకు ఇవ్వడానికి బయలుదేరింది. 
 దానికి దారిలో మిత్రుడు ఏనుగు కనిపించింది. విషయం తెలుసుకుని... ‘మిత్రమా! ఆ నక్క మాటలు నమ్మి అనర్హులను ఎంపిక చేసుకున్నావు. దాని వల్ల పురస్కారం ఇచ్చినవారికీ విలువ ఉండదు. ఆ పురస్కారానికీ గౌరవం ఉండదు. ఇలారా! నేను చూపిస్తాను!’ అంటూ దాని వెంట తీసుకెళ్లింది ఏనుగు. కాస్త దూరంలో మెరుపువేగంతో పరిగెడుతున్న చిరుతను చూసి ముచ్చట పడింది ఎలుగుబంటి. పైన చెట్టు మీద కమ్మటి స్వరంతో పాటలు పాడుతున్న కోకిలను చూపింది ఏనుగు. పాటలు విని మైమరిచింది. అక్కడే కోకిల పాటకు అందంగా నృత్యం చేస్తున్న నెమలిని చూసి ఆనందపడింది ఎలుగుబంటి. 
‘మిత్రమా! పులిరాజు ఇచ్చే పురస్కారానికి చిరుత, కోకిల, నెమలి అర్హులు. మనం నేరుగా చూడకుండా.. ఇతరులు చెప్పింది విని ఒక నిర్ణయానికి రావద్దని తెలుసుకున్నాను’ అని ఏనుగుకు కృతజ్ఞతలు చెప్పి వెనుదిరిగింది ఎలుగుబంటి. చిరుత, కోకిల, నెమలికి బంగారు కిరీటాలు పెట్టి అభినందించింది పులిరాజు. అడవిలోని జంతువులు, పక్షులు సరైన అర్హులకు పురస్కారాలు అందాయని ఆనందించాయి. పులిరాజు.. కూడా ఎలుగుబంటి ఎంపికను అభినందించింది.

పైడిమర్రి రామకృష్ణ   


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని