Kids Story: కిరీటి వదిలిన బాణం!

అవంతిక రాజ్యాన్ని సమీరవర్మ పరిపాలించేవాడు. ఒకరోజు ఆయన రాజధాని నగరంలో అశ్వంపై వెళ్తుండగా ఎక్కడి నుంచో ఒక బాణం వేగంగా గాలిని చీల్చుకుంటూ వచ్చింది. కన్నుమూసి తెరిచేలోగా ఆయన తల మీదుగా దూసుకెళ్లింది.

Published : 08 Jul 2024 01:04 IST

వంతిక రాజ్యాన్ని సమీరవర్మ పరిపాలించేవాడు. ఒకరోజు ఆయన రాజధాని నగరంలో అశ్వంపై వెళ్తుండగా ఎక్కడి నుంచో ఒక బాణం వేగంగా గాలిని చీల్చుకుంటూ వచ్చింది. కన్నుమూసి తెరిచేలోగా ఆయన తల మీదుగా దూసుకెళ్లింది. పక్కనే ఉన్న మంత్రి, రక్షకభటులు ఒక్కక్షణం దిగ్భ్రాంతికి లోనయ్యారు. మంత్రి వెంటనే తేరుకుని... ‘మహారాజా! అదృష్టం కొద్దీ ఆ బాణం గురి తప్పినట్లుంది. లేకుంటే మీ తలకు తగిలి ప్రాణం పోయేది. పెద్ద ప్రమాదం తప్పింది’ అన్నాడు.

భటులు బాణం దూసుకొచ్చిన దిశగా పరిగెత్తారు. చేతిలో విల్లు, బాణాలతో ఉన్న ఓ యువకుడిని బంధించారు. ఆ యువకుడు ఏదో చెప్పబోతే వినిపించుకోకుండా... ‘నీకు ఎంత ధైర్యం? రాజు మీద హత్యాయత్నం చేస్తావా?’ అంటూ బంధించి చెరసాలలో వేశారు. ఇక అక్కడ ఎక్కువ సమయం ఉండడం క్షేమం కాదని రాజు, మంత్రి రాజభవనానికి చేరుకున్నారు.   కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రక్షణాధికారిని పిలిపించి ఆ యువకుడి గురించి అడిగాడు రాజు. ‘మహారాజా! మీపైన హత్యాయత్నం ఎందుకు చేశాడో, దీని వెనుక ఎవరున్నారో.. ఎంత అడిగినా నిజం చెప్పడం లేదు. ఏదో కట్టుకథ చెబుతున్నాడు’ అన్నాడు రక్షణాధికారి. రాజు సాయంకాలం సభ ఏర్పాటు చేశారు. రక్షణాధికారి ఆ యువకుడిని సభలో ప్రవేశపెట్టాడు.

‘ఎవరు నువ్వు? నాపై హత్యాయత్నం ఎందుకు చేశావు? నిన్ను ఎవరు పంపారు?’ అని అడిగాడు సమీరవర్మ. ‘మహారాజా! నా పేరు కిరీటి. నేను మీ పైన హత్యాయత్నం చేయలేదు. ఒక డేగ పెద్ద సర్పాన్ని కాళ్లతో పట్టుకుని పైన ఎగురుతుండగా అది జారి కిందపడడం నా కంట పడింది. పాము మీ మీద పడబోవడం గమనించి, వెంటనే బాణం వదిలాను. అది ఆ సర్పంలో దిగి, దాన్ని దూరంగా తీసుకెళ్లింది. అది మీ మీద పడి కాటు వేసి ఉంటే మీ ప్రాణాలు గాలిలో కలిసి పోయేవి. ఈ విషయం నేను రక్షణాధికారికి చెప్పాను. నమ్మకుండా కట్టుకథ చెబుతున్నానని, నిజం చెప్పమని హింసించాడు’ అని వివరించాడు ఆ యువకుడు.

రాజు పదిమంది రాజభటులను పిలిచి.. ‘కిరీటి బాణం వదిలిన చోట చుట్టుపక్కల వెదకండి. బాణం, సర్పం కనిపిస్తే తీసుకునిరండి’ అని చెప్పి పంపాడు. వాళ్లు వెళ్లి వెతకగా రహదారి పక్కన మొక్కల మధ్య బాణం దిగి చనిపోయి ఉన్న సర్పం కనిపించింది. దాన్ని తీసుకుని సభకొచ్చారు. అక్కడే ఉన్న రాజవైద్యుడు సర్పాన్ని చూసి... ‘మహారాజా! ఈ పాము విషం చాలా ప్రమాదకరమైనది. కిరీటి గురి తప్పకుండా బాణం ప్రయోగించడం వల్ల గండం గడిచింది’ అన్నాడు.

సమీర వర్మ కిరీటితో... ‘నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నువ్వు ఏం కోరుకున్నా ఇస్తాను. కోరుకో’ అన్నాడు. ‘మహారాజా! నా ఊరు త్రిలింగపురం. మా ఊరిలో వైద్యశాల లేక జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి నిర్మించండి. మా గ్రామానికి నీటిని అందించే చెరువు పూడిపోయి ఉంది. మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తీసుకురండి. ఇలా చేస్తే... నీటి సమస్య తీరి మంచి పంటలు పండుతాయి. ఈ రెండు పనులూ చేస్తే చాలు’ అన్నాడు.

తన కోసం ఏమీ కోరుకోకుండా ఊరి జనం కోసం ఆలోచిస్తున్న కిరీటి వ్యక్తిత్వం, జన్మభూమి మీద ఉన్న భక్తి చూసి రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. కిరీటి కోరిన పనులు పూర్తి చేస్తానని, రాజ్యంలో మరిన్ని వైద్యశాలలు నిర్మిస్తానని, చెరువులకు మరమ్మతులు చేయిస్తానని మాటిచ్చాడు రాజు. కిరీటి నిజం చెబుతున్నా వినకుండా, సంఘటన జరిగిన ప్రదేశంలో విచారించడం, వెతికించడం ద్వారా నిజానిజాలు తెలుసుకోవచ్చన్న జ్ఞానం లేని, అసమర్థుడైన రక్షణాధికారిని పదవి నుంచి తొలగించాడు. కిరీటిని అన్ని విధాల పరీక్షించి సంతృప్తి చెంది రక్షణాధికారిగా నియమించాడు.

డి.కె.చదువులబాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని