అమ్మ చెప్పింది.. చింటూ విన్నాడు!

ఉదయం నిద్రలేవగానే వంటింట్లో వంట చేస్తున్న అమ్మ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు చింటూ. ‘అమ్మా.. ఈరోజు శ్రీరామనవమి పండుగ అంట కదా!’ అని అడిగాడు.

Published : 30 Mar 2023 00:29 IST

దయం నిద్రలేవగానే వంటింట్లో వంట చేస్తున్న అమ్మ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు చింటూ. ‘అమ్మా.. ఈరోజు శ్రీరామనవమి పండుగ అంట కదా!’ అని అడిగాడు. ‘అవును.. శ్రీరామనవమి గురించి నీకేం తెలుసో చెప్పు నాన్నా..’ అంటూ కొడుకు బుగ్గ నిమురుతూ అడిగిందా తల్లి. ‘రాముడి ఆలయం దగ్గర పందిళ్లు వేసి.. వడపప్పు, పానకం పంచుతారు కదమ్మా’ అని జవాబిచ్చాడు చింటూ.

‘ప్రతి పండుగని జరుపుకోవడం వెనుక ఒక చక్కని ఉద్దేశం దాగి ఉంటుంది. ఆ పండుగ గురించిన చరిత్రను తెలుసుకుంటే.. మంచి నడవడిక అలవడుతుంది. అలాగే శ్రీరామనవమి పండుగకి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. శ్రీరాముడు జన్మించిన చైత్రశుద్ధ నవమి రోజునే మనం పండుగ జరుపుకొంటాం.

మరో విశేషం ఏంటంటే.. సీతారాముల కల్యాణం కూడా ఇదే తిథి నాడు జరిగిందట. అంతే కాదు చింటూ.. పద్నాలుగేళ్ల వనవాసం, సీతమ్మని అపహరించిన రావణుడుని చంపి, తిరిగి అయోధ్య చేరిన తరువాత శ్రీరాముడి పట్టాభిషేకం కూడా నిర్వహించారట. చూశావా.. ఈ రోజుకి ఎన్ని విశిష్టతలు ఉన్నాయో!’ అంది అమ్మ. ‘అవునమ్మా.. రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు.. ఇలా చాలా మంది గురించి ఉంటుంది కదా.. ఆ వివరాలూ చెప్పవా..’ అంటూ మురిపెంగా అడిగాడు చింటూ. ‘శ్రీరాముడు వంటి మహనీయుల గురించి తెలుసుకోవడమే కాదు.. వారిని ఆదర్శంగా తీసుకొని, వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. రాముడు తల్లిదండ్రుల మాట ఎప్పుడూ జవదాటలేదు’ అంది అమ్మ.

‘అలాగేనమ్మా.. నేను కూడా నీ మాట, నాన్న మాట అస్సలే కాదనను.. ఇకనుంచి మీరు చెప్పినట్లే నడుచుకుంటాను’ అన్నాడు చింటూ. ‘నా బంగారు కొండవి నువ్వు.. అంతే కాదు నాన్నా.. శ్రీరాముడిది ఒకేమాట, ఒకే బాణం.. తండ్రికిచ్చిన మాటకి కట్టుబడి పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు’ అని చెప్పింది అమ్మ. ‘అయ్య బాబోయ్‌.. పద్నాలుగేళ్లా? అయితే, నీకు ఇప్పుడే సారీ చెబుతున్నానమ్మా..’ అన్నాడు చింటూ. ‘ఎందుకు?’ అని ఆశ్చర్యంగా అడిగిందామె.

‘మొన్న ఒకరోజు బడి నుంచి రాగానే.. తెల్లవారుజామునే చదువుకుంటానని నీతో చెప్పి నిద్రపోయా కదా.. కానీ, ఉదయాన్నే నువ్వు నిద్రలేపినా నేను లేవలేదు కదా.. ఇకపై ఎప్పుడూ అలా మాట తప్పనమ్మా..’ అంటూ బాధపడ్డాడు చింటూ.

‘అలాగే నా చిట్టి తండ్రీ.. ఇంకో విషయం ఏంటంటే.. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడిని చూసి.. సోదరులు ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. అరణ్యవాసంలోనూ లక్ష్మణుడు, రాముడి వెంటే ఉన్నాడు’ అందా తల్లి. అంతేకాదు.. శ్రీరాముడికి హనుమంతుడు నమ్మిన బంటు అని నీకు తెలుసు కదా.. నమ్మకం అంటే అలా ఉండాలి. ఎన్ని కష్టాలొచ్చినా, ఇచ్చిన మాటను తప్పకూడదు. రావణుడు ఎంత పండితుడైనా, మాయమాటలు చెప్పి సీతను అపహరించడంతో రాముడి చేతిలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.. అందుకే, ఇతరులతో ఎప్పుడూ గౌరవభావంతో మెలగాలి’ అని వివరించింది అమ్మ.

‘ఇప్పుడు నువ్వు చెప్పిన అంశాలన్నీ తప్పకుండా పాటిస్తానమ్మా.. ఇవన్నీ రేపు మా స్నేహితులకు కూడా వివరిస్తా’ అంటూ సంబరపడ్డాడు చింటూ. ‘సరే సరే.. నువ్వు త్వరగా తయారై వస్తే, శ్రీరామనవమికి ప్రత్యేకంగా తయారు చేసిన వడపప్పు, పానకం ప్రసాదం ఇస్తా’ అని అమ్మ అనడంతో.. ‘అలాగేనమ్మా..’ అంటూ గబగబా కదిలాడు చింటూ.

కొమ్ముల వెంకట సూర్యనారాయణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని