story: జ్ఞాపకమై నీతో ఉంటా..!

అవంతీపురంలో రాము అనే పిల్లాడు ఉండేవాడు. తను ఎవరితోనూ తొందరగా కలిసేవాడు కాదు. దాంతో తనకు ఎక్కువగా స్నేహితులు లేకపోవడంతో ఒంటరిగానే ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే నిద్ర లేచి.. వాళ్ల ఇంటి వెనకాల ఉన్న చిన్న మామిడిచెట్టు కిందకు వెళ్లి కూర్చున్నాడు.

Published : 04 Jul 2024 01:19 IST

వంతీపురంలో రాము అనే పిల్లాడు ఉండేవాడు. తను ఎవరితోనూ తొందరగా కలిసేవాడు కాదు. దాంతో తనకు ఎక్కువగా స్నేహితులు లేకపోవడంతో ఒంటరిగానే ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే నిద్ర లేచి.. వాళ్ల ఇంటి వెనకాల ఉన్న చిన్న మామిడిచెట్టు కిందకు వెళ్లి కూర్చున్నాడు. ‘నాకు స్నేహితులు ఎవరూ లేరు. ఎప్పుడూ నేను ఒంటరిగానే ఉంటున్నాను. నాతో ఎవరూ సరిగ్గా మాట్లాడరు’ అని తనలో తానే మాట్లాడుకోసాగాడు రాము. అతని బాధను గ్రహించిన ఆ చిన్న చెట్టు.. ‘నేను ఉన్నాను కదా! నాతో మాట్లాడు. నాతో స్నేహం చేయి’ అని బదులిచ్చింది. దాంతో రాము ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇదేంటీ.. ఇక్కడ ఎవరూ లేరు, కానీ మాటలు మాత్రం వినిపిస్తున్నాయి అనుకుంటున్నాడు. ‘నేను.. చెట్టుని మాట్లాడుతున్నాను’ అని చెప్పింది చెట్టు. ‘నువ్వు కూడా మాట్లాడతావా? నాతో స్నేహం చేస్తావా?’ అని ఆనందంగా అడిగాడు రాము. ‘హా..! మాట్లాడతాను.. అంతేకాదు నీకు నీడనిస్తాను. కొన్ని రోజులైతే.. ఎంచక్కా మామిడిపండ్లు కూడా ఇస్తాను’ అంది చెట్టు. ఇక అప్పటి నుంచి రాము, ప్రతిరోజూ చెట్టు దగ్గరకు వెళ్లి మాట్లాడుతూ ఉండేవాడు. దానికి ప్రతిరోజు నీళ్లు పోస్తూ చక్కగా చూసేవాడు. అలా కొద్దిరోజుల్లోనే చెట్టుతో మంచి స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు.

అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రాము పెద్దవాడు అవుతున్నాడు.. చెట్టు కూడా పెరుగుతోంది. కాస్త పనులు ఎక్కువవ్వడంతో.. మెల్లమెల్లగా చెట్టు దగ్గరకు వెళ్లడం, దానితో మాట్లాడటం తగ్గించేశాడు రాము. కానీ.. తనకు ఎప్పుడు బాధ కలిగినా, సంతోషం కలిగినా.. కచ్చితంగా వెళ్లి చెట్టుతో పంచుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత రాము వాళ్ల నాన్న ఉద్యోగరీత్యా.. వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. చెట్టును వదిలి వెళ్లడం ఇష్టం లేకపోయినా.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఒక రెండుమూడేళ్ల తర్వాత.. వేసవి సెలవులకు మళ్లీ ఆ ఇంటికి వచ్చాడు. వెంటనే పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరకు వెళ్లాడు.. అది పెద్దగా అయింది. మామిడిపండ్లు కూడా కాశాయి. రాముని చూడగానే చెట్టు.. ‘రా మిత్రమా! ఎన్ని రోజులైంది నిన్ను చూసి.. ఎలా ఉన్నావు?’ అని పలకరించింది. ‘నేను చాలా బాగున్నా? రోజూ నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నేను ఇంకా గుర్తున్నానా?’ అన్నాడు రాము. ‘ఎందుకు గుర్తుండవు.. ప్రతిరోజూ ఎంచక్కా కబుర్లు చెప్పేవాడివి కదా! నాకు నీళ్లు కూడా పోసేవాడివి’ అని బదులిచ్చింది చెట్టు. రాము.. అలా అక్కడ ఉన్నన్ని రోజులూ.. చెట్టుతో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడపసాగాడు.

రాము వాళ్ల నాన్న.. ఇక మళ్లీ ఇక్కడికి రావాల్సిన పనేం లేదు కదా! అని ఆ ఇల్లుని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో పాటు ఆ చెట్టును కూడా.. కానీ అది రాముకు ఏమాత్రం నచ్చలేదు. కానీ వాళ్ల నాన్నతో గట్టిగా చెప్పలేకపోయాడు. అక్కడ ఉన్న రోజుల్లోనే ఆ ఇల్లుని అమ్మేశాడు రాము వాళ్ల నాన్న. ఇక చెట్టును ఎప్పుడూ చూడలేనని రాము చాలా బాధ పడ్డాడు. అక్కడి నుంచి వెళ్లే ముందు రోజు.. చెట్టు దగ్గర కూర్చోని బోరున ఏడవసాగాడు. అప్పుడు చెట్టు మాట్లాడుతూ.. ‘మిత్రమా! ఏడవొద్దు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి’ అంది. ‘ఇక నిన్ను నేను చూడలేను, కలవలేను కదా.. అందుకే చాలా బాధగా ఉంది’ అని బదులిచ్చాడు రాము. ‘అదేం లేదు.. నేను ఎప్పుడూ నీతోనే ఉంటా’ అంది చెట్టు. ‘అదెలా?’ అని ఆశ్చర్యంగా అడిగాడు రాము. ‘ముందు మనం స్నేహితులం అయినప్పుడు నీకు నీడనిచ్చాను.. ఇప్పుడు నువ్వు వచ్చేసరికి పండ్లను ఇచ్చాను. ఇప్పుడు మీరు వెళ్లిపోతే.. వచ్చిన వాళ్లు నన్ను నరికేస్తారు. కాబట్టి మీ నాన్నకు చెప్పి.. నాలో కొంత భాగాన్ని నరికించి.. ఎంచక్కా నీకు స్టడీ చెయిర్‌ చేయించమని చెప్పు.. అప్పుడు నేను నీతోనే ఓ జ్ఞాపకంగా ఉంటాను కదా!’ అంది చెట్టు. ఆ మాటలు విన్న రాముకి.. చెట్టును నరకడం ఇష్టం లేకపోయినా.. దాని జ్ఞాపకం కోసం వాళ్ల నాన్నతో చెప్పి కుర్చీ చేయించుకున్నాడు. ‘నిజంగా చెట్టు ఎంత మంచిదో.. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు మంచి స్నేహితుడు అయింది.. నీడనిచ్చింది, పండ్లనిచ్చింది.. తను చనిపోతూ కూడా నాకు కుర్చీగా మారింది’ అని మనసులోనే అనుకుంటూ.. కృతజ్ఞతా భావంతో ఉండేవాడు రాము.

చిట్యాల రవీందర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు