story: నగల వ్యాపారి ఉపాయం..!

అవంతీ నగరంలో భూషణయ్యకు పెద్ద నగల దుకాణం ఉంది. అందులో ఇప్పటికే అయిదుగురు పని చేస్తున్నారు. ఇంకా ఒకరు కావాల్సి వచ్చింది. కొంతకాలంగా రామయ్య, భీమయ్య.. రోజు వారి వేతనంతో పని చేస్తున్నారు.

Published : 11 Jul 2024 00:24 IST

వంతీ నగరంలో భూషణయ్యకు పెద్ద నగల దుకాణం ఉంది. అందులో ఇప్పటికే అయిదుగురు పని చేస్తున్నారు. ఇంకా ఒకరు కావాల్సి వచ్చింది. కొంతకాలంగా రామయ్య, భీమయ్య.. రోజు వారి వేతనంతో పని చేస్తున్నారు. వారిలో నుంచి ఒకరిని.. శాశ్వతంగా కొలువులోకి తీసుకోవాలని అనుకున్నాడు భూషణయ్య. అందుకోసం.. వారికి పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

ఎప్పటిలాగే రామయ్య, భీమయ్య కొట్టుకు వచ్చారు. ముందుగా భీమయ్యను లోపలికి పిలిచి, తాళం వేసి ఉన్న ఒక నగల పెట్టెను ఇచ్చి.. ‘ఈ పెట్టెను జాగ్రత్తగా సీతాపురం గ్రామాధికారికి ఇచ్చి రా!’ అన్నాడు భూషణయ్య. దాని తాలూకా తాళంచెవి గురించి ఏమీ అడగకుండానే.. అలాగేనంటూ ఆ పెట్టెను తీసుకుని వెళ్లిపోయాడు భీమయ్య. తర్వాత రామయ్యను కూడా పిలిచి అలాగే తాళం ఉన్న పెట్టె ఇచ్చి.. ‘పార్వతీపురం గ్రామాధికారికి ఇచ్చి రా!’ అన్నాడు. దానికి.. ‘అలాగేనండీ! మరి ఈ పెట్టె తాళంచెవి కూడా ఇవ్వండి’ అన్నాడు రామయ్య. ‘దీని తాళంచెవి కనిపించడంలేదు. కనకయ్య ఎక్కడో దాచి ఉంటాడు. అతను ఇంకా దుకాణానికి రాలేదు.. వచ్చాక పంపుతాను నువ్వు వెళ్లు’ అన్నాడు భూషణయ్య. ‘అలాగే వెళ్లి వస్తాను’ అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు రామయ్య.

భీమయ్యకు వెళ్తూ ఉండగా.. పెట్టెను తెరిచి చూడాలనే ఆలోచన కలిగింది. ఒక చోట కూర్చుని.. రాయితో పెట్టెకున్న తాళాన్ని పగలగొట్టాడు. దాంతో తాళం ఊడి కింద పడింది. అందులో ధగధగా మెరుస్తున్న హారం కనిపించింది. అది చూసి ఆశ్చర్యపోయిన భీమయ్య.. ‘ఎంత చాకిరీ చేసినా, యజమాని శాశ్వతమైన కొలువు ఇవ్వడం లేదు. ఈ నగ అమ్మగా వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు. సీతకు కాస్త బంగారం కూడా కొనొచ్చు’ అనుకుంటూ.. పక్క ఊరిలో ఉన్న బంగారం దుకాణానికి బయలుదేరాడు.
రామయ్య పార్వతీపురం గ్రామాధికారి ఇంటికి చేరుకుని.. ‘మా యజమాని భూషణయ్య ఈ నగల పెట్టెను మీకు ఇవ్వమని పంపించారు. దీని తాళంచెవి కనకయ్య తెచ్చి ఇస్తాడు. మీరు పెట్టె అందినట్లు.. నాకు ఒక చీటీ రాసివ్వండి’ అన్నాడు. చెప్పినట్లుగానే ఆయన.. పెట్టె తీసుకున్నట్లు చీటీ రాసిచ్చాడు. అది తీసుకొని తిరుగు పయణమయ్యాడు రామయ్య. కాసేపటికి కనకయ్య పార్వతీపురం గ్రామాధికారి ఇంటికి చేరుకుని, తాళంచెవి ఇచ్చాడు. ఆయన ఆ పెట్టెను తెరిచి చూశాడు. అందులో ఒక కాగితం కనిపించింది. వెంటనే దాన్ని తీసి చదివాడు. అందులో.. ‘గ్రామాధికారికి నమస్కారం.. ఈ పెట్టె తెచ్చిన రామయ్యను పరీక్షించడానికి నకిలీ హారాన్ని ఇచ్చి పంపాను. తాళంచెవి కనకయ్యతో పంపిస్తాను అని చెప్పాను’ అని రాసి ఉంది. దాంతో.. ‘విషయం తెలిసింది. ఈ పెట్టెను కూడా తీసుకెళ్లు’ అని కనకయ్యకు ఇచ్చాడు గ్రామాధికారి. దానికి కారణమేంటో.. తెలియక కాసేపు ఆలోచించి, బయలుదేరాడతను.

అక్కడ భీమయ్య హారాన్ని తీసుకొని బంగారం దుకాణానికి చేరుకున్నాడు. ‘ఇది తీసుకొని, ఎంత డబ్బు వస్తే అంత ఇవ్వండి’ అని ఆ దుకాణ యజమానితో అన్నాడు. దాన్ని పరీక్షించి.. ‘ఇది నకిలీ హారం’ అన్నాడు ఆ యజమాని. దాంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన భీమయ్య.. ‘నన్ను పరీక్షించడానికే యజమాని ఇలా ఇచ్చి ఉంటారు. ఇప్పుడేం చేయాలి. దుకాణానికి వెళితే దొరికిపోతాను. పరువు పోతుంది’ అనుకొని నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. రామయ్య నగరం చేరుకుని భూషణయ్యకు గ్రామాధికారి రాసిచ్చిన చీటీ ఇచ్చాడు. అతని కంటే ముందుగా బయలుదేరిన భీమయ్య, రాత్రి అవుతున్నా ఇంకా దుకాణానికి చేరుకోలేదు. ఇక అతను రాడు.. అని భూషణయ్యకు అర్థమైంది. దాంతో.. ‘రామయ్యా! నేను చెప్పకుండానే పెట్టె ముట్టినట్టు కాగితం కూడా అడిగి తీసుకొచ్చావు. నీకు ఈ రోజు నుంచి శాశ్వతమైన కొలువును ఇస్తున్నాను. నిజాయితీగా పని చేసుకో! అన్నాడు భూషణయ్య. అత్యాశకు పోయిన భీమయ్య.. ఉన్న కొలువును కోల్పోయాడు. చెప్పిన పని శ్రద్ధగా చేసిన రామయ్య శాశ్వత కొలువును పొంది ఆనందంగా ఉన్నాడు.

యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని