story: నక్క మోసం... మృగరాజు శిక్ష!

ఒక అడవిలో జంతువులన్నీ ఐకమత్యంగా, సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనానికి రాజు సింహం. అది సక్రమమైన పరిపాలనతో, అడవిని కాపాడుతూ ఉండేది. ఒక రోజు సాయంత్రం జంతువులతో మృగరాజు పిచ్చాపాటి సమావేశంలో ఉంది. అప్పుడు పక్క అడవి నుంచి, ఒక నక్క గాయాలతో అక్కడికి చేరింది.

Published : 06 Jul 2024 02:09 IST

క అడవిలో జంతువులన్నీ ఐకమత్యంగా, సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనానికి రాజు సింహం. అది సక్రమమైన పరిపాలనతో, అడవిని కాపాడుతూ ఉండేది. ఒక రోజు సాయంత్రం జంతువులతో మృగరాజు పిచ్చాపాటి సమావేశంలో ఉంది. అప్పుడు పక్క అడవి నుంచి, ఒక నక్క గాయాలతో అక్కడికి చేరింది. సింహం, నక్కను చూసి... ‘ఎవరు నువ్వు? గాయాలేంటి? ఈ అడవికి ఎలా వచ్చావు?’ అని అడిగింది.

అప్పుడు ఆ నక్క... ‘మహారాజా! నేను పక్క అడవిలో ఉంటాను. మా వనంలో జంతువులన్నీ కలసి నాపై దాడి చేసి ఆ అడవి నుంచి వెళ్లగొట్టాయి. తమరు దయగల మహా ప్రభువులు... అని తెలిసి మీ దగ్గర ఆశ్రయం ఇస్తారని గట్టి నమ్మకంతో ఇలా వచ్చాను’ అని చెప్పింది. ఆ మాటలు విన్న సింహం... ‘సరే.. నువ్వు కూడా మాతో పాటు ఈ అడవిలో సంతోషంగా ఉండొచ్చు’ అని హామీ ఇచ్చింది. కానీ ఇదంతా చూస్తున్న పులికి, నక్క మాటల మీద అనుమానం కలిగింది. వెంటనే... ‘మృగరాజా! ఈ నక్క మాటల్లో ఎంతవరకు సత్యం ఉందో గ్రహించకుండా, హామీ ఇవ్వడం మంచిది కాదనిపిస్తోంది. అసలు అక్కడి జంతువులన్నీ ఈ నక్కను ఎందుకు వెళ్లగొట్టాయో తెలుసుకోవాలి కదా?!’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది.

‘ఈ నక్కను చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తోంది. ఇది ఏ తప్పూ చేయకపోయినా, అక్కడి జంతువులు దీన్ని తరిమికొట్టాయి. కాబట్టి ఇంకెవరూ ఏమీ మాట్లాడకండి’ అని సింహం హెచ్చరించింది. ఆ మాటలకు మిగతా జంతువులు ఏమీ మాట్లాడకుండా తమ తమ నివాసాలకు వెళ్లిపోయాయి. పులికి మాత్రం మృగరాజు చేసిన పని నచ్చలేదు. అక్కడి నుంచి కాస్త బాధతో వెనుదిరిగింది.

నక్క మరుసటి రోజు నుంచి మృగరాజు మెప్పు కోసం ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్లు చెప్పడం ప్రారంభించింది. ఎల్లప్పుడూ మృగరాజుతో నమ్మినబంటులా సహవాసం చేసేది. సింహం నక్కను పూర్తిగా నమ్మి, మిగిలిన జంతువుల మాటలను వినేది కాదు. కనీసం అప్పట్లో ఉండే కాలక్షేప సమావేశాలు కూడా నిర్వహించడం మానేసింది. మెల్లమెల్లగా ఆ అడవిలో సంతోషం దూరమవుతూ వచ్చింది. జంతువుల్లో కూడా ఐకమత్యం సన్నగిల్లింది. అయినా మృగరాజు ఏమీ పట్టించుకునేది కాదు. పులి ఇదంతా సహించలేక, ఒకరోజు సింహం దగ్గరకు వెళ్లి... ‘ఈ నక్క మన అడవికి సంతోషాన్ని దూరం చేయడానికే వచ్చినట్టుంది. ఆ వనంలో ఈ నక్క ప్రవర్తన సరిగా లేకపోవడం వల్లే, కొట్టి తరిమినట్లు ఉన్నాయి. దయచేసి ఇకనైనా ఈ నక్క మాయమాటలకు మోసపోవద్దు’ అని ఎంత చెప్పినా మృగరాజు వినిపించుకోలేదు. చివరికి చేసేదిలేక పులి వెనుదిరిగి వెళ్లి, మిగతా జంతువులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసింది.

‘మన రాజు ఆ నక్క మాయలో పూర్తిగా పడిపోయింది. మన అడవిలో మళ్లీ పాతరోజులు రావాలంటే మనమంతా ఏకమై నక్క కపటబుద్ధి మన రాజుకు తెలిసేలా చేయాలి’ అంటూ, నక్క కదలికలను రహస్యంగా గమనించమని గుడ్లగూబకు చెప్పింది. జంతువులు కూడా పులి మాటలకు కట్టుబడి.. ‘మన అడవిని, మన రాజును మనమే కాపాడుకుందాం’ అని వెళ్లిపోయాయి. మరునాడు నక్క సింహంతో... ‘రాజా! మీకు మంచి ఆహారం ఇక్కడికి కొంత దూరంలో ఉంది. ఒక గుడ్డి అడవి దున్న అటుగా వెళ్లడం చూశా. మీరు దానిపై దాడి చేసి తినొచ్చు’ అని చెప్పింది. సింహం నక్క మాటలు నమ్మి తనతో వెళ్లింది. నక్క కదలికలు గమనిస్తున్న గుడ్లగూబ వాటిని అనుసరిస్తూ శబ్దం చేయకుండా వెళ్లింది. నక్క సింహాన్ని అడవి చివరి వరకు తీసుకువెళ్లింది. కాసేపటికి పక్క అడవిలోని సింహం అకస్మాత్తుగా మృగరాజుపై దాడి చేసింది.
పరిస్థితి అర్థం కాక, పైగా చాలా దూరం నడవటం వల్ల బిత్తరపోయింది మృగరాజు. నక్క మోసాన్ని తెలుసుకోలేకపోయినందుకు బాధపడింది. పక్క అడవి సింహం దెబ్బలకు మృగరాజు తాళలేకపోయింది. ఇంతలోనే పులి, ఇతర జంతువులు వచ్చి, పక్క అడవి సింహంపై దాడి చేసి.. మృగరాజును కాపాడుకున్నాయి. పారిపోతున్న నక్కను పట్టుకుని మృగరాజు ఒకే ఒక్క పంజా దెబ్బతో చంపేసింది. తనను కాపాడిన పులి, ఇతర జంతువులను మృగరాజు క్షమాపణలు కోరింది. ‘ఇకపై ముందులాగే మనందరం సంతోషంగా, ఐకమత్యంతో ఉందాం. మోసం చేసేవారు మనతోనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తారు. చెప్పుడు మాటలు అసలు ఎప్పుడూ వినకూడదని తెలుసుకున్నాను. అంతేకాకుండా ఐకమత్యంగా ఉన్నంతకాలం మనకు ఎటువంటి ప్రమాదం రాదు అని గ్రహించాను. ఈ రోజు మీరంతా నాకు అండగా ఉండడం వల్లే నేను బతికాను’ అంటూ అందరికీ కృతజ్ఞతలు చెప్పింది.

పుల్లట సంతోష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని