story: అంజి ఎలా మారింది..?

ఓ అడవిలోని చింత చెట్టు మీద మారుతి, అంజి అనే రెండు కోతులు, వాటి పిల్లలతో కలిసి ఉండేవి. మారుతి.. సాటి జంతువులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేది. దానికి భిన్నంగా అంజి ఉండేది.

Published : 25 Jun 2024 04:27 IST

 అడవిలోని చింత చెట్టు మీద మారుతి, అంజి అనే రెండు కోతులు, వాటి పిల్లలతో కలిసి ఉండేవి. మారుతి.. సాటి జంతువులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేది. దానికి భిన్నంగా అంజి ఉండేది. అది ఎప్పడూ.. ‘మన కోసం.. మన పిల్లల కోసం బతకాలి. అంతేగానీ ఇతరుల గురించి నీకేందుకు? వాళ్లకు సాయం చేయడం వల్ల మనకేం లాభం! ఇప్పటి నుంచి అందరి బాధలు పట్టించుకోవడం మానేసి.. నీ దారి నువ్వు చూసుకో!’ అని మారుతికి చెబుతుండేది. ప్రతిసారీ.. అంజి సలహాలు విని నవ్వేసి ఊరుకునేదది. 
ఒకసారి ఓ పాము.. కాకి గూడులోని పిల్లలను తినడానికి మెల్లగా వెళ్లడాన్ని గమనించింది మారుతి. వాటిని ఎలాగైనా రక్షించాలనే ఆలోచనతో.. పాముని భయపెట్టడానికి గట్టిగట్టిగా శబ్దాలు చేసింది. దాంతో పాము అక్కడ నుంచి పారిపోయింది. అంతలోనే ఆహారం కోసం వెళ్లిన తల్లి కాకి.. తిరిగొచ్చింది. దాని పిల్లలను కాపాడిన మారుతికి కృతజ్ఞతలు తెలిపింది. ఇదంతా చూసిన అంజి.. ‘ఈ మారుతి ఎప్పుడు మారుతుందో ఏంటో? ఆ పాము కాటు వేసుంటే.. ప్రాణాలు పోయేవి. ఇంకోసారి దీనికి ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు’ అని మనసులో అనుకుంటూ పిల్లలకు ఆహారాన్ని పెట్టడంలో నిమగ్నం అయ్యింది. ఇంతలోనే డప్పు చప్పుడు పెద్దగా వినిపించడంతో.. జంతువులన్నీ ఆసక్తిగా అటువైపు దృష్టి సారించాయి. ఓ నెమలి డప్పు కొడుతూ.. ‘ఇందు మూలంగా సమస్త జంతు జాలానికి తెలియజేయునది ఏమనగా.. రేపు మన అడవిలో వెలసిన శివుని ఆలయం 
దగ్గర జాతర జరుగుతుంది. కాబట్టి అంతా వచ్చి ఆ వేడుకల్లో పాల్గొనాలని మృగరాజు ఆజ్ఞ’ అని చెప్పింది. దాంతో జంతువుల్లో సందడి మొదలైంది. 
ఆ జాతరకు మారుతి, అంజి వాటి పిల్లలతో కలిసి బయలుదేరాయి. అక్కడ దేవుణ్ని దర్శించుకొని.. ఎంచక్కా వాటికి ఇష్టమైన తినుబండారాలు కొనుక్కుని తిన్నాయి. చెరువులో ఈత కొడుతూ సరదాగా గడిపాయి. అప్పటికే సాయంత్రం అవడంతో.. తిరుగు పయనమయ్యాయి. చీకటి పడటంతో వాటికి దారి సరిగ్గా కనిపించడం లేదు. 
‘అందరూ జాగ్రత్తగా నడవండి’ అంటూ హెచ్చరించింది మారుతి. అలా కొంత దూరం నడవగానే.. దూరంగా మిల మిలా మెరుస్తున్న జంతువుల కళ్లు కనిపించాయి. దాంతో అంజి భయపడి పిల్లల్ని గట్టిగా పట్టుకుంది. ‘నువ్వేం భయపడకు మిత్రమా! అవి పెద్దపులులు అయితే కావు. ఎందుకంటే ఒకేసారి అన్ని పులులు వేటకు రావు. నాకు తెలిసినంత వరకు అవి నక్కలు కావచ్చు. మనం ఇలాంటి సమయంలోనే కాస్త తెలివిగా వ్యవహరించాలి’ అంది మారుతి. ‘అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోదామా?’ అంది అంజి. ‘వెనక్కి వెళితే.. అక్కడ పులి రూపంలో ఇంకో ప్రమాదం ఎదురవ్వొచ్చు. ధైర్యంగా ముందుకు వెళ్దాం. నేను పరిగెడుతూ ఉంటాను.. నన్ను అనుసరించండి, ఎక్కడా ఆగొద్దు’ అంటూ ధైర్యం చెప్పింది మారుతి. 
ఇక అవి పరిగెత్తడం ప్రారంభించాయి. వెళుతూ.. ‘పెద్దపులి, సింహాలు కలిసి వేట కోసం ఈ వైపే వస్తున్నాయి. ఈ దారిలో కనిపించిన జంతువుల ప్రాణాలు పోయినట్టే’ అని గట్టిగా అరిచింది మారుతి. అప్పటిదాకా వీటి కోసం చీకట్లో కాపు కాసిన నక్కలు.. ఆ మాటలు విని వెంటనే అక్కడి నుంచి పారిపోయాయి. దాంతో ‘హమ్మయ్యా!’ అంటూ ఊపిరి పీల్చుకున్నాయవి. మొత్తానికి మారుతి, అంజి వాటి పిల్లలతో క్షేమంగా చింతచెట్టును చేరుకుని, ప్రాణాలు దక్కించుకున్నాయి. ‘ఇన్నాళ్లు.. ఇతర జీవులకు నువ్వు సాయం చేస్తుంటే.. తక్కువ చేసి మాట్లాడాను. చేయొద్దని వారించాను. కానీ ఈ రోజు నువ్వు చేసిన సాయం వల్లే నేను, నా పిల్లలు ప్రాణాలతో ఉన్నాం. నువ్వు గానీ ధైర్యం చెప్పి పరిగెత్తించకపోతే, అక్కడే ఆగిపోయి వాటికి ఆహారం అయ్యే వాళ్లం. నీకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే’ అంది అంజి. ‘పక్కనే ఉంటూ ఒకరికి ఒకరం సాయం చేసుకోకపోతే ఎలా? నాకు అవకాశం వచ్చింది.. చేశాను. నువ్వు కూడా ఎవరికైనా సాయం చేయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా చేయి’ అని చెప్పింది మారుతి.  

వడ్డేపల్లి వెంకటేశ్‌  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని