story: కుందేలు సమయస్ఫూర్తి..!

దేవీవనంలో హరితం అనే కుందేలు ఉండేది. అది చాలా తెలివైంది. ఒకరోజు సరదాగా గుబురుగా ఉన్న చెట్ల కింద నడుస్తూ వెళ్లసాగింది. ఉన్నట్లుండి దాని మీద.. పై నుంచి ఏదో బిందువు రాలింది. అదేంటని.. తీక్షణంగా చూసింది కుందేలు.

Published : 05 Jul 2024 01:46 IST

దేవీవనంలో హరితం అనే కుందేలు ఉండేది. అది చాలా తెలివైంది. ఒకరోజు సరదాగా గుబురుగా ఉన్న చెట్ల కింద నడుస్తూ వెళ్లసాగింది. ఉన్నట్లుండి దాని మీద.. పై నుంచి ఏదో బిందువు రాలింది. అదేంటని.. తీక్షణంగా చూసింది కుందేలు. కాస్త జిగురుగా అనిపించేసరికి.. ఏంటని తల పైకెత్తి చూసింది. అక్కడ దానికి పెద్ద తేనెపట్టు కనిపించింది. దాని నుంచి తేనె బిందువులు ఒక్కొక్కటిగా కింద రాలుతున్నాయి. ఎలాగైనా ఆ తేనెను పట్టుకోవాలనుకుంది హరితం. దాని కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే.. దూరంగా ఒక బాదం చెట్టు కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి నాలుగు పెద్ద ఆకులు తీసుకొచ్చింది. వాటికి ఎండు పుల్లలు గుచ్చి.. దొన్నెలా తయారు చేసింది. తేనె చుక్కలు పడుతున్న చోట ఆ దొన్నెను పెట్టింది. అది నిండే వరకు ఎంచక్కా అక్కడే ఆడుకోసాగింది హరితం. సాయంత్రానికి అది పూర్తిగా నిండింది. ఇక అక్కడే కూర్చొని తిందామనుకునేసరికి.. చిన్నగా వర్షం మొదలైంది. ‘అమ్మో! ఇప్పుడు ఇక్కడే ఉంటే.. తేనె మొత్తం పాడైపోతుంది. ఇంటికెళ్లి చక్కగా ఆస్వాదిస్తూ తింటాను’ అనుకొని, అక్కడి నుంచి బయలుదేరింది హరితం. 
అలా కాస్త దూరం వెళ్లగానే.. వర్షం ఎక్కువైంది. ఇక ఏం చేయాలో తోచక.. దగ్గర్లో కనిపించిన గుహలోకి వెళ్లింది. అక్కడ మృగరాజు సింహం, పులి మంత్రి, తోడేలు కూర్చొని ఉన్నాయి. వాటిని చూడగానే ఒక్కసారిగా హరితం భయపడిపోయింది. వెంటనే వెనుదిరిగి వెళ్లిపోదాం అనుకునేసరికి.. సింహం హరితాన్ని చూసేసింది. ‘ఏంటి కుందేలు ఇలా వచ్చావు? గతంలో మీ తాత మా తాతయ్యని మోసం చేసి బావిలో పడేలా చేశాడు. అందుకు పరిహారంగా.. నువ్వు నాకు ఆహారంగా మారడానికి వచ్చావా?’ అని వెటకారంగా అంది సింహం. ఆ మాటలకు హరితం బెదిరిపోయింది. కానీ ఎలాగైనా తప్పించుకోవాలని ఓ పథకం వేసింది. ‘ప్రభూ! మా తాత చేసిన తప్పునకు పరిహారంగా నన్ను తినాలని మీరు అనుకుంటున్నారు. నేను అసలు మీ పంటి కింద ఒక మూలకు కూడా రాను. కానీ మిమ్మల్ని మరింత బలవంతులను చేయడానికి మంత్రించిన తేనె తెచ్చాను’ అని.. దాని చేతిలో ఉన్న తేనె చూపించింది హరితం. అది చూసి.. ‘నువ్వు కూడా నన్ను మోసం చేయాలని చూడటంలేదు కదా!’ అని అనుమానంగా అడిగింది సింహం. ‘మృగరాజా! మోసం చేస్తే.. మీరు నన్ను చంపేస్తారని తెలిసి.. నేను అంత సాహసం చేస్తానా?’ అని బదులిచ్చింది హరితం. అయితే ఇవ్వు.. ఆ తేనె ఇప్పుడే తాగేస్తాను’ అంటూ ముందుకు వచ్చింది సింహం. అప్పుడు హరితం.. ‘ప్రభూ! ఒక చిన్న మనవి. ఈ తేనెలో తోడేలు తోకను ముంచి తింటేనే పని చేస్తుందని మా అమ్మ చెప్పింది’ అంది. 

ఆ మాటలు విన్న తోడేలు కంగారుపడి.. అక్కడి నుంచి పారిపోయింది. ‘పులీ! నేను తోడేలు తోకతో తిరిగి వస్తాను. నేను వచ్చే వరకు నువ్వు కుందేలుకు కాపలా ఉండు’ అని చెప్పి తోడేలు వెనకాలే పరుగులు తీసింది సింహం. పులి అక్కడే ఉండటంతో, దాని నుంచి తప్పించుకోవాలని.. ‘మంత్రివర్యా! ఈ తేనె మృగరాజుకు మాత్రమే కాదు. మీకు కూడా పని చేస్తుంది. మీరు బలవంతులు అయ్యి.. ఈ అడవిని పాలించవచ్చు. తోడేలు తోకను మీరు ముందు తీసుకొని వస్తే.. ఎంచక్కా మీరే తాగేయొచ్చు. ఆలస్యం చేయకుండా వెళ్లండి’ అంది హరితం. ఆ మాటలు విని.. వెనకా ముందూ ఆలోచించకుండా తోడేలు తోక కోసం పరిగెత్తింది పులి. ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా.. సమయస్ఫూర్తితో వ్యవహరించి, కుందేలు తను కష్టపడి సంపాదించిన తేనెతో పాటు ఆ జీవుల బారి నుంచి తప్పించుకుంది.              

కె.వి.సుమలత 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని