story: ఉడుతా ఉడుతా ఊచ్‌... ఆ వజ్రాలు దొరికాయోచ్‌!

పూర్వం గంగానదీ తీరాన సువర్ణ రాజ్యం ఉండేది. దానికి ఆనుకుని ఓ దట్టమైన అడవి ఉండేది. అక్కడ ఓ చెట్టు మీద ఉడుత ఒకటి నివసించేది.

Published : 07 Jul 2024 02:46 IST

పూర్వం గంగానదీ తీరాన సువర్ణ రాజ్యం ఉండేది. దానికి ఆనుకుని ఓ దట్టమైన అడవి ఉండేది. అక్కడ ఓ చెట్టు మీద ఉడుత ఒకటి నివసించేది. అది ఒక రోజు చెట్టు మీద నుంచి కిందకు దిగి, ఏదో వెతకడం మొదలుపెట్టింది. అదే చెట్టు మీద ఉన్న కాకి.. ‘ఓ ఉడుత మామా! నువ్వు దేని కోసం వెతుకుతున్నావు?’ అని అడిగింది.

‘అది తెలిస్తే ఇంకేం. మొన్న రాత్రి ఇక్కడే ఎక్కడో భూమిలో కప్పెట్టాను. దాని కోసమే వెతుకుతున్నాను’ అని సమాధానం ఇచ్చింది ఉడుత. ‘అదే దేని కోసం?’ అని మళ్లీ ప్రశ్నించింది కాకి. ‘జ్ఞాపకం రావడం లేదు. కానీ అది చాలా విలువైనది’ అంది. ‘ఏం దాచావో తెలియదు. ఎక్కడ దాచావో తెలియదు. కానీ.. ఈ వెతుకులాట ఏంటో?’ అంది, అప్పుడే అక్కడికి వచ్చిన కుందేలు.

‘పోనీలే... మాలాంటి వాళ్లం బయటకు వెళ్తాం. అది ఎక్కడికీ వెళ్లదు కదా! దానికి ఏమీ తోచదు. అందుకే ఇలాంటి పనేదో పెట్టుకుని కాలక్షేపం చేస్తుంది’ అంది కాకి. ‘నిజమే.. పాపం దానికి ఏమీ తోచదు’ అంది అదే చెట్టు మీద గూడు కట్టుకున్న కొంగ. వెతికి వెతికి.. అలసిపోయిన ఉడుతకు ఓ తీయని దుంప ఇచ్చింది కుందేలు. ‘చూడండి! ఎప్పటికైనా నేను దాన్ని వెతికి పట్టుకుంటాను. అప్పుడు మీరంతా నన్ను పొగుడుతారు’ అంది ఉడుత. ‘ఆ రోజు త్వరగా రావాలనే కోరుకుంటున్నా’ అంది కుందేలు. కొంగ, కాకి నవ్వుకున్నాయి. ‘ఉడుత ఇలా వెతకడం ఇది మొదటి సారి కాదు. ఎప్పుడూ దేని కోసమో వెతుకుతూనే ఉంటుంది’ అంది కాకి.

ఒక రోజు ఉదయం పక్షులు, జంతువులు చెట్టు కింద గుమిగూడడం చూసింది కాకి. ఎవరికి ఏమైందో.. అనుకుంటూ అక్కడికి వెళ్లింది. ఉడుత ముఖం విజయ గర్వంతో వెలిగిపోతోంది. ‘నేను వెతుకుతోంది దొరికింది’ అంటూ తళతళ మెరుస్తున్న ఓ రాయిని చూపించింది. ‘ఇది వజ్రం.. దీన్ని నువ్వు దాచటం ఏంటి? అసలు ఇది నీకు ఎక్కడిది’ అంది కాకి. ‘అవన్నీ మనం మృగరాజు దగ్గర చర్చిద్దాం’ అన్నాయి జంతువులు, పక్షులు. ‘నిజమే! ఇది పెద్ద వ్యవహారం. రాజుకు తెలియడమే మంచిది’ అంది కాకి.

అవన్నీ ఆ వజ్రంతో మృగరాజును కలిశాయి. దాన్ని నిశితంగా పరిశీలించింది మృగరాజు. మంత్రైన ఏనుగు కూడా ఆలోచనలో పడింది. ‘రాజా! మీకు జ్ఞాపకం ఉందా..? సువర్ణ రాజ్యం రాజు విహారానికి వచ్చినపుడు తన వజ్రాల పెట్టె పోగొట్టుకున్నాడని అడవి అంతా గాలించాడు. అప్పుడు మనలో చాలా మందిని హింసించారు కూడా!’ అంది నక్క. ‘అవును! జ్ఞాపకం వచ్చింది. అప్పట్లో మనం ఈ అడవి వదిలి వెళ్లిపోవాలని అనుకున్నాం’ అని అంది ఏనుగు.

‘ఇది ఆ వజ్రాల్లోనిదే కావచ్చు. ఇప్పుడు ఇది మన దగ్గర ఉందని తెలిస్తే, మళ్లీ మనకు ప్రమాదం’ అంది కుందేలు. ‘అసలు ఇది ఎక్కడ దొరికింది?’ అని ప్రశ్నించింది మృగరాజు. జంతువులన్నీ కలిసి ఉడుతను ముందుకు నెట్టాయి. ‘మృగరాజా! నాలుగు రోజుల క్రితం నేను దుంపల కోసం వెతుకుతుంటే ఇది భూమిలో దొరికింది. అప్పుటికే జంతువులన్నీ ఆహారం కోసం అడవిలోకి వెళ్లాయి. వచ్చాక చెబుదాంలే అని దీన్ని అక్కడే భూమిలో పాతిపెట్టి, మరచిపోయాను. ఈ రోజు వెతుకుతుంటే దొరికింది’ అంది ఉడుత.

‘ఇదొక్కటేనా! ఇంకా దొరికాయా!’ అంది మృగరాజు. ‘లేదు.. మహారాజా..! ఇదొక్కటే దొరికింది’ అని సమాధానం ఇచ్చింది ఉడుత. సరే అంతా కలిసి ముందు ఉడుతకు ఈ వజ్రం దొరికిన చోట  వెతకండి. నిజంగా ఆ వజ్రాల పెట్టె దొరికితే, అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అంత వరకు ఈ విషయం ఎక్కడా మాట్లాడకండి’ అంది మృగరాజు.

‘సరే మృగరాజా!’ అంటూ ఆ జంతువులు, పక్షులు ఉడుత చెప్పిన చోట వజ్రాల వేట మొదలుపెట్టాయి. ఆ చుట్టు పక్కల పొదలు, చెట్టు తొర్రలు, గుట్టలు అన్నీ వెతికాయి. ఒకచోట మరొక వజ్రం కనిపించింది. తర్వాత కాసేపటికి అక్కడే భూమిలో ఒక పెట్టెలో మరో పది దొరికాయి. అన్నీ కలిసి వాటిని మృగరాజు చెంతకు చేర్చాయి.

‘ఇవి చాలా విలువ కలిగినవి. అందుకే మహారాజు చాలా కాలం మన అడవి అంతా గాలించారు. కానీ వాళ్లకు ఇవి దొరకలేదు. మనం ఏదో ఒక విధంగా వీటిని మహారాజుకు అప్పగించాలి’ అంది మృగరాజు. ‘మేము ఉండే చెట్టు మీదే కొంగలు నివాసం ఉంటున్నాయి. వాటిలో కొన్ని ఒక్కొక్క వజ్రంతో నగరానికి చేరి మహారాజు మందిరంలో వేస్తాయి. ఇక అప్పుడు రాజు కూడా చాలా కాలం క్రితం పోయిన వజ్రాలు మనమే పంపామని అనుకుంటారు. కొంగలకు కూడా ఏ హానీ తలపెట్టరు’ అంది కుందేలు. ‘బాగుంది నీ ఆలోచన. ముందుగా ఆ కొంగల్లో తెలివైనదాన్ని నగరానికి వెళ్లి, రాజు శయన మందిరం గురించి తెలుసుకుని రమ్మను. తర్వాత వజ్రాలు పంపుదాం’ అంది మృగరాజు.

ఒక కొంగ అప్పుడే నగరానికి వెళ్లి.. రాజు శయన మందిరం దగ్గర ఒక చెట్టు మీద వాలింది. అది చాలా పెద్ద మందిరం. కిటికీలు తెరిచి ఉన్నాయి. కిటికీ ఎదురుగా రాజు నిద్రించే పెద్ద హంసతూలికా తల్పం కనిపించింది. అక్కడ బయట తప్ప, లోపల పెద్దగా కాపలా కూడా లేదు. సాయంత్రం రాజు అక్కడికి వస్తారని తెలుసుకుంది.

ఒకరోజు కొంగలన్నీ అక్కడ దగ్గర ఉన్న చెట్టు మీద వాలాయి. మరుసటి రోజు మృగరాజు అనుమతితో పన్నెండు కొంగలు, ఒక్కో వజ్రం పట్టుకుని నగరానికి చేరాయి. రాజు శయన మందిరానికి వచ్చారని తెలుసుకుని, ఆయన పడకపై వజ్రాలను వదిలాయి. కిటికీ దగ్గర ఉండి ఇదంతా చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. ‘తాను ఎప్పుడో పోగొట్టుకున్న పన్నెండు విలువైన వజ్రాలను కొంగలు ఇప్పుడు తీసుకు వచ్చి ఇవ్వడం ఏంటి?’ అని అనుకున్నాడు. అతను తేరుకోక ముందే కొంగలన్నీ కిటికీ నుంచి బయటకు వచ్చి అడవి వైపు వెళ్లిపోయాయి.

విషయం తెలిసి మంత్రి, రాజ గురువు అక్కడకు వచ్చారు. ‘మహారాజా! ఆ జంతువులు, పక్షులు ఎంత తెలివైనవో కదా! ఆ వజ్రాల కోసం మనం ఒకప్పుడు వాటిని హింసించాం. వాటికి అవి దొరకగానే.. అవి విలువైనవని, మీకు చెందినవని తెలుసుకుని ఇక్కడకు చేర్చాయి. ఇక ఆ అడవిలో జంతువులు, పక్షులకు హాని కలగకుండా ఉత్తర్వులు ఇవ్వడం మన బాధ్యత’ అన్నాడు మంత్రి. ‘ఈ రోజు నుంచి మన రాజ్యంలో వేట నిషేధిస్తున్నాం’ అని రాజు చాటింపు వేయించమన్నాడు. అది విన్న కాకి, ఈ విషయాన్ని మృగరాజుకు చెప్పడానికి ఆనందంగా బయలుదేరింది.

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని